శుక్రవారం 22 జనవరి 2021
Warangal-rural - Aug 03, 2020 , 01:00:26

నారు పోయక.. నాట్లు వేయక..

నారు పోయక.. నాట్లు వేయక..

  • విత్తనాలు వెదజల్లి వరి సాగు
  • వినూత్న పద్ధతిలో పండిస్తున్న భీంపల్లి రైతు
  • కూలీల అవసరం లేదు.. ఖర్చు కూడా తక్కువే 
  • ఎకరాకు 25 క్వింటాళ్లకు పైగా దిగుబడి

 ఎవరైనా వరి సాగు చేయాలంటే ముందు నారు పోస్తారు.. ఆ తర్వాత ఓ పది పన్నెండు మంది కూలీలను పిలిచి పొలంలో నాట్లేయిస్తారు. మరి ఇలా విత్తనాలు చల్లడమేమిటి.. అనుకుంటున్నారా.? అవును మీరు చదివింది నిజమే. నాట్లేసే పద్ధతికి స్వస్తి చెప్పిన వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలంలోని భీంపల్లి రైతు గోనెల రమేశ్‌, కొత్త విధానంలో వరి పండిస్తున్నాడు. కూలీల అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో సాగుచేయడమే గాక ఎకరానికి 25 క్వింటాళ్ల దాకా దిగుబడి సాధించవచ్చని చెబుతున్నాడు.                   

- కమలాపూర్‌


కమలాపూర్‌ : వరి పంట పండించాలంటే నారుపోసి కూలీలతో నాట్లు వేసే పాత పద్ధతిని వదిలి కొత్త విధానంలో సాగుచేస్తున్నాడో ఓ యువరైతు. కూలీల అవసరం లేకుండా వరి విత్తనాలు వెదజల్లి పంట పండిస్తున్నాడు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలంలోని భీంపల్లి గ్రామానికి గోనెల రమేశ్‌ తనకున్న రెండెకరాల్లో వరి విత్తనాలను వెదజల్లే పద్ధతిలో వరి సాగుచేస్తున్నాడు. ఎకరా పొలం నాటు వేయాలంటే 13 మంది మహిళా కూలీలు, నారు వేసేందుకు మగకూలీ అవసరం ఉంటుంది. వీళ్లకు సుమారు నాలుగు వేల దాకా ఖర్చు అవుతుంది. కానీ వెదజల్లే విధానానికి కూలీలతో పని లేదు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కాలువలకు నీళ్లు విడుదల చేస్తుండడంతో వ్యవసాయబావులు, ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో ఎక్కడ చూసినా కూలీల కొరత తీవ్రంగా ఉంది. వీటన్నింటిని గమనించిన రమేశ్‌ కూలీల అవసరం లేకుండా వరి సాగు చేసే పద్ధతిని ఎంచుకున్నాడు.

తక్కువ ఖర్చుతో..

వానకాలం(ప్రస్తుత సీజన్‌) రెండెకరాల్లో 25కిలోల జై శ్రీరాం వరి విత్తనాలను వెదజల్లాడు. వరి విత్తనాలు మొలకెత్తి ఏపుగా పెరుగుతుండగా కలుపు నివారణకు గడ్డిమందు స్ప్రే చేస్తున్నాడు. వరి పైరుకు ఎలాంటి నష్టం కలుగకుండా కలుపు మొక్కలు నివారించుకోవచ్చని చెబుతున్నాడు. ఎకరం పొలం నాటు వేయాలంటే సుమారు పది వేలు ఖర్చు అవుతుంది. వెదజల్లే పద్ధతిలో మాత్రం కేవలం ఐదు వేలలోపే ఖర్చుతోనే వరి సాగు చేయవచ్చు. ఖర్చు తగ్గించుకునేందుకు భీంపల్లి గ్రామంలో సుమారు పదిహేను ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో పలువురు రైతులు వరి సాగు చేస్తున్నారు.

మహిళా రైతు స్ఫూర్తితోనే..


కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం కొండపాకకు చెందిన మహిళా రైతు లక్ష్మి(జాతీయ అవార్డు గ్రహీత) స్ఫూర్తితోనే వరి విత్తనాలు వెదజల్లే పద్ధతి తెలుసుకున్నాను. యాసంగిలో కూలీల కొరత తీవ్రంగా ఉండడంతో గ్రామానికి చెందిన బోయిని రాజేందర్‌ పొలంలో నేనే స్వయంగా విత్తనాలు చల్లాను. కలుపు తీయకుండా కూలీల అవసరం లేకుండా ఎకరాకు 40బస్తాలు దిగుబడి వచ్చింది. నాట్లు వేసి ఎకరాకు 40బస్తాలు పండిస్తే, కూలీల అవసరం లేకుండా వెదజల్లే పద్ధతిలో ఎకరాకు 40బస్తాలు(సుమారు 25 క్వింటాళ్లు) దిగుబడి సాధించడం చూశా. ఎకరానికి 15కిలోల విత్తనాలు, 50కిలోల పొటాష్‌, 50కిలోల డీఏపీ ఎరువులు, గడ్డిమందుతో కలుపు నివారించి ఖర్చు తగ్గించుకోవచ్చు.

- రమేశ్‌, రైతు, భీంపూర్‌logo