సోమవారం 30 నవంబర్ 2020
Warangal-rural - Aug 10, 2020 , 01:16:54

అభివృద్ధిని అడ్డుకుంటే చర్యలు తప్పవు

అభివృద్ధిని అడ్డుకుంటే చర్యలు తప్పవు


పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల, నమస్తే తెలంగాణ : గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులను అడ్డుకుంటే చర్యలు తప్పవని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు. ఆదివారం హన్మకొండలో పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామస్తులతో ఎమ్మెల్యే సమావేశమై అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులను ఎవరు అడ్డుకున్నా చట్టపరమైన చర్యలుంటాయన్నారు. సమస్యల పరిష్కారానికే గ్రామాల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వెల్లంపల్లిలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. కాగా, రైతువేదిక నిర్మాణంతో చెరువులో చేపలు పెరగవని ముదిరాజ్‌ కులస్తులు ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో గ్రామానికి ఎంతో అవసరమైన రైతువేదిక నిర్మాణానికి అందరూ సహకరించాలని ధర్మారెడ్డి కోరారు. అలాగే, గ్రామంలోని వంకాయకుంటలోకి ఎస్సారెస్పీ నీరు రావడం లేదని గ్రామస్తులు తెలుపగా డీఈ బాలకృష్ణతో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడి నీరు వచ్చేలా చూడాలని ఆదేశించారు. అలాగే, గ్రామస్తుల సౌకర్యార్థం ఫంక్షన్‌హాల్‌ నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి పనిని నోటీసుబోర్డులో పేర్కొనాలని సర్పంచ్‌ కృష్ణకు సూచించారు.  కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, సర్పంచ్‌ వెలగందుల కృష్ణ, వార్డుసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.