శుక్రవారం 22 జనవరి 2021
Warangal-rural - Aug 09, 2020 , 00:35:08

డీపీవో బదిలీపై ఉత్కంఠ

డీపీవో బదిలీపై ఉత్కంఠ

  • మంచిర్యాల వెళ్లేందుకు విముఖత
  • ఇక్కడే కొనసాగేందుకు ప్రయత్నం
  • జగదీశ్వర్‌ బదిలీ ఉత్తర్వుల్లో మార్పు
  • చంద్రమౌళికి వరంగల్‌ రూరల్‌ పోస్టింగ్‌
  • పంచాయతీ శాఖలో హాట్‌ టాపిక్‌

వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ: జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) వీ నారాయణరావు బదిలీపై సస్పెన్స్‌ నెలకొంది. మంచిర్యాల డీపీవోగా వెళ్లేందుకు ఆయన విముఖంగా ఉన్నట్లు తెలిసింది. దీనికితోడు ఆయన స్థానంలో వచ్చిన వీ జగదీశ్వర్‌ నియామకం రద్దయింది. ఆ తర్వాత జగదీశ్వర్‌కు బదులు రూరల్‌ డీపీవోగా వీ చంద్రమౌళిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వీ చంద్రమౌళి విధుల్లో చేరలేదు. దీంతో కొద్దిరోజుల నుంచి డీపీవో నారాయణరావు బదిలీ అంశం జిల్లాలో చర్చనీయమైంది. రాష్ట్రంలో ఒకేసారి 18 మంది డీపీవోలను బదిలీ చేస్తూ జూలై 31న ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ 18 మందిలో వరంగల్‌ రూరల్‌ డీపీవో నారాయణరావు ఒకరు. ప్రస్తుతం వరంగల్‌ రూరల్‌ డీపీవోగా పని చేస్తున్న నారాయణరావును ప్రభుత్వం మంచిర్యాల జిల్లాకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో యాదాద్రి భువనగిరి డీపీవోగా పని చేస్తున్న వీ జగదీశ్వర్‌ను నియమించింది. జగదీశ్వర్‌ది వరంగల్‌ అర్బన్‌ జిల్లా. దీంతో 18 మంది డీపీవోల బదిలీల్లో ముగ్గురి పోస్టింగ్‌లను మారుస్తూ ఈ నెల 3న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 18 మంది డీపీవోల బదిలీ ఉత్తర్వుల ప్రకారం ములుగు డీపీవోగా నియమితులైన జయశంకర్‌ భూపాలపల్లి డీపీవో వీ చంద్రమౌళిని వరంగల్‌ రూరల్‌ డీపీవోగా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌ రూరల్‌ డీపీవోగా నియమితులైన వీ జగదీశ్వర్‌ను హైదరాబాద్‌లోని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయంలో రిపోర్టు చేయాలని, ములుగు డీపీవోగా కే వెంకయ్యను నియమిస్తున్నట్లు తెలిపారు.

నారాయణరావు విముఖత

వరంగల్‌ రూరల్‌ డీపీవోగా పని చేస్తున్న వీ నారాయణరావు బదిలీపై మంచిర్యాల జిల్లాకు వెళ్లడానికి సుముఖంగా లేరని తెలిసింది. ఆయన భద్రాద్రి కొత్తగూడెం డీపీవోగా వెళ్లాలని ఆశించినట్లు సమాచారం. అనూహ్యంగా నారాయణరావును మంచిర్యాల జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడినట్లు తెలిసింది. దీంతో మంచిర్యాల డీపీవోగా వెళ్లేందుకు విముఖంగా ఉన్న నారాయణరావు తనను ప్రస్తుతం పని చేస్తున్న వరంగల్‌ రూరల్‌ డీపీవో స్థానంలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ఇక్కడే ఉండేలా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో జూలై 31న వరంగల్‌ రూరల్‌ డీపీవోగా నియమితులైన వీ జగదీశ్వర్‌ పోస్టింగ్‌ను ఈ నెల 3న రద్దు చేస్తూ జయశంకర్‌ భూపాలపల్లి డీపీవో వీ చంద్రమౌళిని వరంగల్‌ రూరల్‌ డీపీవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రమౌళి కూడా ఇప్పటివరకు వరంగల్‌ రూరల్‌ డీపీవోగా జిల్లాకు రాలేదు. జిల్లా కలెక్టర్‌నూ ఆయన కలవలేదని సమాచారం.

కరీంనగర్‌ డీపీవో ఎం రఘువరన్‌ జయశంకర్‌ భూపాలపల్లి డీపీవోగా నియమితులయ్యారు. రఘువరన్‌ కూడా ఇంకా జయశంకర్‌ భూపాలపల్లి డీపీవోగా విధుల్లో చేరలేదని తెలిసింది. దీంతో ఇక్కడ పని చేస్తున్న డీపీవో వీ చంద్రమౌళి రిలీవ్‌ కాలేదు. ఇదిలా ఉంటే.. పోస్టింగ్‌ మార్పు ఉత్తర్వులు వెలువడి నాలుగైదు రోజులు గడిచినా చంద్రమౌళి వరంగల్‌ రూరల్‌ డీపీవోగా విధుల్లో చేరకపోవడం, ఇక్కడ డీపీవోగా నారాయణరావు కొనసాగుతుండడం పంచాయతీ శాఖలో ఆసక్తికర చర్చకు తెరలేపింది. వరంగల్‌ రూరల్‌ డీపీవోగా కొనసాగేందుకు నారాయణరావు ప్రయత్నిస్తున్నారని, పరిస్థితులు కూడా ఆయనకు సానుకూలంగా ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో డీపీవో బదిలీపై జిల్లాలో హాట్‌టాపిక్‌ నడుస్తున్నది. వరంగల్‌ రూరల్‌ డీపీవోగా నారాయణరావే కొనసాగుతారా?, ఆయన స్థానంలో చంద్రమౌళి వస్తారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. నారాయణరావు ప్రయత్నాలు ఫలిస్తే ప్రభుత్వం తిరిగి ఉత్తర్వులు విడుదల చేయనుంది

డీఎల్‌పీవో స్వరూప బదిలీ

వరంగల్‌ రూరల్‌ డివిజనల్‌ పంచాయతీ అధికారి (డీఎల్‌పీవో) ఎన్‌ స్వరూపను వరంగల్‌ అర్బన్‌ డీఎల్‌పీవోగా బదిలీ చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ ఎం రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వరంగల్‌ అర్బన్‌ డీఎల్‌పీవో పోస్టులో ఎవరూ లేరు. ఖాళీగా ఉన్న ఈ పోస్టులో స్వరూప నియమితులయ్యారు. ఆమె స్థానంలో జగిత్యాల జిల్లా కోరుట్ల డీఎల్‌పీవో కే ప్రభాకర్‌ నియామకం అయ్యారు. కొద్ది నెలల నుంచి ప్రభాకర్‌ దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నారు. స్వరూప బదిలీ, ప్రభాకర్‌ నియామక ఉత్తర్వులు శుక్రవారం డీపీవో కార్యాలయానికి అందినట్లు తెలిసింది.


logo