సోమవారం 25 జనవరి 2021
Warangal-rural - Jul 28, 2020 , 02:41:24

ప్రగతి బాటన పల్లెలు

ప్రగతి బాటన పల్లెలు

  •  గ్రామాల సమగ్రాభివృద్ధికి సర్కారు చర్యలు

‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు’ అన్న సూక్తిని అక్షరాలా పాటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, గ్రామాలను ప్రగతి బాట పట్టించేందుకు వడివడిగా చర్యలు తీసుకుంటున్నది. కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని అమల్లోకి తెచ్చి పల్లెల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నది. ప్రతి ఊరిలో మొక్కల పెంపకానికి నర్సరీ, పారిశుధ్య నిర్వహణ కోసం ట్రాక్టర్‌, డంపింగ్‌ యార్డు, అన్ని సౌకర్యాలతో వైకుంఠధామాలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా గ్రామస్తులకు ఆహ్లాదం పంచేందుకు ‘పల్లె ప్రకృతి వనా’లను సైతం ఏర్పాటు చేస్తున్నది. 

 

వరంగల్‌ రూరల్‌, నమస్తేతెలంగాణ : గ్రామాలను ప్రగతి బాట పట్టించేందుకు ప్రభుత్వం వడివడిగా చర్యలు తీసుకుంటున్నది. కొత్త పంచాయతీ రాజ్‌ చట్టాన్ని అమల్లోకి తెచ్చి పల్లెల సమగ్రాభివృద్ధికి పునాది వేసింది. ప్రతి పంచాయతీలో కార్యదర్శి, మల్టీపర్పస్‌ వర్కర్ల నియామకాలు పూర్తి చేసింది. సిబ్బంది వేతనాన్ని పెంచి నెలనెలా పంచాయతీ నుంచి ఇచ్చే ఏర్పాట్లు చేసింది. పచ్చదనం, పరిశుభ్రత లక్ష్యంగా ‘పల్లె ప్రగతి’ని అమల్లోకి తెచ్చింది. ప్రతి పంచాయతీ పరిధిలో మొక్కల పెంపకానికి నర్సరీలను నెలకొల్పింది. పంచాయతీకో ట్రాక్టర్‌ లేదా మినీ ట్రాక్టర్‌, ట్రాలీ ఆటోను సమకూర్చింది. చెత్త సేకరణ కోసం ప్రతి ఊరిలో ఇంటింటికీ డస్ట్‌ బిన్లు పంపిణీ చేసి డంప్‌ యార్డు నిర్మాణం కూడా చేపట్టింది. ప్రతి యార్డులో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపోస్ట్‌ షెడ్లను నిర్మిస్తున్నది. ఊరూరా సకల వసతులతో వైకుంఠదామాలను ఏర్పాటు చేస్తున్నది. తాజాగా ఊరూరా ఒక పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుర్తించిన స్థలాల్లో కొద్ది రోజుల నుంచి అధికారులు వివిధ రకాల మొక్కలు నాటుతున్నారు. ఇలా పరుగు పెడుతున్న అభివృద్ధి పనులతో పల్లెలు ప్రగతి బాట పట్టాయి. 

పంచాయతీకో నర్సరీ

అడవుల శాతాన్ని పెంచేందుకు హరితహారంలో భాగంగా పంచాయతీకో నర్సరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గతేడాది నిర్ణయించింది. నర్సరీ నిర్వహణ కోసం ఆయా పంచాయతీల పరిధిలో ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రతి ఊరిలో పంచాయతీ పరిధిలో స్థలాన్ని గుర్తించి నర్సరీ నెలకొల్పారు. వరంగల్‌రూరల్‌ జిల్లాలోని 401 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటయ్యాయి. ఈ ఏడాది హరితహారం కోసం వీటిలోనే మొక్కలను సిద్ధం చేశారు. అవెన్యూ ప్లాంటేషన్‌ కోసం అవసరమైన పెద్ద మొక్కలను మాత్రం గ్రీన్‌ ఫండ్‌ ద్వారా కొంటున్నారు. 

గ్రామ శివారులో డంప్‌ యార్డు

పల్లెల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నది. ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను ట్రాక్టర్‌, ఇతర వాహనాల ద్వారా ఊరు బయటకు తరలించేందుకు ప్రతి పంచాయతీ పరిధిలో ఒక డంప్‌ యార్డు నిర్మాణం చేపట్టింది. ఒక్కో దానికి రూ.2.50 లక్షలు కేటాయించింది. రూరల్‌ జిల్లాలో 397 పంచాయతీల పరిధిలో డంప్‌ యార్డుల కోసం అధికారులు స్థలాలు గుర్తించి పనులు ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం అధికారులు, ఎంపీడీవోలు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి యార్డులో తడి పొడి చెత్తను వేరు చేసేందుకు షెడ్‌ నిర్మిస్తున్నారు. అందులో కంపార్టుమెంట్లు కడుతున్నారు.

ఊరికో వైకుంఠధామం

ప్రజావసరాలను గుర్తించిన ప్రభుత్వం ఊరికో వైకుంఠధామాన్ని కట్టాలని నిర్ణయించి ఉపాధి హామీ నిధుల నుంచి ఒక్కోదానికి రూ.12. 60 లక్షలు కేటాయించింది. ఈ మేరకు జిల్లాలోని 397 పంచాయతీల పరిధిలో వైకుంఠధామాల నిర్మాణం కోసం అధికారులు స్థలాలు గుర్తించి పనులు ప్రారంభించారు. 40గ్రామాల్లో పూర్తి చేశారు.   


logo