మంగళవారం 01 డిసెంబర్ 2020
Warangal-rural - Aug 07, 2020 , 03:01:44

సర్‌ అడుగుజాడల్లో అందరం నడుద్దాం

సర్‌ అడుగుజాడల్లో అందరం నడుద్దాం

  • n బంగారు తెలంగాణకు పునరంకితమవుదాం
  • n ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌
  • n ఏకశిల పార్కులో ఘనంగా ఆచార్యుడి 86వ జయంతి
  • n ఉద్యానవనానికి జయశంకర్‌ పేరు
  • n ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేడుకలు
  • n నివాళులర్పించిన ప్రముఖులు

రెడ్డికాలనీ, ఆగస్టు 6 : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ 86వ జయంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. జయశంకర్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో హన్మకొండలోని ఏకశిల పార్కు(జయశంకర్‌ ఉద్యానవనం)లో జరిగిన కార్యక్రమంలో చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, అర్బన్‌ జడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌, ఇన్‌చార్జి కలెక్టర్‌ హరిత, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, జయశంకర్‌ సార్‌ దత్తపుత్రుడు బ్రహ్మం, వారి కుటుంబ సభ్యులు, సాంబారి సమ్మారావు, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్‌, జోరిక రమేశ్‌, ఇతర ప్రజాప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు, ట్రస్టు సభ్యులు జయశంకర్‌ సార్‌ను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి దిశానిర్దేశం చేసిన మహనీయుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ అని అన్నారు.  సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏకశిలాపార్కును జయశంకర్‌ సార్‌ ఉద్యానవనంగా నామకరణం చేసినట్లు గుర్తుచేశారు. ఆయన ఆశయ సాధన కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి, అధ్యాపకుడిగా జయశంకర్‌ ఎంతోమందికి మార్గనిర్దేశం చేశారన్నారు.

వరంగల్‌లో త్వరలో రీసెర్చ్‌ సెంటర్‌ : ఎంపీ బండా ప్రకాశ్‌

త్వరలో వరంగల్‌లో జయశంకర్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరుమీద రీసెర్చ్‌ సెం టర్‌ ఏర్పాటు చేయనున్నట్లు రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌ తెలిపారు. సార్‌ ఆలోచనా విధానంతో తెలంగాణ పునర్నిర్మాణం కావాలని, ఆ దిశగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నట్లు చెప్పారు. కేయూలో యేటా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఎండోమెంట్‌ లెక్చర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం ఘంటా చక్రపాణి పాల్గొనాల్సి ఉండగా వాయిదా వేసినట్లు తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన సోషల్‌సైన్స్‌ విద్యార్థులకు గోల్డ్‌మెడల్‌ అందజేస్తామన్నారు. పుల్లూరి గౌరీశంకర్‌ ఆధ్వర్యంలో జయశంకర్‌ సార్‌పై అనేక పుస్తకాలు వెలువడినట్లు చెప్పారు.

జయశంకర్‌ సార్‌కు మంత్రి ఎర్రబెల్లి నివాళి

పర్వతగిరి :  ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతి సందర్భంగా పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్వతగిరి మండల కేంద్రంలో గురువారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సిద్ధాంత కర్తగా ప్రజల గుండెల్లో జయశంకర్‌ సార్‌ వేసుకున్న ముద్ర చెరగనిదన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిదన్నారు. సార్‌ యావజ్జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే అంకితం చేశారన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అగ్రభాగాన నిలపడానికి సీఎం కేసీఆర్‌కు జయశంకర్‌ సారే స్ఫూర్తిగా నిలిచారని మంత్రి పేర్కొన్నారు. జయశంకర్‌ సార్‌తో తనకున్న అనుబంధం కొన్ని దశాబ్దాల నాటిదన్నారు. ఆయన జీవితం యువతకు ఆదర్శం, స్ఫూర్తిదాయకమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.