శుక్రవారం 22 జనవరి 2021
Warangal-rural - Aug 24, 2020 , 03:26:22

చెరువుల్లొ చేప‌ల పండుగ‌

చెరువుల్లొ చేప‌ల పండుగ‌

  • నీలి విప్లవానికి మార్గం సుగమం
  • చేప పిల్లలు వదిలేందుకు తొలగిన అడ్డంకులు
  • ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు
  • జిల్లాల వారీగా టెండర్లు ఖరారు
  • నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో పంపిణీకి ఏర్పాట్లు
  • మైలారం రిజర్వాయర్‌, బయ్యారం పెద్దచెరువులో చేప పిల్లలు పోయనున్న మంత్రులు శ్రీనివాస్‌యాదవ్‌, ఎర్రబెల్లి, సత్యవతి
  • మత్స్యకారుల్లో వెల్లువెత్తుతున్న ఆనందం

జల వనరుల్లో మత్స్య సంబురం మొదలుకానుంది. టెండర్ల కారణంగా ఈ నెల 5న ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ ప్రక్రియ నిలిచిపోగా తాజాగా కోర్టు తీర్పుతో అడ్డంకి తొలగిపోయింది. ఈమేరకు సోమవారం నుంచి అన్ని జిల్లాల్లో చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ ఏర్పాట్లు చేసింది.  వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం రిజర్వాయర్‌తో పాటు మహబూబాబాద్‌ జిల్లాలోని బయ్యారం పెద్దచెరువులో జిల్లా మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌తో కలిసి పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చేప పిల్లల్ని వదిలి నీలి విప్లవానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఏడాది కొంత ఆలస్యమైనప్పటికీ వచ్చే నెలాఖరులోగా లక్ష్యం మేరకు సీడ్‌ పోసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా మత్స్యకారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

 వరంగల్‌ రూరల్‌/మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ : ఉమ్మడి జిల్లాలోని జల వనరుల్లో చేప పిల్లల్ని వదిలేందుకు మార్గం సుగమమైంది. కోర్టు తీర్పుతో అడ్డంకులు తొలగడంతో ఇక ప్రతి చెరువు, రిజర్వాయర్‌లో చేప పిల్లల విడుదలకు మత్స్యశాఖ ప్రణాళిక రూపొందించింది. ఈమేరకు నేటి నుంచి అన్ని జిల్లాల్లో పిల్లల్ని పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా సోమవారం వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని మైలారం రిజర్వాయర్‌తో పాటు మహబూబాబాద్‌ జిల్లాలోని బయ్యారం పెద్దచెరువులో మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జిల్లా మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతితో కలిసి చేపపిల్లలను వదలనున్నారు.

ఈసారి ఆలస్యంగా..

మత్స్యశాఖ అధికారులు వానకాలం ఆరంభంలో గుత్తేదార్లను ఎంపిక చేసి ఆయా చెరువు, రిజర్వాయర్‌లో చేప పిల్లలను వదులుతారు. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీ నుంచి ఉచిత చేప పిల్లలను పోయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కేవలం 25 జిల్లాల్లోనే ప్రారంభమైంది.  మిగతా ఎనిమిది జిల్లాల్లో ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాలు ఉన్నాయి. ఇటీవల మత్స్యశాఖ ఈ జిల్లాల్లోని వదలాల్సిన చేప పిల్లల సరఫరా కోసం టెండర్లు నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనగా వీరిలో ఓ కాంట్రాక్టర్‌ మత్స్యశాఖ అధికారులు టెండర్లు ఖరారు చేయడంపై కోర్టును ఆశ్రయించారు. ఈ కారణంగా ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమం వాయిదా పడింది. తాజాగా కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో సోమవారం నుంచి చేప పిల్లలను విడుదలకు మార్గం సుగమమైంది. ఇప్పటికే కొంత ఆలస్యమైనందున వెంటనే చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చే పనిలో మత్స్యశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.

రూరల్‌ జిల్లా లక్ష్యం.. 2.52 కోట్లు

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఈ ఏడాది 2.52 కోట్ల చేప పిల్లలు వదిలేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం జిల్లాలో 849 చెరువులు, 2 రిజర్వాయర్లు ఉన్నాయి. రిజర్వాయర్లలో ఒకటి మైలారం, రెండోది చలివాగు ప్రాజెక్టు. గతేడాది 810 చెరువులు, రిజర్వాయర్లలోనే 2.20 కోట్ల చేప పిల్లలను వదిలారు. ఈసారి లక్ష్యానికి అనుగుణంగా పిల్లలను పోసేందుకు ప్రణాళిక రూపొందించారు. రిజర్వాయర్లలో బొచ్చె, రవ్వు, మెరిగె రకాలను వదలనున్నారు. అలాగే చెరువుల్లో బొచ్చె, రవ్వుతో పాటు బంగారుతీగ చేప పిల్లలు పోయాని నిర్ణయించారు. ఇందుకుగాను చేప పిల్లలను సరఫరా చేసేందుకు ముగ్గురు కాంట్రాక్టర్ల టెండర్లను ఖరారు చేశారు. జనగామ జిల్లాకు చెందిన స్ఫూర్తి ఫిష్‌ సీడ్స్‌(16.92 లక్షల పిల్లలు), వరంగల్‌లోని ఉర్సు సాయినాథ్‌ ఫిష్‌ సీడ్స్‌(91 లక్షలు), వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని సంగెం మండలం మొండ్రాయి బయ్య బుచ్చిబాబు(1.45 కోట్లు) చేప పిల్లల సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరిందని మత్స్యశాఖ జిల్లా అధికారి నరేశ్‌కుమార్‌ నాయుడు తెలిపారు. జిల్లాలో 202 మత్స్య సహకార సంఘాలు పనిచేస్తుండగా 17,655 మంది సభ్యులు ఉన్నారు. వంద శాతం సబ్సిడీపై ప్రభుత్వం చేప పిల్లలను అందజేస్తుండడం వల్ల వీరందరికీ ఉపాధి కలగనుంది.

మహబూబాబాద్‌ జిల్లాలో 4.52కోట్లు..

మహబూబాబాద్‌ జిల్లాలో నేటి నుంచి చేప పిల్లల పంపిణీ ప్రారంభం కానుంది. మొత్తం 4.52కోట్ల పిల్లలను 1,070 చెరువుల్లో వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈమేరకు 16 మండలాల్లో 1560 చెరువుల్లో వదలనున్నారు. గతేడాది 4.26 కోట్ల పిల్లలను వేసిన అధికారులు ఈసారి అదనంగా 26 లక్షల చేపలను వదలనున్నారు. అలాగే 30 నుంచి 40 మిల్లీమీటర్ల పొడవున్న చేపలు 2.21కోట్లు, 80 నుంచి 100 మి.మీ సైజు ఉన్నవి 2.31కోట్లు పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఒక హెక్టారుకు చిన్న చేప పిల్లలైతే 3వేలు, పెద్దవైతే 2వేల చొప్పున పంపిణీ చేయనుండగా ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. వచ్చే నెలాఖరులోగా పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 150 మత్స్యకార సంఘాలు 9,827 మంది సభ్యులున్నారు. గతంలో చేప పిల్లల పెంపకం తక్కువగా ఉండగా ప్రభుత్వం వంద శాతం రాయితీతో నాణ్యమైన పిల్లల్ని పంపిణీ చేస్తుండడంతో మత్స్యకారుల ఆదాయం రెట్టింపయ్యింది.

గతేడాది కంటే ఎక్కువే..

చేప పిల్లలు పోసేందుకు టెండర్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది 4.52కోట్ల పిల్లలను పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించాం. జిల్లాలో నేటి నుంచి పంపిణీ ప్రారంభిస్తాం. 2016లో 1.01కోట్లు, 2017లో 4.20కోట్లు, 2018లో 3.88కోట్లు, 2019లో 4.26 కోట్ల చేప పిల్లల్ని పంపిణీ చేశాం.

నేడు రెండు చోట్ల ప్రారంభించనున్న మంత్రులు..

సోమవారం రెండు జిల్లాల్లో చేప పిల్లలను వదిలేందుకు ముహూర్తం ఖరారైంది. వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం రిజర్వాయర్‌లో ఉదయం 10 గంటలకు రాష్ట్ర పశుసంవర్దక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చేప పిల్లలను విడుదల చేయనున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జిల్లా కలెక్టర్‌ ఎం.హరిత, మత్స్యశాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలంలోని పెద్దచెరువులో మంత్రి తలసాని చేప పిల్లలు పోయనుండగా అధికారులు ఏర్పాట్లుచేశారు. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌తో పాటు జడ్పీ చైర్‌పర్సన్‌ అంగోత్‌ బిందు, ఎంపీ మాలోత్‌ కవిత, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొనున్నారు

.- మత్స్యశాఖ జిల్లా అధికారి, ఆంజనేయులు, మహబూబాబాద్‌


logo