గురువారం 29 అక్టోబర్ 2020
Warangal-rural - Aug 09, 2020 , 00:41:51

జాతీయ స్థాయికి ‘పాకాల’

జాతీయ స్థాయికి ‘పాకాల’

  • పోస్టల్‌ స్టాంపుపై సరస్సు 
  • చరిత్ర పుటల్లోకి కాకతీయుల చెరువు
  • కేంద్రానికి ఎమ్మెల్యే పెద్ది విన్నపంతోనే గుర్తింపు

నర్సంపేట : పాకాల సరస్సు చరిత్ర పుటల్లో నిలిచిపోయిం ది. పోస్టల్‌ స్టాంపుపై ముద్రణకు నోచుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ మేరకు పోస్టల్‌ శాఖ స్టాంపును విడుదల చేసింది. నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలంలోని పాకాల సరస్సును కాకతీయులు నిర్మించారు. ఈ చెరువు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వ్యవసాయానికి ఆదరువుగా ఉన్నది. దీనికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చొరవ చూపి కేంద్రానికి విన్నవించడం ద్వారా ఇంతటి ఘనత దక్కింది.

మైమరపించే అందాలు

పాకాల అందాలు చూడముచ్చటగా ఉంటాయి. పక్షుల కిలకిలారావాలు, పచ్చని ఆహ్లాదకర వాతావరణం, మధ్యలో గుట్టతో సరస్సు ప్రకృతి అందాల రమణీయతను కలిగి ఉంది. నర్సంపేట ప్రాంత రైతులకు పెద్ద జలవనరు ఇది. ఒక్కసారి నిండితే రెండు పంటలకు నీరందిస్తుంది. ఇక్కడికి పర్యాటకుల తాకిడీ ఎక్కువే ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నది. పాకాలకు గోదావరి జలాలను రప్పించేందుకు సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నిత్యం పాటుపడుతున్నారు. ఈ పనులు చివరిదశలో ఉన్నాయి.

పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా..

సరస్సులో చిలుకల గుట్ట కనిపించేలా, తూము, నాగలి సింబల్‌, నీటిలో జలచరాలు, పక్షులు, మొసళ్లు, అడవి దున్న లు, పచ్చటి చెట్లతో నిండిన ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ఫొటోను పోస్టల్‌ స్టాంపుపై ముద్రించారు. వరల్డ్‌ ఫారె స్టు డే సందర్భంగా ‘అందరం చేతులు కలిపి వణ్యప్రాణులు, అడవిని కాపాడుదాం’ అని హిందీ, ఆంగ్లంలో ముద్రించారు. మొసలి సింబల్‌తో నర్సంపేట పోస్టల్‌శాఖ ముద్రను కూడా తయారు చేసి ఉపయోగిస్తోంది. పోస్టల్‌ స్టాంపు ముద్రణ పాకాల పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.  logo