బుధవారం 25 నవంబర్ 2020
Warangal-rural - Aug 16, 2020 , 03:33:48

పల్లెప్రగతితో మారిన గ్రామాల రూపురేఖలు

పల్లెప్రగతితో మారిన గ్రామాల రూపురేఖలు

రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

వరంగల్‌ రూరల్‌ కలెక్టరేట్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా నేడు గ్రామాల రూపురేఖలు సమూలంగా మారిపోయాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రత్యేక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సీజనల్‌, అంటువ్యాధుల నివారణకు జూన్‌ 1నుంచి 8వరకు నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం కరోనా వైరస్‌ కట్టడికి ఎంతో దోహదం చేసిందని చెప్పారు. తెలంగాణ రాక ముందు గోదావరి, కృష్ణా నదులు, కాకతీయు ల చెరువులు ఎన్ని ఉన్నా ప్రజలు సాగు, తాగునీటికి గోసపడ్డారని, స్వరాష్ట్రంలో ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన సాగు, తాగునీటి ప్రాజెక్టులతో ప్రజలు, రైతుల గోత తీరిందని గుర్తు చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారమే నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం నియోజకవర్గ పరిధిలో ఎంపికైన లబ్ధిదారులకు చెక్కులను అందించారు.వేడుకల్లో ఎంపీలు పసునూరి దయాకర్‌రావు, ఎంపీ బండా ప్రకాశ్‌, నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆరూరి రమేశ్‌, చల్లా ధర్మారెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, కలెక్టర్‌ ఎం హరిత, అదనపు కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.