మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Aug 01, 2020 , 01:49:34

త్యాగ నిరతికి ప్రతీక ..

త్యాగ నిరతికి ప్రతీక ..

  • నేడు ఈద్‌-ఉల్‌-జుహా  
  • మసీదులు ముస్తాబు
  • కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రార్థనలకు 50 మందికే అనుమతి
  • ఈద్గాల వద్దకు నో ఎంట్రీ
  • ఖుర్బానీ ఇచ్చేందుకు ముస్లింల ఏర్పాట్లు      

త్యాగ నిరతికి ప్రతీక బక్రీద్‌ పండుగ. దీన్ని ఈద్‌-ఉల్‌-జుహా అని కూడా అంటారు. ముస్లింలు ఈ రోజును పవిత్ర దినంగా భావిస్తారు. ప్రవక్త హజ్రత్‌ ఇబ్రహీం కుమారుడు ఇస్మాయిల్‌ చేసిన త్యాగాన్ని స్మరిస్తూ నేడు బక్రీద్‌ను నిర్వహించుకుంటారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి ఖుర్బానీ ఇవ్వనున్నారు. ఈ మేరకు మసీదులను ముస్తాబు చేశారు. కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం మసీదులో 50 మందే ప్రార్థన చేసుకునేందుకు అనుమతి ఉంది. 

- చెన్నారావుపేట/ నర్సంపేట రూరల్‌

బక్రీద్‌ను జరుపుకొనేందుకు ముస్లింలు సన్నద్ధమయ్యారు. మసీదుల్లో ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయమే మసీదులకు చేరుకొని ఇమాం(మతగురువు)ను అనుసరిస్తూ సామూహిక ప్రార్థన చేస్తారు. పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఖబ్రస్థాన్‌లకు వెళ్లి బంధువులను స్మరించుకుంటారు. నమాజ్‌ పూర్తయ్యాక స్వగృహాలకు చేరుకొని జంతు బలిదానాలు(ఖుర్బానీ) చేసి దేవుడిపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు. 

ఇదీ నేపథ్యం

అన్ని ప్రేమలకంటే దైవ ప్రేమ చాలా గొప్పదని, ఇదే అల్లాహ్‌ ఆజ్ఞ అని ముస్లింలు భావిస్తారు. హజ్రత్‌ ఇబ్రహీం తన కొడుకు హజ్రత్‌ ఇస్మాయిల్‌ను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న క్రమంలో దైవం ఆయనకు పరీక్ష పెట్టాడని ప్రతీతి. ఒక రోజు ఇబ్రహీం తాను తన కొడుకును జిబాహ్‌ (వధ) చేస్తున్నట్లు కలగంటాడు. ఇది దైవాజ్ఞగా స్వీకరించిన ఇబ్రహీం ఆ కలను తన కొడుకు ఇస్మాయిల్‌కు చెబుతాడు. దేవుడి ఆజ్ఞ అదే అయితే ఆచరించాల్సిందేనని ఇస్మాయిల్‌ స్వచ్ఛందంగా సిద్ధపడతాడు. అల్లాహ్‌కు కావాల్సింది ఇస్మాయిల్‌ బలి కాదు. ఆయనలోని ప్రేమ మాత్రమే. చివరకు పుత్ర వాత్సల్యాన్ని జయించి కొడుకు మెడ మీద కత్తి పెట్టేందుకు ఇబ్రహీం సిద్ధమవుతుం డగా దైవాజ్ఞతో ఇస్మాయిల్‌ స్థానంలో గొర్రెపోతు ప్రత్యక్షమై జిబాహ్‌(బలి) అవుతుంది. దీంతో ఇబ్రహీం పరీక్షలో ఉత్తీర్ణుడైనట్లు తేలుతుంది. అప్పటి నుంచీ ఆయన త్యాగానికి ప్రతీకగా ముస్లింలు బక్రీద్‌ను జరుపుకొంటున్నారు. 

ఆత్మీయతను పంచే పండుగ

జాతి, మత, పేద, గొప్ప భేదాలను వీడి, ప్రేమానురాగాలను, ఆత్మీయతను పంచే పండుగగా బక్రీద్‌ను భావిస్తారు. జంతు బలి (ఖుర్బానీ) ఇచ్చి మాంసాన్ని మూడింట ఒక వంతు పేదలకు పంచుతారు. మిగిలిన రెండు భాగాల్లో ఓ భాగం సొంతానికి, మరో భాగం ఇరుగు, పొరుగువారికి, బంధుమిత్రులకు, ముస్లిమేతరులకు సైతం అందజేస్తారు. తద్వారా మానవులంతా ఒక్కటేనన్న సందేశాన్నిస్తారు. కొందరు డబ్బు, వస్ర్తాలు, పాయసం దానం చేస్తారు.  

ఈద్గాల వద్ద ప్రార్థనకు అనుమతి లేదు..

కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా బక్రీద్‌ ప్రార్థనలకు ఈద్గా మైదానంలో అనుమతి లేదు. కొవిడ్‌-19 నిబంధనలు అనుసరించి సమీప మసీదుల్లో 50 మంది ముస్లింలు మాత్రమే ఈద్‌ నమాజ్‌ (ప్రార్థన) చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇమామ్‌ ఈద్‌ ఖుత్బాను వీలైనంత త్వరగా ముగించాలి. భౌతికదూరం పాటిస్తూ నమాజ్‌ చేసుకోవాలి. చిన్న పిల్లలు, 60 ఏళ్లు దాటినవారు, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారు ఇళ్లలోనే ప్రార్థన చేసుకోవాలి.