సోమవారం 30 నవంబర్ 2020
Warangal-rural - Aug 15, 2020 , 06:23:41

మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం

మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం

  • ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రోత్సాహం
  • n ప్రణాళికలతో వస్తే నిధులిచ్చేందుకు సిద్ధం
  • n కరోనా నివారణకు గ్రామ కమిటీలు వేయాలి
  • n రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • n కొత్తగట్టుసింగారం, ప్రగతిసింగారంలో  పంచాయతీ భవనాలకు ప్రారంభోత్సవం

శాయంపేట : రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు కోసం ప్రోత్సాహం అందించి మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శాయంపేట మండలం  కొత్తగట్టుసింగారం, ప్రగతిసింగారంలో జీపీ భవనాలు, గోవిందాపూర్‌లో బాలాజీ రోబో సాండ్‌ ప్లాంట్‌ను ఎంపీ బండా ప్రకాశ్‌, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, రూరల్‌ జడ్పీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, కలెక్టర్‌ హరితతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై ఇటీవల మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారని మహిళలు ధాన్యం మాత్రమే కాకుండా అన్ని రకాల పంటలు కొనుగోలు చేసి మార్కెటింగ్‌ చేసేందుకు ఎన్ని కోట్లయినా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు భూములివ్వడంతో పాటు కరెంటు బిల్లు మాఫీ చేసి వడ్డీ లేని రుణాలిచ్చేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఉప్పు, కారం, పసుపు వంటి అనేక ఉత్పత్తులను ఇకపై మహిళా సంఘాలే ప్రాసెసింగ్‌ చేసి అందించాలని పిలుపునిచ్చారు. మన దగ్గర కూరగాయలు పండించే అవకాశాలున్నా బయట నుంచి కొనుగోలు చేస్తున్నామని, పారిశ్రామికవేత్తలు, ధనవంతులే బాగుపడడం కాదని గ్రామాల్లోని పేద వర్గాలు కూడా అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళలు, యువకులు, రైతులు, ఔత్సాహికులు యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కొత్తగట్టు సింగారంలో యూనిట్‌ ఏర్పాటుకు మహిళలు ప్రణాళికలు అందిస్తే నిధులిచ్చేందుకు ముందువరుసలో ఉంటానని హామీ ఇచ్చారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ అహర్నిశలూ కృషి చేస్తున్నారని, కేసీఆర్‌ పాలన, పట్టుదల చూసి ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని పేర్కొన్నారు. ఐదేళ్లుగా హరితహారంలో భాగంగా నాటిన మొక్కల వల్లే ఇప్పుడు వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయన్నారు. కల్లాల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకూ నిధులిస్తున్నామని చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 40వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండిందని, ధర లేకున్నా ప్రభుత్వమే కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ధర లేకుంటే రైతులు పంటను గోదాములో నిల్వ చేసుకునే వీలు కల్పించి 75శాతం వడ్డీ లేకుండా అప్పు ఇస్తున్నామని చెప్పారు. 

గ్రామ కమిటీలు వేసుకోవాలి

మరో నెల రోజులైతే కరోనా పీడ పోతుందని, గ్రామాల్లో కరోనా నివారణ కోసం కమిటీలు వేసుకోవాలని మంత్రి సూచించారు. పంచాయతీలకు కొత్త భవనాల కోసం నిధులిస్తామన్నారు. భూపాలపల్లి నియోజకవర్గానికి అదనంగా రూ.25లక్షలతో సీసీ రోడ్లు మంజూరు చేస్తానని, కొత్తగట్టుసింగారంలో పెండింగ్‌ సీసీ రోడ్లకు నిధులిస్తానని హామీ ఇచ్చారు. మాందారిపేట నుంచి శాయంపేట, పత్తిపాక, మీదుగా ప్రగతిసింగారం దాకా డబుల్‌రోడ్డుకు నిధులిస్తామన్నారు.  

ఆదర్శ రాష్ట్రం తెలంగాణ : ఎమ్మెల్యే గండ్ర

దేశంలోనే తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పునరుద్ఘాటించారు. పంచాయతీల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ప్రతి నెలా రూ.339కోట్లు అందిస్తున్నారని గుర్తుచేశారు. సర్పంచులంతా అదృష్టవంతులని, నిధులున్నాయని, పనిచేసే సిబ్బందికి వేతనాలను పెంచామని చెప్పారు. ప్రతి పౌరుడు తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. చలివాగుతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మిషన్‌భగీరథ పథకం ద్వారా మంచినీళ్లు వస్తున్నాయని చెప్పారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి సొంత గ్రామాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. 

సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతోనే.. : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సులతోనే అభివృద్ధి పనులు చేపట్టినట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఇరవై రెండేళ్ల క్రితం ప్రగతి సింగారం నుంచి తాను షిఫ్ట్‌ అయ్యాయని ఆరోజు సిమెంటు రోడ్డు కూడా లేదని, రాళ్లతో లోతుగా ఉండేదన్నారు. ఆనాడు ఎంపీ నిధులతో సీసీ రోడ్లు వేయించినట్లు తెలిపారు. తన స్వగ్రామం ప్రగతిసింగారం అభివృద్ధికి నిధులు కావాలని సీఎం కేసీఆర్‌ను కోరగానే రూ.2.50కోట్లు మంజూరు చేశారని కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ పంచాయతీ భవనాన్ని అన్ని హంగులతో నిర్మించామన్నారు. గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సహకరించాలని, మాందారిపేట నుంచి శాయంపేట, పత్తిపాక మీదుగా ప్రగతిసింగారం, కటాక్షపూర్‌ వరకు డబుల్‌ రోడ్డు వేసేందుకు నిధులివ్వాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కోరారు. సింగారం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

‘కాళేశ్వరం’తో సస్యశ్యామలం : గండ్ర జ్యోతి

సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని రూరల్‌ జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. కేసీఆర్‌ సంకల్పానికి భగవంతుడు తో డుగా నిలుస్తున్నారన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా తమ దృ ష్టికి తేవాలని సూచించారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి మన జిల్లా నుంచే ఉండడం కలిసి వచ్చే అంశమన్నారు. మాందారిపేట-కటాక్షపూ ర్‌ డబుల్‌ రోడ్డు మంజూరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు పెంబర్తి సంతోష, బైరి శ్రీనివాస్‌, పోతు సుమలత, ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, జెడ్పీ సీఈవో రాజారావు, డీఆర్డీవో సంపత్‌రావు, ఆర్బీఎస్‌ అధ్యక్షుడు కర్ర ఆదిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గంగుల మ నోహర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ శరత్‌, గండ్ర భూపాల్‌రెడ్డి, గౌతంరెడ్డి, వైస్‌ ఎంపీపీ రాంశెట్టి లత, ఎంపీటీసీ గొట్టిముక్కుల స్వాతి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ సంపత్‌, ఎంపీడీవో సుమనవాణి పాల్గొన్నారు.