శనివారం 28 నవంబర్ 2020
Warangal-rural - Aug 16, 2020 , 03:28:19

హై అలర్ట్‌

హై అలర్ట్‌

  • సీఎం ఆదేశాలతో రంగంలోకి మంత్రులు 
  • గోదావరి తీర ప్రాంత గ్రామాల అప్రమత్తం 
  • జాతీయ విపత్తుల నివారణ బృందాల రాక
  • అత్యవసరాలకు సిద్ధంగా లైఫ్‌ జాకెట్లు 
  • మూసివేత దిశగా అన్ని రవాణా మార్గాలు 
  • మంత్రి ఎర్రబెల్లికి సీఎం కేసీఆర్‌ ఫోన్‌..
  • మంత్రి సత్యవతిరాథోడ్‌, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి దయాకర్‌రావు టెలీకాన్ఫరెన్స్‌         

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది. ఎడతెరపి లేకుం డా కురుస్తున్న భారీ వర్షాలతో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లాపై శనివారం సా యంత్రం సమీక్షించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు రాత్రి ఫోన్‌ చే శారు. కుందనపల్లి ఘటనతో పాటు వర్షాలపై అప్రమత్తం చే శారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి ఎర్రబెల్లి వెంటనే తన క్యాంపు కార్యాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మహబూబాబాద్‌లో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీ మాలోత్‌ కవిత, వరంగల్‌లోని ఎంపీలు డాక్టర్‌ బండా ప్రకా శ్‌, పసునూరి దయాకర్‌, వివిధ జిల్లాల జడ్పీ అధ్యక్షులు, ఎ మ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సీపీ, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలపై సీఎం కేసీఆర్‌ తనకు ఫో న్‌ చేసి ఆరా తీశారని చెప్పారు. మరో మూడు రోజులపాటు వానలు ఇలాగే కొనసాగే అవకాశాలున్నందున ప్రస్తుత పరిస్థితులను అనుసరించి రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేసినట్లు వివరించారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సైతం ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన విషయాన్ని గుర్తుచేస్తూ తాజా పరిస్థితులపై సమీక్షించానని పేర్కొన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లోని 2600 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. మరో ఆరు పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ఆదేశించామన్నారు. ములుగు జిల్లాలోని రెండు గ్రామాలు ముంపునకు గురయ్యాయని, జనగామ జి ల్లాలో మూడు చోట్ల ఇండ్లు కూలాయని చెప్పారు. మహబూబాబాద్‌ జిల్లాలో ఆకేరు వాగు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఈదులపూసలపెల్లి దగ్గర రోడ్డు తెగిందన్నారు. బయ్యారం నా మానాలమాడు, గూడూరు దగ్గర, మొండ్రాయిగూడెం వంటి ప్రాంతాల్లో రోడ్లు తెగిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఏడిగడ్డ తండలోని వరద నీటిలో ఉన్న 15 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిచినట్లు వివరించారు. నర్సంపేటలో ఎన్టీయార్‌ నగర్‌ ప్రజలను, పరకాలలో నార్లాపూర్‌లో 70 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. మరోవైపు ఇండ్లు కూలిపోయే ప్రమాదాన్ని అంచనావేసి ఆయా ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించామని చెప్పారు. మరో మూడు రోజలపాటు వర్షాలు కొనసాగితే పరిస్థితులు మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని గ్రహించి ముందు జాగ్రత్తగా అనేక చర్యలు తీసుకున్నట్లు మంత్రి వివరించారు. 

తీరప్రాంత ప్రజల అప్రమత్తం

గోదావరి తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని మంత్రి వెల్లడించారు. వరంగల్‌కు జాతీయ విపత్తుల నివారణ బృందాలను రప్పిస్తున్నామని పేర్కొన్నారు. 25 మంది సభ్యులకు రెండు పడవలను అందుబాటులో ఉంచామన్నారు. లైవ్‌ జాకెట్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని రకాల రవాణా మార్గాలను మూసివేసే దిశగా ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దు

భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వ్యవసాయ పనులు, చేపల కోసం రైతు లు, జాలర్లు  వెళ్లకూడదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు వీలుగా తగినన్ని పునరావాస కేం ద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.  అలుగుపారుతున్న చెరువులు, కుంటలపై ప్రత్యేక దృష్టి పెట్టి సాధ్యమైన మేరకు అవి తెగిపోకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే నీటిని బయటికి విడుదల చేయాలని సూచించారు. అన్ని కలెక్టరేట్లలో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేసి, టోల్‌ ఫ్రీ నంబర్లు పెట్టామన్నారు. వరంగల్‌ కార్పొరేషన్‌లో అదనంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామన్నారు. తుఫాన్‌ తీవ్రత తగ్గేదాకా మంత్రులు జిల్లాలోనే ఉండాలని,  ఎమ్మెల్యేలు ఎవరి నియోజకవర్గాల్లో వారే ఉండి సమీక్షలు నిర్వహించి అక్కడికక్కడే తక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు.   

నష్ట నివారణకు తక్షణ చర్యలు 

కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ, సమన్వయం చేస్తూ పరిస్థితి అదుపులోకి తేవాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా దీ ర్ఘకాలిక, ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. తాను వరంగల్‌, మంత్రి సత్యవతి రాథోడ్‌ మహబూబాబాద్‌ కేంద్రంగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని వివరించారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు.