బుధవారం 21 అక్టోబర్ 2020
Warangal-rural - Aug 21, 2020 , 10:48:03

బ‌ల‌మైన జ‌ల‌బంధం

బ‌ల‌మైన జ‌ల‌బంధం

  • సర్కారు ‘బండో’బస్త్‌ సంకల్పానికి ఊరూరా సాక్ష్యం
  • ‘మిషన్‌ కాకతీయ’తో చెరువులు పటిష్టం
  • గండ్లు పడకుండా ‘కట్ట’ దిట్టం
  • మత్తళ్లు, కాల్వలు బలోపేతం
  • నాడు చిన్నపాటి వర్షాలకే కొట్టుకుపోయిన దైన్యం
  • నేడు కుండపోత వానల్లోనూ చెక్కుచెదరని నిర్మాణం
  • భారీ వరదలకు తట్టుకొని ఠీవీగా కట్టలు
  •  కొండంత ధైర్యంతో ఆయకట్టు రైతులు

సీన్‌-1 : ఐదారేళ్ల క్రితం వానకాలం వచ్చిందంటే రైతులకు భయం పట్టుకునేది.. వరద పొంగిందంటే గుండె దడదడలాడేది. చెరువు కట్టకు గండి పడి ఎక్కడ పంటలు మునుగుతాయోనని వారి కంటికి కునుకుండకపోయేది. నాలుగైదు రోజులు సాధారణ వర్షాలు పడినా, చాలా సందర్భాల్లో కట్టలకు గండ్లు పడి ఎకరాలకు ఎకరాలు నీట మునిగి అన్నదాతలకు కన్నీళ్లే మిగిలేవి. తెలంగాణలో చెరువులు తెగితే నీళ్లన్నీ దిగువకు వచ్చి తమ ప్రాజెక్టులు నిండుతాయన్న స్వార్థమే సీమాంధ్ర పాలకుల్లో కనిపించేది. 

సీన్‌-2 : వరుణుడి కరుణో.. ఉగ్రరూపమో గానీ, ఈ సీజన్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఎడతెరిపి లేకుండా కుండపోత పోస్తున్నాయి. ఊర్లకు ఊర్లనే వరదలు చుట్టుముట్టాయి.. కానీ, ఉమ్మడి జిల్లాలో ఒకట్రెండు మినహా ఏ చెరువు కట్టకూడా తెగలేదు.. ఒకప్పుడు వందల సంఖ్యలో పడ్డ బుంగలు, నేడు మూడు, నాలుగు చోట్ల మినహా ఎక్కడా పడలేదు. మత్తళ్లు, డిస్ట్రిబ్యూటరీ, పంటకాల్వలు ధ్వంసం కాలేదు.. అలుగుపారితే తప్ప తటాకాల నుంచి చుక్క నీరు కూడా బయటకు పోలేదు. నిండుకుండల్లా మారిన చెరువులకు ‘బండో’బస్త్‌గా నిలిచిన కట్టలు, సాగుపై రైతులకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. స్వరాష్ట్రంలో సర్కారు సంకల్పం ఫలించిందనేందుకు ఊరూరా ‘మిషన్‌ కాకతీయ’ చెరువులు సాక్ష్యంగా నిలిచాయి.  

- వరంగల్‌ రూరల్‌/ మహబూబాబాద్‌/ జనగామ, నమస్తేతెలంగాణ/వరంగల్‌ సబర్బన్‌/ ములుగు/భూపాలపల్లి

జిల్లా మొత్తం    ‘మిషన్‌'కు నిధులు బాగైనవి ప్రగతి

చెరువులు ఎంపికైనవి

వరంగల్‌ అర్బన్‌ 671 403 రూ.180కోట్లు 353 50

వరంగల్‌ రూరల్‌ 1,050 748 రూ.283.04కోట్లు 730 18

మహబూబాబాద్‌ 1560 1080 రూ.392.34కోట్లు 1034 46

భూపాలపల్లి 1021 512 రూ.199.89కోట్లు 512 -

ములుగు 910 632 రూ.179.79కోట్లు 632 -

జనగామ 946 544 రూ.169.35కోట్లు 544 -

            వరంగల్‌ రూరల్‌/ మహబూబాబాద్‌/ జనగామ, నమస్తే తెలంగాణ/ వరంగల్‌ సబర్బన్‌/ ములుగు/భూపాలపల్లి : ఐదారేళ్ల క్రితం వర్షాకాలం వచ్చిందంటే అన్నదాతలను భయం పట్టి పీడించేది. వరదలు వచ్చే వానలు పడ్డయంటే ఆయకట్టు రైతులతో పాటు చెరువుల నీరటులకు కంటిమీద కునుకుండకపోయేది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చెరువులను కాపాడడం దుర్లభంగా ఉండేది. సీమాంధ్ర పాలకులు చెరువులు తెగితే నీళ్లన్నీ దిగువకు వచ్చి తమ ప్రాజెక్టులు నిండుతాయనే స్వార్థమే చూపించారు తప్ప ఏనాడూ తెలంగాణలోని చిన్ననీటి వనరులను పట్టించుకున్న పాపాన పోలేదు. శాశ్వత మరమ్మతులు లేక చాలా చెరువులు ధ్వంసమయ్యాయి. శిఖం భూములు కబ్జాకు గురయ్యాయి. వరదల ఉధృతికి కట్టలు తెగిపోయేవి. బుంగలు పడి,

మత్తళ్లు కొట్టుకుపోయి చెరువులన్నీ చుక్క నీరు లేక ఖాళీ అయ్యేవి. వాటి కింద ఉన్న పంట పొలాలు కోతకు గురయ్యేవి. కోలుకోలేని రీతిలో రైతులకు నష్టం వాటిల్లేది. ‘మిషన్‌'తో అనూహ్య మార్పు స్వరాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014లో టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం కొలువుదీరింది. ప్రజావసరాలను గుర్తించి తీర్చే దిశగా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు 2015లో మిషన్‌ కాకతీయ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రతి చెరువును పక్కా ప్రణాళికతో పునరుద్ధరించేందుకు నాలుగేళ్ల పాటు దశలవారీగా ఈ పథకం కింద నిధులు కేటాయించింది. చెరువుల్లో పూడిక తీయించింది. కట్ట, తూములు, మత్తళ్లను బలోపేతం చేసింది. లైనింగ్‌, మట్టితో డిస్ట్రిబూటరీ, పంట కాల్వలను పటిష్టం చేసింది. చెరువులోకి వరద నీరు చేరే ఫీడర్‌ చానళ్లను పునరుద్ధరించింది. సకల జనులకు ప్రయోజనం కలిగేలా చెరువులను తీర్చిదిద్దింది. దీంతో వరద నీరు ఆటంకం లేకుండా చెరువుల్లోకి చేరుతున్నది. పూడిక తీతతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ప్రతి చెరువు కింద ఉన్న ఆయకట్టు పూర్తిగా సాగులోకి వచ్చింది. భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. చెరువుల్లో చేపల పెంపకంతో మత్స్యకారులకు ఉపాధి దొరికింది. మునుపెన్నడూ లేని రీతిలో ఈ ఏడాది కొద్ది రోజులనుంచి భారీ వర్షాలు కురిసి వరద పోటెత్తింది. అయినా ఒకటీరెండు మినహా చెరువులేవీ తెగకపోవడం,

కట్టలకు గండ్లు, బుంగలు పడకపోవడం, మత్తళ్లేవీ కొట్టుకుపోకుండా ఉండడం, ఏ ఒక్క చెరువులోంచి కూడా నీరు బయటకు వెళ్లకపోవడం విశేషం. మిషన్‌ కాకతీయతో తెలంగాణ ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించడం వల్లే తమకు కొండంత భరోసా దక్కిందని రైతులు హర్హం వ్యక్తం చేస్తున్నారు. అర్బన్‌లో రికార్డు స్థాయి 639 చెరువుల అలుగు వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో మొత్తం 671 చెరువులున్నాయి. రూ.180కోట్లతో 403 చెరువుల మరమ్మతులు చేపట్టారు. 353చెరువుల పనులు పూర్తికాగా మరో 50చెరువులకు సంబంధించి చిన్నచిన్న పనులు మిగిలి ఉన్నాయి. అన్ని చెరువుల కట్టలపై మొరం పోసి డోజర్లతో తొక్కించారు. తూములు కొత్తగా నిర్మించారు. మత్తళ్లను పునర్నిర్మించారు. ఈ తరుణంలో జిల్లాలోని అన్ని మండలాల్లో వారంలో రోజుల్లో సుమారు జిల్లా ఎడాది సగటు వర్షపాతం నమోదైంది. కేవలం నాలుగు రోజుల వర్షపాతమే 40 నుంచి 50 సెంటీమీటర్లుగా నమోదైంది. ఒక్క రోజే జిల్లాలోని అన్ని చోట్లా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై అనేక చెరువులు తెగిపోతాయని భావించారు. అందరి అంచనాలూ తలకిందులయ్యేలా ఏ ఒక్క చెరువు కూడా తెగకపోవడం గమనార్హం. ఇదంతా మిషన్‌ కాకతీయ మహిమేనని రైతులు సంబురపడుతున్నారు.

తాజా వర్షాలకు రికార్డు స్థాయిలో 639 చెరువులు మత్తళ్లు దంకుతుండడం విశేషం. మిగతా 32 చెరువులు కూడా 100 శాతం నీటితో నిండాయి. రూరల్‌ జిల్లాలో.. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో మొత్తం 1,050 చెరువులున్నాయి. వీటిలో 748 చెరువులను ప్రభుత్వం రూ.283.04 కోట్లతో పునరుద్ధరించింది. 730 చెరువుల పనులు పూర్తి కాగా, 18చెరువుల పనులు తుదిదశలో ఉన్నాయి. కట్టలు, తూములు, మత్తళ్లు, డిస్ట్రిబ్యూటరీలు, పంట కాల్వలను పటిష్టం చేశారు. ఫీడర్‌ చానళ్లన్నింటినీ అభివృద్ధి చేశారు. వారం పాటు ఏకధాటిగా కురిసిన వర్షాలతో జిల్లాలో చెరువులు తెగడం గానీ, మత్తడి కొట్టుకుపోవడం గానీ లేకపోవడం గమనార్హం. గీసుగొండ, శాయంపేట, నర్సంపేట, వర్ధన్నపేట మండలాల్లో కేవలం ఐదు చెరువు కట్టలు తెగినట్లు జల వనరుల శాఖ ఇంజినీర్లు వెల్లడించారు. మెజార్టీ చెరువులన్నీ సేఫ్‌గా ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో 1,546 చెరువులకు మత్తడి జిల్లావ్యాప్తంగా వారం నుంచీ కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చెరువుల్లోకి నీరు చేరినా కట్టలు చెక్కు చెదరలేదు. జిల్లా వ్యాప్తంగా 1,560 చెరువులున్నాయి.

వీటిలో 1,546 చెరువులు పూర్తిగా నిండి మత్తళ్లు పోస్తున్నాయి. 14చెరువులు 100శాతం నిండాయి. పైనుంచి ఎంత వరద వచ్చినా అలుగు ద్వారా దిగువకు పోవడం తప్ప ఎక్కడా కట్టలు తెగిన దాఖలాలు లేవు. గతంలో ఇలాంటి వర్షాలు పడితే దాదాపు 30శాతం చెరువులకు గండ్లు పడేవి. లేదంటే కట్టలు తెగిపోయేవి. జిల్లాలో కనీసం 520చెరువులకు గండ్లు పడి వాటికింద పంట పొలాలు నీట మునిగేవని, కొట్టుకుపోయేవని అధికారులే చెబుతున్నారు. కాగా మిషన్‌ కాకతీయ కింద నాలుగు విడుతల్లో 1,098 చెరువులకు రూ.392.34కోట్లతో పరిపాలనా అనుమతులు వచ్చాయి. వీటిలో 18 చెరువుల టెండర్లు రద్దయ్యాయి. 1080 చెరువుల పనులు చేపట్టగా 1,034 చెరువుల పనులు పూర్తి చేశారు. రూ.156.64కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారు. పెండింగ్‌ పనులను డిసెంబర్‌లోగా పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. 2015 నుంచి మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువులు పునరుద్ధరణకు నోచుకున్నాయి. జనగామ జిల్లాలో 525 చెరువులకు

మత్తడి పడ్డా.. జనగామ జిల్లాలో మొత్తం 946 చెరువులున్నాయి. వీటిలో 544 చెరువులను రూ.169.35 కోట్లతో మిషన్‌ కాకతీయలో భాగంగా పునరుద్ధరించారు. ఈ వానకాలంలో విస్తారంగా కురిసిన వర్షాలతో వరద పోటెత్తి 525చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. లింగాల ఘనపురం మండలంలో తొమ్మిది గొలుసుకట్టు చెరువులున్నాయి. వాటి పునరుద్ధరణను గత ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదు. దీంతో ఎప్పుడు వానలు కురిసినా పటేలుగూడెంలోని గూడెం చెరు వు కట్టకు తరచూ గండ్లు పడుతుండేవి. రాష్ట్ర ప్రభు త్వం మండలంలోని అన్ని చెరువులనూ మిషన్‌కాకతీయ ద్వారా బాగు చేసింది. ఇటీవలి వానలకు తోడు, చీటకోడూరు రిజర్వాయర్‌ నీరు విడుదల కావడంతో ఈ రెండు చెరువులూ మత్తడి దుంకుతున్నాయి. ములుగు జిల్లాలో చెరువులన్నీ నిండినా.. ములుగు జిల్లావ్యాప్తంగా తొమ్మిది మండలాల్లో 910 చెరువులున్నాయి. ఎడతెరిపిలేని, కుండపోత వానలతో 100శాతం చెరువులు మత్తడి పడుతున్నాయి. కానీ ఏ ఒక్క చెరువు కట్ట కూడా బుంగ పడకుండా వరద ప్రవాహానికి తట్టుకొని నిలిచిందంటే ‘మిషన్‌ కాకతీయ’ పథకం ఫలితమేనని చెప్పొచ్చు. జిల్లాలో నాలుగు విడతల కింద 632 చెరువుల మరమ్మతుల కోసం మిషన్‌ కాకతీయ ద్వారా రూ.179కోట్ల 79లక్షల 17వేలు ప్రభుత్వం విడుదల చేసింది. అన్ని చెరువుల్లోనూ పూడికతీత, కట్టల పునర్నిర్మాణం, తూముల మరమ్మతులు పూర్తి చేశారు. ములుగు మండలంలో 76, వెంకటాపూర్‌లో 92, గోవిందరావుపేటలో 59, ఏటూరునాగారంలో 53, కన్నాయిగూడెంలో 34, మంగపేటలో 67, తాడ్వాయిలో 76, వాజేడులో 53, వెంకటాపురం(నూగూరు)లో అత్యధికంగా 122 చెరువులు పునరుద్ధరణకు నోచుకొని వరద ఉధృతిని తట్టుకునేలా పటిష్టంగా మారాయి. భూపాలపల్లి జిల్లాలో..

ఈ జిల్లాలో 1021 చెరువులున్నాయి. వీటిలో 512 చెరువులను ప్రభుత్వం మిషన్‌ కాకతీయ ద్వారా పునరుద్ధరించింది. తాజాగా కురుస్తున్న వర్షాలతో అన్ని చెరువులూ మత్తడి పడుతున్నాయి. పెద్ద మొత్తంలో వరద వచ్చినా చెరువు కట్టలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. 26 చెరువులకు చిన్నపాటి బుంగలు పడడం తప్ప పెద్దగా నష్టం ఎక్కడా లేదని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. గతంలో సగం వరకు చెరువులు తెగిపోయేవని, ఇలాంటి భారీ స్థాయిలో వరదలు వస్తే సగానికి పైగా చెరువులకు గండ్లుపడేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు.

నాడు కడ‘గండ్లు’..నేడు నిండుకుండలు వరంగల్‌రూరల్‌, నమస్తేతెలంగాణ : చెన్నారావుపేట మండలం లింగాపురం ముత్యాలమ్మ చెరువుకు 2009లో కురిసిన వర్షాలతో గండి పడింది. కట్ట తెగిపోయి నీరుపూర్తిగా బయటకు వెళ్లిపోయింది. రైతులే ఇసుక బస్తాలను గండికి అడ్డుగా వేశారు. అయినా చెరువులో నీరు నిల్వక ఆయకట్టు సాగులోకి రాలేదు. 2010లో కురిసిన వానలకు లింగగిరిలోని బొల్లెబోయిన చెరువు గండి పడింది. కట్ట తెగిపోగా రైతులే ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. అప్పటికే చెరువులో నీరు బయటకు వెళ్లిపోవడంతో రైతులు ఆయకట్టు సాగు చేయలేకపోయారు. పత్తినాయక్‌తండాలో బూరుగుకుంటకు సైతం గండి పడగా రైతులు ఇసుక బస్తాలు వేశారు. ఉప్పరపల్లి పెద్దచెరువుకూ గండి పడగా రైతులు ఇసుక బస్తాలు అడ్డుగా వేసేసరికే చెరువు ఖాళీ అయింది. 2011లో కోనాపురం సరళచెరువు కట్టకు గండి పడగా రైతులు శ్రమించి ఇసుక బస్తాలు వేసినా ఫలితం లేకుండా పోయింది. ఆయా సంవత్సరాల్లో గండ్లు పడిన, తెగిన చెరువులను వానకాలం ముగిసిన తర్వాత సాగునీటి శాఖ ఇంజినీర్లు పరిశీలించి అంచనాలను గత ప్రభుత్వానికి పంపినా నిధులు మంజూరై మరమ్మతులు పూర్తయ్యేసరికి ఏండ్లు గడిచాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మిషన్‌కాకతీయ పథకాన్ని అమల్లోకి తెచ్చే దాకా ఇక్కడి రైతుల బాధ తీరలేదు. ఈ చెరువులన్నీ ఇప్పుడు బాగుకావడంతో పూర్తి ఆయకట్టును నిర్భయంగా అన్నదాతలు సాగు చేసుకుంటున్నారు.
logo