మంగళవారం 26 జనవరి 2021
Warangal-rural - Aug 02, 2020 , 08:38:14

క్యా క‌రోనా!?

క్యా క‌రోనా!?

  • బడులు బందాయె..  బయటకు పోరాదాయె.. 
  • nదోస్తులను కలవరాదాయె.. ఆటపాటలు లేవాయె.. 
  • n ఒకప్పుడు సెలవులొస్తే సంతోషం
  • n ఇప్పుడు ఆ సెలవులే భారం
  • n నాలుగు గోడలకే పరిమితం
  • n ఆప్యాయ ఆలింగనాలకూ దూరం
  • n పిల్లల్లో కరువైన ఆనందం
  • n కొవిడ్‌ పీడ విరగడ ఎప్పుడోనన్న నైరాశ్యం

 బాల్యం.. అదో వింత లోకం.. ఒక విచిత్ర అనుభవం... ఎదుగుతున్నకొద్దీ పురివిప్పుకునే మయూరం.. ఆ సమయంలో ఊతమిచ్చి శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పాటు అందితే జీవితమే బంగారుమయం. కానీ, పాడు కరోనా వచ్చి బాలల భవిష్యత్తునే ఇప్పుడు ప్రశ్నార్థకంలోకి నెట్టింది. ఇండ్లకే పరిమితమై విజ్ఞానార్జనలో వెనుకబడేలా చేసింది. కొవిడ్‌ కారణంగా బడులు బందై.. చదువులతో పాటు ఆటపాటలకు దూరమై పిల్లల్లో ఒకరకమైన బెంగ కనిపిస్తున్నది. ఉల్లాసంగా గడపాల్సిన సమయంలో బయటకు పోలేక, స్నేహితులతో  కలిసే అవకాశం లేక, నాలుగు గోడలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఒకప్పుడు సెలవులు వస్తే ఎగిరి గంతేసినవారే.. ఇప్పుడు అవే సెలవుల్లో క్యా ‘కరోనా’? అంటూ నిట్టూర్చాల్సి వస్తున్నది. మహమ్మారి పీడ ఎప్పుడు విరగడవుతుందా..? ఎప్పుడు స్వేచ్ఛాగాలులు పీలుస్తామా? అని ఆశగా ఎదురుచూడాల్సి వస్తున్నది.   

- నర్సంపేట రూరల్‌ 

నర్సంపేట రూరల్‌ :నాలుగు నెలల క్రితం దాకా పాఠశాలల్లో చదువులు, స్నేహితులతో ఆటపాటలతో ఉల్లాసంగా గడిపిన బాల్యం, ఇప్పుడు కరో నా కారణంగా ఇంటి నాలుగు గోడలకే పరిమితై బెంగలో పడింది. ఉల్లాసంగా గడపాల్సిన సమయంలో బయటకు పోలేక, స్నేహితులతో  కలిసే అవకాశం లేక దిగులు చెందుతున్నది. ఒకప్పుడు సెలవులు వస్తే సంబురంగా ఉన్న పిల్లలే ఇప్పుడు అవే సెలవుల్లో భారంగా గడపాల్సి వస్తున్నది.  

ఒకప్పుడు ఆనందానికి అవధుల్లేవు

పాఠశాల విద్యార్థుల ఆనందానికి ఒకప్పుడు అవధుల్లేకుండా ఉండేది. ప్రస్తుతం ఆ ఆనందం ఆవిరైంది. బాహ్యప్రపంచంలో ఎంతో సంతోషంగా గడిపేవారు కాస్తా ఇండ్లకే పరిమితమయ్యారు. ఇంతకు ముందు చదివినవి గుర్తుండక, ఇప్పడు పాఠశాలలు ప్రారంభం కాక జ్ఞానార్జలో వెనుకబడుతున్నారు. ‘మా అమ్మాయి స్కూల్‌ టాప్‌' అని చెప్పుకొని మురిసిన తల్లిదండ్రులు కూడా ప్రస్తుత కరోనా పరిస్థితులతో ఆందోళన చెందుతున్నారు. రోజంతా ఇంటి పట్టునే ఉంటుండడం, అల్లరి, విసిగింపులు ఎక్కువ కావడంతో ఇటు తల్లిదండ్రులు సైతం కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఎంతైనా తాము రాసిన నోట్స్‌పై టీచర్‌ సైన్‌ చేసి వెరీగుడ్‌ అని అందరిముందూ అభినందించినప్పుడు కలిగే గర్వం ఇప్పుడు కరువైంది. అన్నో ఆనందాలు, అనుభవాల కలబోత అయిన పాఠశాల వేదిక వెలవెలబోతుండడం ప్రతి ఒక్కరినీ కలవరపరుస్తున్నది. ఒకప్పుడు పాఠశాలల్లో తోటి విద్యార్థులతో సందడిగా గడిపిన చిన్నారులు ప్రస్తుతం బోర్‌ ఫీలవుతున్నారు. గ్రూప్‌ ఆక్టివిటీస్‌తోనే ప్రతి విద్యార్థి దినదినాభివృద్ధి చెందుతాడు. ఆన్‌లైన్‌ ద్వారా పాఠ్యాంశాల బోధన జరుగుతున్నా గ్రూప్‌ ఆక్టివిటీస్‌ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బడులకు వెళ్లేందుకు ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నా కరోనా కేసులు అధికంగా నమోదవుతుండడంతో పాఠశాలల ప్రారంభంపై సందిగ్ధం నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం టీవీలు, మొబైల్‌ ఫోన్లలో పాఠాలు చెబుతున్నా, తర్వాత విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు. టీవీలు, ఫోన్లతోనే ఎక్కువగా గడుపుతున్నారు. పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చూసేందుకు తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. సర్దిచెప్పలేక తల పట్టుకుంటున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల వారు ఆన్‌లైన్‌ క్లాసులతో పాటు హోం వర్క్‌ ఇస్తున్నా అంతగా వారికి మింగుడుపడడం లేదు. ఇటు జూలై 22 నుంచి 25వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభు త్వం పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసిం ది. టీ శాట్‌ ద్వారా షెడ్యూల్‌ ప్రకారం తరగతులు నిర్వహిస్తున్నది. ఆన్‌లైన్‌ పాఠాలతో కాస్త ఊరట కలుగుతున్నా పూర్తి సంతృప్తిగా కనిపించడం లేదు.

అప్పట్లో ఉదయం సందడిగా ఉండేది


నాలుగు నెలల ముందు పాఠశాలలున్న సమయంలో ఉదయం పూట పిల్లల హడావుడితో ఇళ్లంతా సందడిగా ఉండేది. పిల్లలను తయారు చేసి స్కూల్‌కు పంపించేదాకా తల పానం తోకకు వచ్చేది. ఉదయం స్కూల్‌కు వెళ్లిన పిల్లలు సాయంత్రం వచ్చేవారు. ఇప్పుడు పొద్దంతా ఇంట్లోనే ఉంటున్నారు. ఎక్కడికీ వెళ్లలేక బోర్‌ ఫీలవుతున్నారు.

- పెండ్యాల భిక్షపతి, పేరెంట్‌logo