సోమవారం 21 సెప్టెంబర్ 2020
Warangal-rural - Aug 05, 2020 , 02:57:53

వాటర్‌హబ్‌గా రామప్ప చెరువు

వాటర్‌హబ్‌గా రామప్ప చెరువు

చారిత్రక రామప్ప చెరువు ఇక వాటర్‌హబ్‌గా నిలువనున్నది. కేవలం వాన నీరే ఆధారమైన ఈ చెరువును గోదావరి జలాలతో నింపేందుకు తెలంగాణ సర్కారు ప్రణాళిక రూపొందించి శరవేగంగా పను లు చేయిస్తున్నది. ఇక్కడినుంచి ఒక రిజర్వాయర్‌ సహా ఐదు చెరువులకు గోదావరి నీటిని తరలించే అతిపెద్ద కేంద్రంగా తీర్చిదిద్దుతున్నది. ఇప్పటికే ఎత్తిపోతల ద్వారా ట్రయల్‌ రన్‌ విజయవంతం కాగా, త్వరలో నీళ్లు పంపే ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఎత్తిపోతలతో పాటు సొరంగాలు, పైప్‌లైన్లు, గ్రావిటీ ద్వారా నీళ్లు చేరే చెరువులన్నీ కాకతీయలు నిర్మించినవే కాగా వచ్చే యాసంగి నాటికి వేలాది ఎకరాలకు సాగునీరందనున్నది.

ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట వద్ద కాకతీయులు నిర్మించిన రామప్ప చెరువు అనేక గ్రామాల్లోని వేలాది ఎకరాలకు సాగు, తాగునీరందిస్తున్నది. అయితే ఇన్నాళ్లు వర్షం నీరే ఈ చెరువుకు ఆధారం. దీంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సంవత్సరం ఇక్కడ సాగు, తాగునీటి ఎద్దడి తలెత్తేది. ఈ చెరువు కింద వానకాలం సీజన్‌లో మాత్రమే పూర్తిస్థాయి ఆయకట్టు సాగులోకి వస్తుంది. యాసంగి సీజన్‌లో మాత్రం జల వనరుల శాఖ అధికారులు రొటేషన్‌ పద్ధతిన ఆయకట్టుకు నీరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ సర్కారు రామప్ప చెరువులోకి గోదావరి జలాలను తరలించే మార్గాలను అన్వేషించింది. చివరకు జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు మూడో దశలో గోదావరి నీటిని ఈ చారిత్రక చెరువును నింపేందుకు నిర్ణయించింది.

భీమ్‌గణపురం నుంచి రామప్పకు..

దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం భూపాలపల్లి మండలం పంభాపూర్‌లోని భీమ్‌గణపురం చెరువును బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసింది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద నిర్మించిన దేవాదుల ఇన్‌టేక్‌వెల్‌ నుంచి ఎత్తిపోయడం ద్వారా గోదావరి నీరు పైపులైన్‌ నుంచి భీమ్‌గణపురం రిజర్వాయర్‌కు చేరుతుంది. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌ నుంచి ఎత్తిపోయడం ద్వారా దేవాదుల మొదటి దశలో వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలం పులుకుర్తిలోని పంప్‌హౌస్‌కు, రెండో దశలో శాయంపేట మండలంలోని చలివాగు ప్రాజెక్టు ద్వారా జలాలను వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ధర్మసాగర్‌ రిజర్వాయర్‌కు తరలిస్తుంది. ఇందుకోసం భీంగణపురం నుంచి ధర్మసాగర్‌ వరకు పైపులైన్‌ నిర్మించింది. మూడో దశలో భీంగణపురం రిజర్వాయర్‌ నుంచి రామప్ప చెరువులోకి దేవాదుల నీటిని తరలించేందుకు పైపులైన్‌ ఏర్పాటుచేసింది. ఈ పనులు పూర్తి కావడంతో ఇటీవల దేవాదుల ప్రాజెక్టు ఇంజినీర్లు భీంగణపురం రిజర్వాయర్‌ నుంచి ఎత్తిపోతతో పైపులైన్‌ ద్వారా రామప్ప చెరువులోకి గోదావరి నీటిని తరలించేందుకు ట్రయల్న్‌ నిర్వహించగా విజయవంతమైంది. దీంతో భీంగణపురం రిజర్వాయర్‌ నుంచి అవసరమైనప్పుడు దేవాదుల నీటిని రామప్ప చెరువులోకి పంపే ఏర్పాట్లు చేశారు. ఇలా దేవాదుల మూడో దశలో రామప్ప చెరువు ఇక బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా మారింది.

ధర్మసాగర్‌, రంగాయ, పాకాల చెరువులకు..

దేవాదుల ప్రాజెక్టు మూడో దశలో రామప్ప చెరువు నుంచి గోదావరి నీరు ధర్మసాగర్‌ రిజర్వాయర్‌కు తరలించాల్సి ఉంది. దీని కోసం రామప్ప నుంచి ధర్మసాగర్‌ వరకు సొరంగం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇవి పూర్తికాగానే భీమ్‌గణపురం నుంచి రామప్ప చెరువులోకి వచ్చే దేవాదుల నీటిని ఇంజినీర్లు సొరంగం ద్వారా ధర్మసాగర్‌ రిజర్వాయర్‌కు చేర్చుతారు. రామప్ప చెరువులోకి వచ్చే దేవాదుల నీటిని ధర్మసాగర్‌ రిజర్వాయర్‌తో పాటు మరో నాలుగు చెరువుల్లోకి తరలించేలా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్రధానంగా దేవాదుల మూడో దశలో భాగంగా రామప్ప చెరువు నుంచి వరంగల్‌ రూరల్‌ జిల్లా నల్లబెల్లి మండలంలోని రంగాయచెరువు, ఖానాపురం మండలంలోని పాకాల చెరువుకు వేర్వేరుగా గోదావరి జలాలను తరలించాలని నిర్ణయించింది. ఈమేరకు ఎత్తిపోత కోసం రామప్ప చెరువు వద్ద పంపుహౌస్‌లు, మోటర్లను ఏర్పాటుచేయడంతో పాటు అక్కడినుంచి రంగాయ చెరువు, పాకాల చెరువు పైపులైన్‌, కాల్వలు నిర్మిస్తోంది. ఇటీవల రంగాయ చెరువు పంపుహౌస్‌లోని మోటార్లకు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. పాకాల చెరువు పైపులైన్‌, పంపుహౌస్‌ నిర్మాణం, మోటర్ల ఏర్పాటు పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే యాసంగి సీజన్‌లో ఎత్తిపోతతో రామప్ప చెరువు నుంచి రంగాయ చెరువుతో పాటు పాకాల చెరువులోకి దేవాదుల నీరు చేరనుంది. ఈ పనులపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. రంగాయ చెరువు, పాకాల చెరువుకు దేవాదుల నీరు రావడం వల్ల సుమారు 70 వేల ఎకరాలకు మేలు జరగనుంది.

తుది దశకు కాల్వ పనులు

ఇదే రామప్ప చెరువు నుంచి పొరుగున ఉన్న భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గణపసముద్రం చెరువులోకి దేవాదుల నీటిని గ్రావిటీ ద్వారా తరలించేందుకు ఏడాదిన్నర క్రితం ప్రభుత్వం కాల్వ నిర్మాణ పనులు చేపట్టింది. రామప్ప నుంచి వంగపల్లి చెరువు మీదుగా గణపసముద్రం వరకు జరుగుతున్న ఈ పనులు తుది దశకు చేరాయి. వచ్చే యాసంగి సీజన్‌లో రామప్ప నుంచి గ్రావిటీ ద్వారా దేవాదుల నీరు గణపసముద్రం చెరువులోకి తరలిపోతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. తద్వారా సుమారు 24వేల ఎకరాలకు సాగునీరందుతుందని వెల్లడించారు. అలాగే ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం చెరువులోకి గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం కాల్వ నిర్మించాలని భావించింది. ఇందుకోసం కొద్ది నెలల క్రితం టెండర్లు పిలిచి పనులను ఓ కాంట్రాక్టు ఏజెన్సీకి అప్పగించింది. అంతేగాక రామప్ప నుంచి లక్నవరం వరకు కాల్వ నిర్మించేందుకు భూసేకరణ కూడా చేపట్టింది. ఇది పూర్తయి రామప్ప నుంచి దేవాదుల నీరు లక్నవరం చేరితే 8,700 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. దేవాదుల నీటితో నిండుకుండల్లా మారే రామప్ప, పాకాల, గణపసముద్రం, లక్నవరం చెరువులు కాకతీయుల కాలంలో నిర్మించినవి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రిజర్వాయర్‌ సహా ఐదు చెరువులకు రామప్ప చెరు వే కేంద్రమని చెప్పవచ్చు.


logo