శనివారం 05 డిసెంబర్ 2020
Warangal-rural - Aug 15, 2020 , 06:23:39

జోరువాన‌

జోరువాన‌

  • n జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం
  • n పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
  • n మత్తళ్లు దుంకుతున్న చెరువులు, కుంటలు
  • n జలదిగ్బంధంలో రహదారులు
  • n లోతట్టు ప్రాంతాలు జలమయం

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: ఆరు రోజులుగా వానలు విస్తారంగా కురుస్తుండడంతో జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన జలాశయాలతోపాటు చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్నాయి. హైదరాబాద్‌-భూపాలపట్నం 163 జాతీయ రహదారితోపాటు పలు కాజ్‌వేల పైనుంచి వరద ఉధృతి పెరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు శుక్రవారం సాయంత్రం నుంచి అలుగు పోస్తున్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 30.2 అడుగుల (3.23 టీఎంసీల సామర్థ్యం)కు చేరుకుంది. పాకాల ఆయకట్టు 29,516 ఎకరాలు. సరస్సు పూర్తిస్థాయిలో నిండితే వానకాలం సాగుపోగా యాసంగిలో 5 వేల నుంచి 15 వేల ఎకరాల వరకు సరిపడా సాగునీరుంటుంది. కాగా, గడిచిన ఆరేళ్లలో పంద్రాగస్టుకు ముందు మత్తడి పడడం ఇదే తొలిసారి. వర్ధన్నపేట మండలంలోని జలాశయాలన్నీ నిండి అలుగులు పోస్తున్నాయి.

ఆకేరువాగుపై నిర్మించిన చెక్‌డ్యాం ఉధృతంగా ప్రవహిస్తున్నది. నల్లబెల్లి చెరువును జడ్పీటీసీ మార్గం భిక్షపతి పరిశీలించారు. నర్సంపేట-నల్లబెల్లి ప్రధాన రహదారిలోని మాదన్నపేట లోలెవల్‌ వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. నర్సంపేట మండలంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దామెర మండలంలోని చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. ఆత్మకూరు మండలం కటాక్షపురం చెరువు మత్తడి పోస్తుండడంతో 163 జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. పరకాల ఆర్డీవో కిషన్‌, తహసీల్దార్‌ విక్రమ్‌కుమార్‌, సీఐ రంజిత్‌కుమార్‌ పర్యవేక్షిస్తున్నారు. పరకాల పట్టణంలో దామెర చెరువు మత్తడి పోస్తుండడంతో నీరంతా శ్రీనివాసకాలనీలోకి ప్రవేశించింది. హుజూరాబాద్‌ రోడ్డుపై భారీగా ప్రవహిస్తున్నది. అలాగే, పరకాల మండలంలోని చెరువులు ఉధృతంగా మత్తడి దుంకుతున్నాయి. దుగ్గొండి మండలంలోని దాదాపు అన్ని చెరువులు నిండాయి. చెన్నారావుపేట మండలంలో చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో మత్తళ్లు పోస్తున్నాయి. నెక్కొండ మండలంలో చెరువులన్నీ మత్తళ్లు దుంకుతున్నాయి. రెడ్లవాడలో చాగంటి రాములకు చెందిన ఇంటిగోడ కూలింది.

పత్తి పంటల్లో భారీగా వరదనీరు నిలిచింది. గీసుగొండ, నడికూడ మండలాల్లోని చెరువులు నిండి మత్తళ్లు దుంకుతుండగా, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పరకాల నుంచి అంబాల మీదుగా హన్మకొండకు వెళ్లే ప్రధాన రహదారిలో కంఠాత్మకూర్‌ వద్ద ఉన్న లోలెవల్‌ వంతెనపై నీటి ప్రవాహం పెరిగి రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని నార్లాపూర్‌లో ఇళ్లలోకి నీరు రావడంతో ఆ కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని తహసీల్దార్‌ అల్లం రాజ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.  ఆయన వెంట ఎంపీపీ మచ్చ అనసూర్య రవీందర్‌, సర్పంచ్‌ శనిగరపు నీల సమ్మయ్య ఉన్నారు. శాయంపేట మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సూరంపేట శివారులో కాజ్‌వేపై వరదనీరు ప్రవహిస్తుండడంతో పోచారానికి చెందిన ఇద్దరు బైక్‌పై వెళ్తూ పడిపోయారు. బైక్‌ కొట్టుకుపోతుండగా స్థానికులు తాళ్లతో బయటకు తీశారు. జోగంపల్లిలో ఒకరి ఇంటి గోడ కూలింది. రాయపర్తి మండలం మైలారం శివారులో వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై భారీ వృక్షాలు నేలకూలాయి. ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో ఎస్సై గోదరి రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో చెట్లను తొలగించారు. పర్వతగిరి మండలంలోని జలాశయాలు నిండాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ కిషన్‌ సూచించారు.