బుధవారం 02 డిసెంబర్ 2020
Warangal-rural - Aug 08, 2020 , 01:42:22

అంతులేని గుంతలు.. అనేక ప్రమాదాలు

అంతులేని గుంతలు.. అనేక ప్రమాదాలు

అది రాష్ర్టాలను కలిపే జాతీయ రహదారి.. దానిపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.. అడుగడుగునా గజం లోతు గుంతలమయమై ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉన్నదో తెలియని దుస్థితి నెలకొన్నది. కేవలం 50కిలోమీటర్లు వెళ్లాలన్నా రెండు గంటల సమయం తప్పనిసరి.. పట్టుమని పది కిలోమీటర్ల ప్రయాణమైనా ప్రాణాలు అరచేత పెట్టుకొని వెళ్లాల్సిందే.. అసలే ఇది వానకాలం.. ఇక రాత్రుళ్లు దీనిపై ప్రయాణం ఎలా ఉంటుందో ఊహించుకోండి..! నాలుగేళ్ల క్రితం కేంద్ర రహదారుల నిర్వహణ పరిధిలోకి వెళ్లిన ఈ ‘ఎన్‌హెచ్‌ 563’ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సుమారు 91కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. దీని మరమ్మతులకు సెంట్రల్‌ గవర్నమెంట్‌ దశలవారీగా నిధులు కేటాయిస్తుండడంతో సమయానికి పూర్తికాక, ఒక్కచోట అయ్యేసరికి మరో చోటపాడైపోయి ఈ దారిలో ప్రయాణమంటేనే వాహనదారులకు నరకప్రాయంలా మారింది. 

తొర్రూరు : నిత్యం వేలాది వాహనాలు వెళ్లే అంతర్రాష్ట్ర వారధి ఇది.17 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రోడ్డు నాలుగేళ్ల క్రితం కేంద్ర రహదారుల నిర్వహణ పరిధిలోకి వెళ్లింది. అప్పటి నుంచి దశల వారీగా నిధులు కేటాయిస్తుండడంతో సమయానికి మరమ్మతులు పూర్తికాక ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో ‘జాతీయ రహదారి-563’పై ప్రయాణం వాహనదారులకు నరకప్రాయంగా మారింది. ఇటీవల 29కిలోమీటర్ల మేర రోడ్డు మరమ్మతులకు కేంద్రం నుంచి నిధులు మంజూరైనా కొవిడ్‌ కారణంగా పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఈ వానకాలంలో వాహనదారులకు ఇబ్బందులు తప్పేలాలేవు. 

2016నుంచి ఎన్‌హెచ్‌       

జగిత్యాల, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లా కేంద్రాల మీదుగా ఖమ్మం జిల్లా కేంద్రం వరకు సుమారు 248 కిలోమీటర్ల ఈ రహదారిని 2004లో ఫోర్‌లేన్‌గా మార్చారు. అప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోనే ఉన్న ఈ రోడ్డును 2016 జూన్‌లో జాతీయ రహదారిగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. నిజామాబాద్‌, పాత కరీంనగర్‌ జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు ఈ నేషనల్‌ హైవే ఎంతో ప్రధానమైంది. ఈ రహదారి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సుమారు 91కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 10కిలోమీటర్ల దాకా వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉండగా శంభునిపేట శివారు నాయుడు పెట్రోల్‌బంక్‌ నుంచి మరిపెడ మున్సిపల్‌ కేంద్రం శివారు వరకు 81కిలోమీటర్ల మేర రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారింది. కిలోమీటరు వ్యవధిలో ఎన్నో చోట్ల రోడ్డుపై పెద్ద గుంతలు పడి ఎప్పుడు ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొన్నది. 

మరమ్మతులకు రూ.21 కోట్లు కేటాయింపు...

వరంగల్‌ నుంచి మరిపెడ దాకా జాతీయ రహదారి అధ్వానంగా ఉండడంతో అధికారుల ప్రతిపాదనల మేరకు కేంద్రం నుంచి తాజాగా రూ.21కోట్లు కేటాయించినట్లు తెలిసింది. రెండు ప్యాకేజీలుగా పనులను విభజించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. మామునూరు నుంచి పంథిని వరకు ఏడు కిలోమీటర్ల మేర, వర్దన్నపేట నుంచి రాయపర్తి మండల కేంద్రం వరకు ఏడు కిలోమీటర్ల మేర రహదారి మరమ్మతులకు రూ.8కోట్లు కేటాయించారు. ప్యాకేజీ రెండులో కక్కిరాలపల్లి క్రాస్‌ రోడ్‌ నుంచి ఇల్లంద వరకు, మొరిపిరాల నుంచి సన్నూరు క్రాస్‌ రోడ్‌  వరకు, దంతాలపల్లి శివారు నుంచి బీరిశెట్టిగూడెం వరకు మరమ్మతులు, కొత్త రోడ్డు, సూచిక బోర్డులు, లైటింగ్‌ స్టడ్‌ల ఏర్పాటు, పెయింటింగ్‌ పనులకు రూ.13కోట్లు కేటాయించినట్లు సమాచారం. కాగా పనుల టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు కుదుర్చుకున్నా కొవిడ్‌ కారణంగా పనుల ప్రారంభంలో జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఇప్పట్లో పనులు మొదలయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో వానకాలంలో వాహనదారులకు ఇబ్బందులు తప్పేలా లేవు. 2016లో జాతీయ రహదారిగా గుర్తించిన నాటి నుంచి 2019 చివరి నాటికి పలు చోట్ల మరమ్మతులకు కేంద్రం కేవలం రూ.12కోట్లే కేటాయించడంతో అరకొరగానే పనులు సాగాయి. రెండేళ్ల క్రితం చేసిన పనులు వర్షాల కారణంగా మళ్లీ దెబ్బతిన్నాయి. 

మరో 29కిలోమీటర్ల మరమ్మతులకు ప్రతిపాదనలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 91కిలోమీటర్ల నిడివి కలిగిన రహదారి మరమ్మతులకు నాలుగేళ్లలో రూ.33కోట్లు కేటాయించి 23కిలోమీటర్ల మేర మరమ్మతులు పూర్తి చేయగా, తాజాగా మరో 29కిలోమీటర్ల రోడ్డు మరమ్మతులకు అధికారులు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. పంథిని వద్ద రెండు కిలోమీటర్లు, ఇల్లంద నుంచి వర్దన్నపేట వరకు 3కిలోమీటర్లు, రాయపర్తి నుంచి మొరిపిరాల వరకు 6కిలోమీటర్లు, బీరిశెట్టిగూడెం శివారు నుంచి మరిపెడ వరకు 18కిలోమీటర్ల మేర ప్రస్తుత రహదారిని పునర్నిర్మించేందుకు నిధుల కోసం ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ప్యాకేజీల వారీగా కేటాయిస్తున్న పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు మూడు నుంచి ఐదేళ్ల పాటు రోడ్డు నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలనే నిబంధనలున్నాయి. 

రోజుకు 14వేల వాహనాల రాకపోకలు...

ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో మరిపెడ వరకు ఉన్న జాతీయ రహదారి-563పై ప్రస్తుతం రోజూ సుమారు 14వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నాగపూర్‌ నుంచి విజయవాడ వరకు కొత్త కారిడార్‌ను రూపకల్పన చేసి జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ప్రస్తుత రహదారిని వెడల్పు చేస్తారని అందరూ భావించారు. పూర్తి స్థాయిలో కొత్త రహదారి నిర్మాణానికి భూసేకరణ కోసం డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యాక ఎన్‌హెచ్‌-563 నిర్వహణ బాధ్యతలు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తారు. అప్పటి దాకా కేంద్రమే రోడ్డు నిర్వహణ నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది.