శుక్రవారం 15 జనవరి 2021
Warangal-rural - Jul 29, 2020 , 00:13:43

వైద్యమే కాదు..ధైర్యం నింపాలి

వైద్యమే కాదు..ధైర్యం నింపాలి

లక్షలు ఖర్చుచేసుకోవద్దు..

కరోనా లక్షణాలతో ప్రైవేట్‌ హాస్పిటళ్లకు వెళ్లి లక్షలు తగలేసుకోవద్దని మంత్రులు సూచించారు. ‘కొవిడ్‌-19కు మందులేదు.. అలాగని కరోనా అంత సీరియస్‌ది కాదు. కానీ, నిర్లక్ష్యం కూడా తగదు. వైరస్‌ నుంచి బయటపడేందుకు పెద్దగా ఖర్చు కాదు. ఈ విషయాలు తెలియక ప్రజలు ఆందోళన పడుతున్నారు. ప్రాథమిక స్థాయిలోనే కరోనాను గుర్తించి, వెంటనే చికిత్స తీసుకోవాలి. సామాజిక దూరం, స్వీయ నియంత్రణ పాటించాలి. మాస్కులు ధరించాలి. లక్షణాలు ఉంటే హోంక్వారంటైన్‌లో ఉండి, బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి.  అధైర్యపడకుండా ఉండాలి” అని ప్రజలకు సూచించారు.

500 పడకల కొవిడ్‌ బ్లాక్‌గా ఎంజీఎం 

ఉత్తర తెలంగాణకు ఆయువుపట్టుగా ఉన్న వరంగల్‌ ఎంజీఎం దవాఖానలో 500 పడకల కొవిడ్‌ బ్లాక్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ప్రస్తుతం 250 పడకలు కొవిడ్‌ రోగులకు అందుబాటులో ఉన్నాయని, మరో 250 పడకలను కూడా కొవిడ్‌ బ్లాక్‌లోకి తెస్తామని చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో వైద్యులు, స్టాఫ్‌ నర్సులు సహా శానిటేషన్‌ సిబ్బందిని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నియమించుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా నుంచి బాధితులు హైదరాబాద్‌ వెళ్లకుండా ఇక్కడే మెరుగైన చికిత్స అందుతుందన్న నమ్మకాన్ని కల్పించాలన్నారు. జయశంకర్‌-భూపాలపల్లి, ములుగు, జనగామ, మహబూబాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ ఇలా అన్ని జిల్లాల రోగులకు ఇక్కడే మెరుగైన వైద్య సేవలందేలా సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో స్పందించి వైద్యులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాతో మరణిస్తే వారి కుటుంబ సభ్యులు సైతం మృతదేహాలను తీసుకెళ్లేందుకు ముందుకు రాలేని పరిస్థితి నెలకొన్నదని, అలాంటి మృతదేహాల ఖనన బాధ్యతలను కూడా హైదరాబాద్‌ తరహా వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తీసుకుంటుందన్నారు.  

మంత్రి ఎర్రబెల్లి, స్థానిక నేతల సారథ్యంలో ఏర్పాట్ల పర్యవేక్షణ, నియామకాలు 

రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ పర్యవేణలో జిల్లా కలెక్టర్‌, ఎంజీఎం సూపరింటెండెంట్‌ సమష్టిగా నిర్ణయం తీసుకొని నియామకాలు చేపట్టాలని మంత్రి ఈటల సూచించారు. సాధ్యమైనంత త్వరలో ఎంజీఎంకు సూపరింటెండెంట్‌ను నియమిస్తామని చెప్పారు. సమీక్షలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎంపీలు బండా ప్రకాశ్‌, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, ధనసరి అనసూయ, ఆరు జిల్లాల కలెక్టర్లు, డీఎంఅండ్‌హెచ్‌వోలు, డీసీహెచ్‌లు, ఎంజీఎం ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌, ఆర్‌ఎంవోలు, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.