ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Warangal-rural - Aug 12, 2020 , 02:40:05

సమగ్రాభివృద్ధే టీఆర్‌ఎస్‌ సర్కారు ధ్యేయం

సమగ్రాభివృద్ధే టీఆర్‌ఎస్‌ సర్కారు ధ్యేయం

పరకాల టౌన్‌: గ్రామాల సమగ్రాభివృద్ధే టీఆర్‌ఎస్‌ సర్కారు ధ్యేయమని, ఆ దిశగా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మండలంలోని పోచారం గ్రామ పాలకవర్గం, ముఖ్య నాయకులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి, పెండింగ్‌ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పెండింగ్‌ పనులు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే అన్నారు. గ్రామ పంచాయతీలో నిల్వ ఉన్న నిధులతో వెంటనే గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో నూతనంగా పంచాయతీ భవనం, అంగన్‌వాడీ భవనం నిర్మించేందుకు అవసరమైన భూమిని గుర్తించడంతోపాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. ఏవైనా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తేవాలని సూచించారు. గ్రామాభివృద్ధికి అడ్డుపడేలా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామంలో ప్రజాప్రతినిధులు ఒకేతాటిపై నిలిచి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులందరికీ అందేలా కృషి చేసి అభివృద్ధిలో గ్రామాన్ని ముందువరుసలో నిలుపాలన్నారు.  పోచారం శివారులో రూ. 3.9 కోట్లతో హైలెవల్‌ వంతెన మంజూరైనా సంబంధిత కాంట్రాక్టర్‌ పనులు చేపట్టలేదని, సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈతో చల్లా ఫోన్‌లో మాట్లాడారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు చింతి రెండి సాంబరెడ్డి, సర్పంచ్‌ పద్మ బాపురెడ్డి, ఎంపీటీసీ కోరె రమేశ్‌, ఉపసర్పంచ్‌ అశోక్‌, ఎంపీవో నాగరాజు, ఏపీవో ఇందిర, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు సదానందం, నాయకుడు కోరె శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుతా

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకర్గంలోని ప్రతి గ్రామాన్ని సమస్యలు లేకుండా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు నూతన జిల్లాలు, మండలాలు, గ్రామాలను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌.. నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని ప్రవేశపెట్టి గ్రామ పంచాయతీలకు బాధ్యతలను మరింత పెంచి, పాలనలో పారదర్శకతను పెంచినట్లు వెల్లడించారు. దీంతోపాటు గ్రామపంచాయతీలకు గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక నిధులను కేటాయించి పంచాయతీరాజ్‌ వ్యవస్థను పటిష్టం చేశారన్నారు. హరితహారంలో  గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు రోడ్ల వెంట మొక్కలు నాటి సంరక్షిస్తున్నట్లు చెప్పారు. రోడ్లు, వీధిలైట్లు, మంచినీటి సరఫరా మెరుగై గ్రామాలు అభివృద్ధి బాటలో నిలుస్తున్నాయన్నారు.


logo