శుక్రవారం 15 జనవరి 2021
Warangal-rural - Aug 08, 2020 , 02:03:53

సొంత ఖర్చులతో ఐసొలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే

సొంత ఖర్చులతో ఐసొలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే

 నర్సంపేట, నమస్తే తెలంగాణ : నర్సంపేట పట్టణంలో ఐసొలేషన్‌ కేంద్రాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. పట్టణంలోని గిరిజన బాలికల రెసిడెన్షియల్‌ వసతి గృహంలో కొవిడ్‌-19 బాధితుల కోసం ఐసొలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ తన సొంత ఖర్చులతో నర్సంపేటలో ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోనే మొదటి సారిగా 100 పడకలతో ఈ ఐసొలేషన్‌ కేంద్రం పనిచేస్తుందని చెప్పారు. ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్‌ వచ్చి ఇండ్లలో ఉండేందుకు ఇబ్బందిగా ఉండే పేదవారికి కోసం ఈ ఐసొలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో వైద్యుల పర్యవేక్షణ, ఉచితంగా కషాయం, ఆవిరిపట్టే సదుపాయం, అల్పాహారం, రెండు పూటలా నాణ్యమైన భోజనం తదితర సౌకర్యాలను కల్పించినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజలే కాకుండా జిల్లా పరిధిలోని ప్రజలు కూడా ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే, మరో రెండు రోజుల్లో నర్సంపేట సీహెచ్‌సీకి ఆక్సిజన్‌ బెడ్స్‌తో కూడిన ఐసొలేషన్‌ వార్డులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. పట్టణంలోని మరో రెండు దవాఖానలు కొవిడ్‌-19సేవలు అందించడానికి ప్రభుత్వ అనుమతి కోరినట్లు తెలిపారు. అనంతరం కరోనా బాధితులకు 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకుల కిట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజినీ కిషన్‌, ఏసీపీ ఫణీందర్‌, ఆర్డీవో పవన్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ విద్యాధర్‌, వైస్‌చైర్మన్‌ మునిగాల వెంకట్‌రెడ్డి, ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, భాంజీపేట పీహెచ్‌సీ వైద్యాధికారి భూపేశ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రకాశ్‌, తహసీల్దార్‌ రామ్మూర్తి, ఆర్‌ఐ రాజ్‌కుమార్‌, కౌన్సిలర్లు గోల్యనాయక్‌, పెండెం రజిత, చంద్రమౌళి, మహబూబ్‌పాషా, నాగిశెట్టి పద్మ, ప్రసాద్‌, మినుముల రాజు, బానాల ఇందిర, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు పాల్గొన్నారు.