శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Aug 26, 2020 , 01:58:34

విజ్ఞాన వారధి.. వీఎల్సీ

విజ్ఞాన వారధి.. వీఎల్సీ

కొవిడ్‌ మహమ్మారి కారణంగా బడులు మూతబడ్డాయి. అయితే గురుకులాల విద్యార్థులకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ బోధన చేపట్టింది. విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా పాఠాలు బోధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్‌, టెలివిజన్‌లు లేకపోవడం ఆటంకంగా మారింది. దీంతో గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌, రీజినల్‌ కోఆర్డినేటర్‌, కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామాల్లో లర్నింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఫోన్‌, టీవీలు లేని పిల్లలను గుర్తించి నెల రోజులుగా బోధిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో 95 సెంటర్లలో పిల్లలకు బోధిస్తున్నారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో డిగ్రీ చదువుతున్న విద్యార్థులే తమ పరిధిలో ఐదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఉన్న పిల్లలకు వీఎల్సీల్లో బోధిస్తున్నారు. ఇందుకు గురుకుల ఉపాధ్యాయులు, స్వేరో మిత్రుల సాయం తీసుకుంటున్నారు. గ్రామానికి  ఇద్దరు డిగ్రీ విద్యార్థులను మెంటర్స్‌గా పెట్టారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలంలో శాయంపేట, పత్తిపాక, మైలారం, కొత్తగట్టుసింగారం, కాట్రపల్లి గ్రామాల్లో వీఎల్సీలు కొనసాగుతున్నాయి. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఒక్కో వీఎల్సీలో పది మంది పిల్లలకు మించకుండా బోధన చేస్తున్నారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఎక్కువమంది పిల్లలు ఉంటే రెండు సెక్షన్లుగా చేసి మధ్యాహ్నం రెండు గంటల నుంచి బోధిస్తున్నారు. ప్రతి రోజు మూడు తరగతుల్లో ఐదు సబ్జెక్టులు చెబుతున్నారు. రెండ్రోజులకు ఒకసారి స్లిప్‌ టెస్టులు పెడుతున్నారు. దగ్గరలోని సాంఘిక సంక్షేమ గురుకులాల ప్రిన్సిపాళ్లు మాస్కులు, శానిటైజర్లు అందించి ప్రోత్సహిస్తున్నారు. మండలంలోని మైలారంలో మొదట సక్సెస్‌ అయిందని, దీంతో తెలంగాణలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్‌ జిల్లాలో 1700 వీఎల్సీలను ఏర్పాటు చేసినట్లు ట్రైనర్‌ మారెపల్లి మనోజ్‌ తెలిపారు.  

రోజూ పాఠాలు నేర్చుకుంటున్నాం

 మా ఇంటి వద్దనే పాఠ్యాంశాలు బోధించడంతోపాటు స్లిప్‌ టెస్టులు పెడుతున్నారు. చదువుతోపాటు ఆటలు, పాటలు నేర్పుతున్నారు. సబ్జెక్టుల్లో అనుమానాలంటే స్వేరోస్‌ను అడుగుతున్నాం. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే నేర్చుకుంటున్నాం. గురుకులాల్లో లేమన్న బాధ లేదు. 

-మారెపల్లి జానెట్‌, ఆరో తరగతి, సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల విద్యార్థిని, శాయంపేట

విద్యకు పిల్లలు దూరం కావొద్దనే వీఎల్సీలు  

కరోనా కాలంలో పిల్లలు విద్యకు దూరం కావొద్దనే రాష్ట్రంలో 4వేలకు పైగా సెంటర్లను ఏర్పాటు చేశారు. రోజూ నాలుగు నుంచి ఐదు సబ్జెక్టులను బోధిస్తున్నారు. నేర్చుకున్న పాఠ్యాంశానికి సంబంధించి పరీక్షలు పెడుతున్నారు. అనుబంధ కాంపిటీషన్లను వీఎల్సీల్లో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సొసైటీ, స్వేరో సహకరిస్తున్నది. పత్తిపాక, శాయంపేటలో తెలంగాణ గురుకులాల అకడమిక్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నా. ఇప్పటి వరకు బోర్డులు, బుక్స్‌, పెన్నులు, మెటీరియల్స్‌ నేనే సమకూర్చా. 

-మారెపల్లి మనోజ్‌కుమార్‌, అకడమిక్‌ ట్రైనర్‌, శాయంపేట