బుధవారం 20 జనవరి 2021
Warangal-rural - Aug 11, 2020 , 01:41:01

అడ్డుకుంటే బుద్ధిచెప్తాం

అడ్డుకుంటే బుద్ధిచెప్తాం

  • పాకాల, రంగాయ ప్రాజెక్టులను ఆపాలని యత్నాలు
  • ఏపీ ప్రభుత్వంతో కలిసి కేంద్రం కుట్ర
  • దీని వెనుక ఎవరున్నారో బయట పెడ్తాం
  • ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
  • రామప్ప చెరువు వద్ద పనుల పరిశీలన     

నర్సంపేట : పాకాల, రంగాయ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు భారీ కుట్ర జరుగుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం పాకాల, రంగాయ ప్రాజెక్టుల పనులను రామప్ప చెరువు వద్ద ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తే తప్పకుండా బుద్ధి చెప్తామన్నారు. ప్రాజెక్టు పనులను ఆపేందుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి కేంద్రం ఉమ్మడి కుట్ర చేస్తున్నదని విమర్శించారు. గతంలో ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెల్చినోళ్లు దీనిపై ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. ఏ ఇబ్బందులూ లేని ప్రాజెక్టును అడ్డుకోవడం వెనుక ఎవరి కుట్ర దాగి ఉందో, రైతు నోట్లో మట్టి కొట్టుతున్నదెవరో అందరూ తెలుసుకోవాలన్నారు.

రైతుల పక్షాన పోరాడుతానని, పాకాల, రంగాయ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కాళ్లు కడుగుతానని స్పష్టం చేశారు. వందేళ్ల కల రామప్ప పాకాల, రంగాయ ప్రాజెక్టు అన్నారు. ఎందరో నాయకులు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారని, నర్సంపేటకు నీళ్ల కల వాళ్ల హ యాంలో ఎన్నికల హామీగానే మిగిలిందన్నారు. నీళ్లిస్తామని హామీచ్చి ప్రజలతో ఓట్లేయించుకొని, ఏనాడూ ఇటువైపు ఆలోచించిన పాపాన పోలేదన్నారు. నాడు ఈ ప్రాజెక్టు కడితే నేడు ఇక్కడి రైతులు ధనవంతులయ్యేవారు కాదా ? అని, తడారిన బీడు భూముల గోసకు కారణం ఎవరని ప్రశ్నించారు. ఎండిన బీడు భూముల కన్నీళ్లు తుడిచేందుకు నీళ్లు తెచ్చే యజ్ఞం చేపట్టామని, ఓర్వలేక ఎన్నో విమర్శలు చేశారని, అయినా ప్రజల కోసం సంకల్పంతో ముందుకు కదులుతున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఓడించినా నియోజకవర్గం బాగుండాలని శపథం పట్టి నాడే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో రంగాయ ప్రాజెక్టు రీడిజైన్‌ చేసి రామప్ప-పాకాల కొత్త ప్రాజెక్టును రైతుల అవసరాలకు అనుగుణంగా నిర్మించామని వివరించారు. 

రైతుల మోముల్లో ఆనందం విరిసే సమయానికి పాకాల, రంగాయ ప్రాజెక్టులు ఆపాలని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే కేంద్రం కూడా స్పందించి ఆపాలని ప్రకటన చేసిందన్నారు. దేవాదుల ద్వారా తుపాకుల గూడెం వద్ద 50 టీఎంసీలు, కంతనపల్లి వద్ద 50 టీఎంసీల నీటిని వాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే అనుమతులిచ్చిందని గుర్తు చేశారు. దేవాదుల ఫేజ్‌-1,2,3 ద్వారా నీళ్లు తీసేది కేవలం 38 టీఎంసీలేనన్నారు. ఫేజ్‌- 3 అనేది కొత్త ప్రాజెక్టు కాదని తెలిపారు. ఇప్పుడున్న రెండు పంపుల ద్వారా వచ్చే నీటిని ఇంటర్‌ లింక్‌ చేయడం కోసం ఏర్పాటు చేసిందన్నారు. అసలు ఫిర్యాదు చేసిన ఏపీ ప్రభుత్వానికి సోయి ఉందా అని ప్రశ్నించారు. దీని వెనుక ఎవరున్నారో బయట పెడ్తానని, ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించాలనుకుంటే తగ్గిన బుద్ధి చెప్తామన్నారు.  logo