గురువారం 21 జనవరి 2021
Warangal-rural - Aug 01, 2020 , 01:49:32

వ్య‌వ‌సాయ మార్కెట్ల‌పై కేంద్రం పిడుగు

వ్య‌వ‌సాయ మార్కెట్ల‌పై కేంద్రం పిడుగు

  • n పంటల కొనుగోలుపై ఆర్డినెన్స్‌ జారీ
  • n ఎక్కడైనా, ఎవరైనా కొనే అవకాశం
  • n ట్రేడింగ్‌ లైసెన్స్‌, చెక్‌ పోస్టులకు చెల్లు !
  • n గణనీయంగా తగ్గనున్న ఆదాయం
  • n భారం కానున్న మార్కెట్ల నిర్వహణ
  • n ప్రత్యామ్నాయంపై మార్కెటింగ్‌ శాఖ నజర్‌

పంటల కొనుగోలుకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్‌, వ్యవసాయ మార్కెట్ల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇది అమల్లోకి వస్తే మార్కెట్‌ చెక్‌పోస్టులు, ట్రేడర్స్‌ లైసెన్సులు రద్దు కానున్నాయి. పంట ఉత్పత్తుల అమ్మకాలపై నియంత్రణ లేకుండా పోనుండడం, ట్రేడర్ల మోసాలకు తావిచ్చేలా ఉండడంతో మార్కెటింగ్‌ శాఖ పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదముంది. చివరికి మార్కెట్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు సైతం భారం కానుండగా ఆర్డినెన్స్‌ అమలు చేయాలా? వద్దా? అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది. 

వరంగల్‌ రూరల్‌, నమస్తేతెలంగాణ : మార్కెటింగ్‌ విధానంలో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గత జూన్‌లో ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఇది పంటల కొనుగోలుకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించేలా ఉంది. కాగా, ఇది వ్యవసాయ మార్కెట్ల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇది అమల్లోకి వస్తే మార్కెట్‌ చెక్‌పోస్టులు, ట్రేడర్స్‌ లైసెన్సులు రద్దవుతాయి. పంట ఉత్పత్తుల కొనుగోలుపై నియంత్రణ లేకుండా పోతుంది. మార్కెటింగ్‌ శాఖ పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోయి చివరికి మార్కెట్ల నిర్వహణ, ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపులు సైతం భారం కానున్నాయి. ఈ ఆర్డినెన్స్‌ రాష్ట్రంలో అమలు కావాలంటే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వ్యవసాయ మార్కెట్ల వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించేలా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఆర్డినెన్స్‌పై సమాలోచనలు చేస్తున్నది. ఇప్పటికే మార్కెటింగ్‌ అధికారులు ఈ ఆర్డినెన్స్‌ అమల్లోకి వస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీనిపై రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఉన్నతాధికారులు చర్చించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పరిశీలన తర్వాత తుది నిర్ణయం వెలువడనుండగా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ సర్వత్రా చర్చనీయాంశమైంది. 

ఎక్కడైనా కొనొచ్చు..

కేంద్రం జారీ చేసిన పిడుగులాంటి ఆర్డినెన్స్‌ రాష్ట్రంలో అమల్లోకి వస్తే పంట ఉత్పత్తులు కొ నేందుకు ట్రేడర్లకు లైసెన్సు అవసరం ఉండ దు. పాన్‌ కార్డు ఉంటే సరిపోతుంది. మెయిన్‌, సబ్‌ మార్కెట్‌లోనే కొనాలనే నిబంధనలు ఉండవు. దీంతో ట్రేడర్లు కొనుగోళ్ల కోసం మా ర్కెట్లకు రారు. ఇళ్లు, పంట చేల వద్ద, రైస్‌, జి న్నింగ్‌, ఇతర మిల్లులు, కోల్డ్‌ స్టోరేజీలు ఇలా ఎక్కడైనా, ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఎ క్కడైనా పంటలు కొనడం మొదలైతే ట్రేడర్లు ఎంత ధరకు కొంటున్నారనే విషయం తెలుసుకోవడం కూడా కష్టమవుతుంది. మార్కెటింగ్‌శాఖ అధికారులు రైతులకు గిట్టుబాటు ధర ఇ ప్పించడం సాధ్యం కాదు. అధికారుల పర్యవేక్షణ, నియంత్రణ ఉండదు. కొనుగోళ్లపై ట్రేడ ర్లు రికార్డులు నిర్వహించరు. పంట ఉత్పత్తుల ను తూకం వేసే సమయంలో ట్రేడర్లు మోసం చేసినా, కొనుగోలు చేసిన తర్వాత రైతులకు డబ్బులు ఇవ్వకపోయినా మార్కెటింగ్‌ శాఖ అ ధికారులు చర్యలు తీసుకునే అవకాశం లేకుం డా పోతుంది. లైసెన్స్‌ అవసరం లేనందున అధికారుల ఆదేశాలను ట్రేడర్లు పట్టించుకోరు. బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని ఆర్డీ వో దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.

ఆదాయానికి గండి..

కేంద్రం ఆర్డినెన్స్‌తో మార్కెటింగ్‌ శాఖ ఆ దాయం కోల్పోనుంది. ట్రేడర్ల లైసెన్స్‌ ఫీజు రూపంలో వచ్చే ఆదాయం రాదు. మెయిన్‌, సబ్‌ మార్కెట్లలో కొనుగోలు చేసే పంట ఉత్పత్తుల ద్వారా మినహా మార్కెట్ల బయట ఇళ్లు, పంట చేలు, రైస్‌మిల్లులు, జిన్నింగ్‌ మిల్లులు, కోల్డ్‌ స్టోరేజీలు, ఇతర ప్రదేశాల్లో జరిగే కొనుగోళ్ల ద్వారా మార్కెటింగ్‌ శాఖకు ఫీజు రూపం లో ఆదాయం వచ్చే అవకాశం లేదు. ఇన్నాళ్లు ట్రేడర్లు ఎక్కడ కొనుగోలు చేసినా కొన్న పంట ఉత్పత్తుల విలువపై ఒక శాతం ఫీజు రూపంలో మార్కెటింగ్‌ శాఖకు ఆదాయం సమకూరింది. ఉదాహరణకు వరంగల్‌ రీజియన్‌లోని 104 వ్యవసాయ మార్కెట్ల పరిధిలో 2019-20లో మార్కెటింగ్‌ శాఖకు రూ.210 కోట్ల ఆదాయం వస్తే ఇందులో రూ.140 కోట్లు మార్కెట్‌ చెక్‌పోస్టుల ద్వారా, రూ.70 కోట్లు మెయిన్‌, సబ్‌ మార్కెట్లలో కొనుగోళ్ల ద్వారా సమకూరింది. కేంద్రం ఆర్డినెన్స్‌తో మార్కెట్‌ చెక్‌పోస్టుల ద్వా రా ఆదాయం వచ్చే అవకాశం లేదు.

చెక్‌ పోస్టులకు చెల్లు..

ఎక్కడైనా, ఎవరైనా కొనుగోలు చేయవచ్చనే కేంద్రం ఆర్డినెన్స్‌తో వ్యవసాయ మార్కె ట్ల చెక్‌పోస్టులు ఇక ఉండవు. వరంగల్‌ రీజియన్‌ పరిధిలో ప్రస్తుతం 180 వ్యవసాయ మార్కెట్‌ చెక్‌పోస్టులు పనిచేస్తున్నాయి. ఈ చెక్‌పోస్టులన్నీ రద్దు కానున్నాయి. దీంతో ఇన్నాళ్లు చెక్‌పోస్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల భవితవ్యం కూడా ప్రశ్నార్థకం కానుంది. ఆదాయం తగ్గడం వల్ల మార్కెట్ల నిర్వహణ, పెన్షనర్లు, ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనం, చెల్లింపులు మార్కెటింగ్‌ శాఖకు భారంగా పరిణమించే అవకాశముంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల నుంచి మార్కెటింగ్‌ శాఖ అధికారులు దుబారా తగ్గించి ఆదాయం సమకూర్చుకునే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.


logo