కరోనా.. నో హైరానా

- లక్షణాలు లేని పాజిటివ్ వ్యక్తులకు ఇంట్లోనే చికిత్స
- పేషెంట్లకు ‘హోం ఐసొలేషన్ కిట్'
- మందులతోపాటు మాస్కులు, శానిటైజర్
- ఆరోగ్య పరిస్థితిపై ప్రతిరోజూ ఆరా
కరోనా విజృంభిస్తుండడంతో ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో లక్షణాలు లేని పాజిటివ్ వ్యక్తులకు హోం ఐసొలేషన్ కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో బాధితులు ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ పొందవచ్చు. ఇందులో మందులతో పాటు మాస్కులు, శానిటైజర్లు ఉంటాయి. ఈ పేషెంట్లకు వైద్యాధికారులు రోజూ ఫోన్ చేసి లక్షణాలేమైనా ఉన్నాయా? అని తెలుసుకొని తగు జాగ్రత్తలు సూచిస్తున్నారు. - రెడ్డికాలనీ
రెడ్డికాలనీ : హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారికి ప్రభుత్వం ఉచితంగా కరోనా కిట్లను అందజేస్తున్నది. ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా బాధితులకు కిట్లను అందజేసేందుకు వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లాలో 325 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎక్కువ మందిలో ఎలాంటి లక్షణాలూ బయటపడక పోయినా రెండు రోజుల వ్యవధిలో జ్వరం, దగ్గు, గొంతునొప్పి వస్తున్నది. ఈ క్రమంలోనే వారికి ఉచితంగా కిట్లను సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు.
249 మందికి అందజేత..
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కిట్లను అందుబాటులోకి ఉంచుకోవాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. బాధితుడు ఇంట్లోనే చికిత్స పొందుతున్నారనే సమాచారాన్ని వైద్యాధికారులు నిర్ధారించుకోగానే స్థానిక పీహెచ్సీ నుంచి కిట్‌ను నేరుగా సిబ్బంది బాధితుల ఇంటికెళ్లి అందజేస్తున్నారు. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ ఉన్నా సరే అందరికీ ఇస్తారు. ఇప్పటి వరకు జిల్లాలోని పాజిటివ్ పేషెంట్లకు 249 ఐసొలేషన్ కిట్లు అందజేసినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. 14 రోజులకు సరిపోయే మందులను ఈ కిట్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇందులో విటమిన్ సీ ట్యాబ్లెట్లు- 40, జింక్- 20, మల్టీ విటమిన్-20, అజిత్రోమైసిన్ 500-5, పారాసిటమల్ 650-20, సిట్రిజన్-20, హైడ్రాక్సీ క్లోరోక్విన్-20 మందులతోపాటు నెస్ట్లేమైలో-1 అందజేస్తున్నారు.
ఆరోగ్యపరిస్థితిపై వాకబు..
ఎలాంటి లక్షణాలు లేని కరోనా బాధితుడిని ఎంజీఎంకు వస్తారా?, లేదా ఇంట్లో ఐసొలేషన్‌లో ఉంటారా? అని వైద్యాధికారులు అడుగుతున్నారు. ఇంట్లో ఉండేందుకు ఇష్టపడిన బాధితుడికి హోం ఐసొలేషన్ కిట్ అందజేస్తున్నారు. వరంగల్‌లోని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా కొవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు పారామెడికల్ ఆఫీసర్లు నిత్యం ఫోన్ ద్వారా బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, తదితర లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అని బాధితులను అడిగి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరిస్తున్నారు.
కిట్‌లో ఉండేవి ఇవే..
1. హోం ఐసొలేషన్ ఇన్స్ట్రక్షన్స్ షీట్
2. ప్రిస్కిప్షన్ విత్ అడ్వైజ్ షీట్
3. క్లాత్ మాస్కులు
4. 4 సర్జికల్ మాస్కులు
5. 2 శానిటైజర్లు (250 ఎంఎల్)
6. సోడియం హైపోక్లోరైట్ ద్రావణం(500 ఎంఎల్)
7. సీ, మల్టీ విటమిన్, జింక్, అజిత్రోమైసిన్,
సిట్రిజన్, హెచ్‌సీక్యూ-200 ఎంజీ
8. నెస్ట్లేమైలో(2స్పూన్స్ విత్ 1 గ్లాస్మిల్క్)
9. నెస్కెఫే చిల్డ్ లట్టీ-2
10.వీటిపై అవగాహన కల్పించే ఓ పుస్తకం ఉంటుంది.
లక్షణాలు లేనివారికి ఇంటి వద్దే చికిత్స
ఎలాంటి లక్షణాలు లేని కరోనా పాజిటివ్ బాధితులు ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. వారికి వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన హోం ఐసొలేషన్ కిట్లను అందిస్తున్నాం. ప్రతి రోజూ వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నాం. ఏం చేయాలి.. ఏం చేయకూడదో వివరించే ఓ పుస్తకం కూడా పొందుపరిచాం. ఇప్పటి వరకు 249 మందికి హోం ఐసొలేషన్ కిట్లు అందజేశాం. ప్రతి రోజూ కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఫోన్ ద్వారా అడిగి తెలుసుకుంటున్నాం.
- డాక్టర్ కే లలితాదేవి, డీఎంహెచ్‌వో, వరంగల్ అర్బన్
తాజావార్తలు
- ఘనంగా మల్లన్న పెద్ద పట్నం
- మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే సండ్ర
- ఉమ్మడి జిల్లాలో 1298 మందికి వ్యాక్సిన్
- కేటీపీఎస్ ఏడో దశలో అరుదైన రికార్డు
- టీకాతోనే కరోనా నివారణ
- వ్యాక్సిన్‌పై అవగాహన అవసరం
- రూ.1.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- ఉద్యోగుల సమస్యలపై కేటీఆర్‌తో టీఆర్వీకేఎస్ నేతల భేటీ
- 100 బైక్ అంబులెన్స్‌తో ఊపిరి!
- నియమాలు పాటించాలి