శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Warangal-rural - Aug 07, 2020 , 03:18:26

నర్సంపేటలో ఐసొలేషన్‌ వార్డు ఏర్పాటు

నర్సంపేటలో ఐసొలేషన్‌ వార్డు ఏర్పాటు

  • వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ హరిత వెల్లడి

 కలెక్టరేట్‌, ఆగస్టు 6 : కరోనా రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో నర్సంపేటలో ఐసొలేషన్‌ వార్డు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్‌ హరిత తెలిపారు. హైదరాబాద్‌ నుంచి గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ దవాఖాన లేదని, ఇప్పటి వరకు ఏరియా దవాఖానల్లోనే కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. నర్సంపేటలో 20 బెడ్లతో కూడిన ఐసొలేషన్‌ వార్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో కరోనా రోగులకు వైద్య ఆరోగ్య శాఖ నుంచి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎంహెచ్‌వో డాక్టర్‌ మధుసూదన్‌, ఎల్డీఎం సత్యజిత్‌ తదితరులు పాల్గొన్నారు.   

శాయంపేట  : మండలంలోని పెద్దకోడెపాకలో ఎస్సై అకినపెల్లి ప్రవీణ్‌కుమార్‌ పీహెచ్‌సీ వైద్యాధికారి నాగశశికాంత్‌తో కలిసి పర్యటించారు. కరోనాపై  ప్రజలకు అవగాహన కల్పించారు. కొవిడ్‌ కేసులు ఎక్కువగా ఉన్న గ్రామంలోని యాదవకాలనీని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. కాలనీలోకి ఇతరులు ఎవరు రావద్దని, ఇక్కడి వారు బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ ప్రకాశ్‌రెడ్డికి ఎస్సై సూచించారు. కరోనా బాధితుల ఇండ్ల వద్దకు వెళ్లి ఎస్సై వారికి ధైర్యం కల్పించారు. కరోనా బాధితులు బయట తిరిగితే ఎంజీఎం దవాఖానకు తరలిస్తామని హెచ్చరించారు. కార్యదర్శి మామిడి రాజశేఖర్‌, వార్డు సభ్యుడు తిరుపతి, కోగిల స్వరూపాచంద్రమౌళి, ఏఎన్‌ఎం సరళ పాల్గొన్నారు. 

నడికుడ : మండల కేంద్రంలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని సర్పంచ్‌ ఊర రవీందర్‌రావు పిచికారీ చేశారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని హోం క్వారంటైన్‌లో ఉంచామన్నారు. పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

నర్సంపేట రూరల్‌ : మండలంలోని మాధన్నపేట, రాజుపేట, గార్లగడ్డతండా, ముత్యాలమ్మతండా, ఇటుకాలపల్లి గ్రామాలకు ఇటీవల పలువురు హైదరాబాద్‌ నుంచి వచ్చారు. వారంతా ఐసొలేషన్‌లోనే ఉంటున్నారు. ఈక్రమంలో వైద్య సిబ్బంది, రెవెన్యూ, కార్యదర్శులు వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వీఆర్వోలు, వీఆర్‌ఏలు, కార్యదర్శులు, వైద్య సిబ్బంది, ఆశాలు తదితరులు పాల్లొగన్నారు. 

సంగెం : మండలంలోని తిమ్మాపురంలో కొవిడ్‌ బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను సర్పంచ్‌ గన్ను శారద అందజేశారు. కొవిడ్‌ సోకిన వారికి అండగా నిలవాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు గన్ను సంపత్‌, వార్డు సభ్యుడు పోశాల రాజేశ్‌, చర్చి ఫాదర్‌ చంద్రశేఖర్‌, డీలర్‌ రవీందర్‌, చిన్న పాల్గొన్నారు, 

గీసుగొండ : గ్రేటర్‌ పరిధిలోని మూడో డివిజన్‌ను కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించాలని అంబేద్కర్‌ యువజన సంఘం తీర్మానించినట్లు నాయకులు కొమ్ము మహేశ్‌, కొ మ్ము సురేందర్‌ తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల అభీష్టం మేరకే ఈ నిర్ణ యం తీసుకున్నామన్నారు.  ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపీ దయాకర్‌  దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినట్లు తెలిపారు. కరుణాకర్‌, వినయ్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

హైపోక్లోరైట్‌ పిచికారీ..

రాయపర్తి : మండల కేంద్రంలో  సర్పంచ్‌ గారె నర్సయ్య నేతృత్వంలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌  మాట్లాడుతూ.. కరోనా కట్టడికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గుగులోత్‌ అశోక్‌కుమార్‌, కారోబార్‌ కారుపోతుల రాంచంద్రయ్య, సిబ్బంది పిల్లి రాజు, విజయ్‌కుమార్‌, భీమేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. logo