బుధవారం 30 సెప్టెంబర్ 2020
Warangal-rural - Aug 09, 2020 , 11:35:38

సంఘాలకు ‘సహకారం’

సంఘాలకు ‘సహకారం’

  • పీఏసీఎస్‌ల పటిష్టతే లక్ష్యంగా సర్కారు చర్యలు
  • ఆర్థికాభివృద్ధికి రూ.2కోట్ల నిధులు !
  • విధివిధానాల రూపకల్పనలో టెస్కాబ్‌

సుబేదారి, ఆగస్టు 8 : మూసపద్ధతికి స్వస్తి పలుకుతూ కాలానికనుగుణంగా మార్పు చెందాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ సహకార సంఘా ల బలోపేతానికి శ్రీకారం చుట్టింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో నడుస్తున్న సంఘాలను లాభాల బాటాలోకి తీసుకురావడం కోసం ప్రభుత్వ ఆదేశాలతో తెలంగాణ స్టేట్‌ కోఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంకు, నాబార్డు ఉమ్మడిగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో గ్రామాల్లో రైతులకు సేవలు అందిస్తున్న పీఏసీఎస్‌లు సొంతం గా ఎదగడానికి ఆర్థిక చేయుతనివ్వాలనే లక్ష్యంతో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రత్యేక చర్య లు చేపట్టింది. సంఘాలను బలోపేతం చేయాలంటే ఏం చేయాలి?  ఉన్న వనరులు ఏంటి?  అనే దానిపై టెస్కాబ్‌, నాబార్డు ఉమ్మడిగా ఆపరేషన్‌ ప్రారంభించాయి.

ఈ మేరకు ఈ నెల 5న హైదరాబాద్‌లో నిర్వహించిన  టెస్కాబ్‌ బోర్డు మీటింగ్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలపై చర్చ జరిగింది. సమావేశంలో టెస్కాబ్‌ చైర్మన్‌, ఉన్నతాధికారులు, నాబార్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంఘాలను బలోపేతం చేయడం కోసం ప్రత్యేక నిధులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. సంఘానికి స్థానికంగా ఉన్న వనరులు, పరిమితులు బట్టి వ్యవసాయ రంగంలో కానీ, ఇతర రంగాల్లో సొంత బిజినెస్‌ చేసుకోవడానికి సంఘానికి రూ.రెండు కోట్లు నిధులు ఇ వ్వాలని సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

సొంతంగా వ్యాపారం..

పీఏసీఎస్‌లు ఇప్పటికే  ధాన్యం కొనుగోలు, ఎరువుల విక్రయాల వ్యాపారాలు చేస్తున్నాయి. జిల్లా సహకార కేంద్రబ్యాంకు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంఘాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొత్తగా నిధులు ఇవ్వనుంది. సంఘాలు సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి నాబార్డు నుంచి ప్రత్యేక నిధులు ఇవ్వడానికి సిఫార్సు చేసింది. ప్రభుత్వ ఆదేశంతో వారం క్రితం ముంబైలోని నాబార్డు ప్రధాన కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు హైదరాబాద్‌కు వచ్చా రు. ఇక్కడ టెస్కాబ్‌ అధికారులతో సమావేశమై సంఘాల బలోపేతం కోసం తీసుకోవాల్సిన విధివిధానాలపై చర్చించారు. ప్రతి సంఘానికి రూ.రెండుకోట్లు ఇవ్వాలనే ప్రతిపాదన తెచ్చారు. అయితే

, ఈ విషయంలో మరోసారి హైలెవల్‌ మీటిం గ్‌ నిర్వహించి, ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. రూ.2 కోట్ల నిధులతో సంఘాలు సొంతంగా వ్యాపారం చేయడం, వ్యవసాయ పనులకు సంబంధించి మిషనరీ కొనుగోలుచేసి రైతులకు అద్దెకివ్వడం, లేదా స్థలం ఉంటే పెట్రోల్‌ బంకులు, గిడ్డంగులు నిర్మించడం, స్థానిక పరిస్థితులను బట్టి వ్యాపారం  చేయడం ప్రధాన ఉద్దేశం. అయితే, ప్రస్తుతం నష్టా ల్లో ఉన్న సంఘాలకు కాకుండా కొంత లాభాల్లో నడుస్తున్న సంఘాలకే నిధులు ఇవ్వాలన్నది ప్రధానంగా టెస్కాబ్‌ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే, ఈ సమావేశంలో పాల్గొన్న తొమ్మిది మంది డీసీసీబీ చైర్మన్లు అన్ని సంఘాలకూ నిధులు ఇవ్వాలని కోరారు. లాభాల్లో నడుస్తున్న సంఘాలకు పూర్తి స్థాయిలో రూ.రెండుకోట్లు, నష్టాల్లో ఉన్న సంఘాలకు పరిమితిని బట్టి కనీసం రూ.కోటి ఇవ్వాలనే ప్రతిపాదన చేశారు.   

మొదట ఈ రుణాలను నాబార్డునుంచి టెస్కాబ్‌(తెలంగాణ స్టేట్‌ కోఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంకు)కు ఇవ్వనున్నారు. ఇక్కడి నుంచి జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు ఇస్తారు. డీసీసీబీల నుంచి అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఈ రుణాలు ఇస్తారు. ఇదివరకు సంఘాలకు ఎలా రుణాలు ఇస్తున్నారో అలాగే, ఈ రూ.2కోట్లు కూడా ఇవ్వనున్నారు. సంఘం చేసే వ్యాపారం, రికవరీ మొత్తం డీసీసీబీ పర్యవేక్షణలో ఉంటుంది. సంఘాలకు ఈ రుణాలు ఇచ్చే విషయంపై ఈనెల 11న హైదరాబాద్‌లో జరిగే టెస్కాబ్‌ బోర్డు మీటింగ్‌లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

చర్చ జరుగుతోంది

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పటిష్టం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. సంఘానికి రూ.రెండు కోట్లు ఇవ్వాలనే ఆలోచన నాబార్డు, టెస్కాబ్‌ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ నిధులు ఎలా ఇవ్వాలి? లోనింగ్‌, బిజినెస్‌ చేయడం, రికవరీ ఎలా చేయాలనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నెల 11న జరిగే టెస్కాబ్‌ మీటింగ్‌లో తుది నిర్ణయం తీసుకుంటారు. 

- డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు logo