శనివారం 05 డిసెంబర్ 2020
Warangal-rural - Aug 12, 2020 , 02:40:04

జళకళ

జళకళ

ఖానాపురం/నర్సంపేట రూరల్‌/శాయంపేట/ఆత్మకూరు/పరకాల టౌన్‌/దుగ్గొండి, ఆగస్టు 11: జిల్లాలోనే ప్రధాన జలాశయమైన పాకాల సరస్సు నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 26 అడుగులకు చేరింది. మరో నాలుగు అడుగులకు చేరితే మత్తడి దుంకనుందని అధికారులు తెలిపారు. జిల్లాలోనే రెండో అతిపెద్ద చెరువైన నర్సంపేట మండలం మాధన్నపేట పెద్ద చెరువు మత్తడికి చేరువైంది. ప్రస్తుతం 15.3 ఫీట్లకు నీరు చేరగా, 17 ఫీట్లు వస్తే చెరువు అలుగు పోయనుంది. ఈ చెరువు కింద వరినాట్ల జోరందుకున్నాయి. జిల్లాలో రెండో పెద్ద జలాశయంగా పేరున్న శాయంపేట మండలం జోగంపల్లిలోని చలివాగు ప్రాజెక్ట్‌ అలుగు పోస్తున్నది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 560 ఎంసీఎఫ్‌టీ కాగా, ప్రస్తుతం 555 ఎంసీఎఫ్‌టీలకు చేరి అలుగు పడుతున్నట్లు అధికారులు చెప్పారు. కొన్నేండ్లుగా చలివాగు ప్రాజెక్టు అలుగు పోసిన దాఖలాలు లేవని రైతులు చెప్పారు. ఎగువన ఉన్న కటాక్షపూర్‌, నీరుకుళ్ల, దుగ్గొండి, వసంతాపూర్‌, పత్తిపాక చెరువుల నుంచి భారీగా వరద ప్రాజెక్టులోకి చేరి నిండుకుండలా మారింది. రిజర్వాయర్‌గా ఉన్న చలివాగులో గోదావరి జలాలను నింపుతు పంపింగ్‌ చేస్తున్నారు. అలాగే, మండలపరిధిలో 67 చెరువులు నిండి అలుగు పోస్తున్నట్లు ఇరిగేషన్‌ శాఖ ఇంజినీరింగ్‌ అధికారి తెలిపారు. 67 చెరువుల పరిధిలో 3,500 ఎకరాల ఆయకట్టు సాగవుతున్నట్లు చెప్పారు. ఆత్మకూరు మండలంలోని పలు చెరువులతోపాటు కటాక్షపురం పెద్ద చెరువు మత్తడి పోస్తున్నాయి. పరకాల పట్టణ శివారులోని చలివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. పరకాలలోని దామెర చెరువు పూర్తిస్థాయి నీటితో నిండుకుండలా కళకళలాడుతుంది. అలాగే, మిషన్‌ కాకతీయ పథకం కింద దుగ్గొండి మండలంలోని కాకతీయుల నాటి గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. చెరువుల మరమ్మతుతో వరదనీరు చేరి నిండుకుండలా కనిపిస్తున్నాయి. మండలంలోని 33 పంచాయతీల్లో మొత్తం 41 చెరువుల్లో మిషన్‌ కాకతీయ పనులు పూర్తి కావడంతో విస్తీర్ణం పెరిగి నీటి సామర్థ్యం పెరిగింది. రేకంపల్లి, వెంకటాపురం, మల్లంపల్లి, మందపల్లి, తిమ్మంపేట, దుగ్గొండి చెరువులు నిండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. ముదిరాజ్‌ సంఘాల నాయకులు, కులపెద్దలు చెరువుల్లో చేపలు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. చలపర్తి శివారు సింగరాయ చెరువు ప్రస్తుతం నిండుకుండను తలపిస్తున్నది.