మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Jul 14, 2020 , 06:00:52

పరిషత్‌లకు తీపికబురు

పరిషత్‌లకు తీపికబురు

  • పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల విడుదల
  • తొలివిడుత జిల్లాకు రూ.9.21 కోట్లు
  • ఈ సారి జడ్పీ, ఎంపీపీలకూ కేటాయింపు
  • ఐదేళ్ల తర్వాత పరిషత్‌లకు ఫైనాన్స్‌ నిధులు
  •  జడ్పీటీసీలు, ఎంపీటీసీల సంతోషం 

జిల్లా, మండల పరిషత్‌లకు ప్రభుత్వం తీపి కబురునందించింది. ఈ మేరకు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. వరంగల్‌ రూరల్‌ జిల్లాకు తొలి విడుత రూ.9.21 కోట్లను ఇస్తున్నట్లు జిల్లా ప్రజాపరిషత్‌కు ఉత్తర్వులు అందజేసింది. వీటిలో ఐదు శాతం జడ్పీకి, పది శాతం మండల ప్రజాపరిషత్‌లకు, 85 శాతం గ్రామపంచాయతీలకు కేటాయించినట్లు అందులో పేర్కొన్నది. ఐదేళ్ల తర్వాత పరిషత్‌లకు ఫైనాన్స్‌ నిధులు విడుదల చేయడంపై జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

            వరంగల్‌ రూరల్‌, నమస్తేతెలంగాణ: తెలంగాణ సర్కారు పరిషత్‌లకు తీపి కబురు అందించింది. జిల్లా, మండల ప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నుంచి తొలి విడుత నిధులు విడదల చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా ప్రజా పరిషత్‌కు ఉత్తర్వులు అందాయి. ఐదేళ్ల విరామం తర్వాత జిల్లా, మండల ప్రజాపరిషత్‌కు ఆర్థిక సంఘం నిధులు రావడం విశేషం. గతంలో ప్రతి సంవత్సరం జిల్లా, మండల ప్రజా పరిషత్‌లకు ఆర్థిక సంఘం నిధులు వచ్చేవి. 2014-15 వరకు ఏటా విడుదలయ్యేవి. చివరి ఐదేళ్లలో 13వ ఆర్థిక సంఘం నిధులొచ్చాయి. 2015-16 నుంచి జిల్లా, మండల ప్రజాపరిషత్‌లకు ఆర్థిక సంఘం నిధులు రావడం నిలిచిపోయింది. గత ఐదేళ్లలో 14వ ఆర్థిక సంఘం నిధులు జడ్పీ, ఎంపీపీలకు రాలేదు. 14వ ఆర్థిక సంఘం నిధులు నూరు శాతం నేరుగా గ్రామ పంచాయతీలకు చేరాయి. గతంలో మాదిరిగానే ఆర్థిక సంఘం నిధులు జిల్లా, మండల ప్రజాపరిషత్‌లకు కేటాయించాలని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పది శాతం మండల ప్రజాపరిషత్‌లు, ఐదు శాతం జిల్లా ప్రజాపరిషత్‌కు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మిగత 85 శాతం నిధులు గ్రామ పంచాయతీలకు విడదల చేయనుంది. ఈ లెక్కన మూడు నెలలకోసారి.. అంటే సంవత్సరంలో నాలుగు విడుతలు 15వ ఆర్థిక సంఘం నుంచి జిల్లా, మండల ప్రజాపరిషత్‌, గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం కేటాయించనుంది. 2020-21 కోసం తొలి విడుత 15వ ఆర్థిక సంఘం నిధులు విడదల చేస్తూ జడ్పీలకు ఉత్తర్వులు పంపింది.

 తొలి విడుత ఎన్నంటే..

వరంగల్‌ రూరల్‌ జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి తొలి విడుత రూ. 9,20,99,700 విడుదల చేసింది. వీటిలో ఐదు శాతం రూ. 30,68,400 జడ్పీకి, పది శాతం రూ. 61,36,900 మండల ప్రజాపరిషత్‌లకు, 85 శాతం రూ. 8,28,94,400 గ్రామ పంచాయతీలకు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. జడ్పీకి కేటాయించిన నిధుల్లో రూ. 4.36 లక్షలు షెడ్యూల్డ్‌ సబ్‌ప్లాన్‌, రూ. 3,31,500 ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌, మండల ప్రజాపరిషత్‌లకు విడదల చేసిన నిధుల్లో రూ. 8.72 లక్షలు షెడ్యూల్డ్‌ సబ్‌ప్లాన్‌, రూ. 6,62,900 ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌, గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధుల్లో రూ. 1,17,80,500 షెడ్యూల్డ్‌ సబ్‌ప్లాన్‌, రూ. 89,54,600 ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ కింద ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. ఇలాగే, ప్రతి మూడు నెలలకోసారి రూ. 9.21 కోట్ల లెక్కన అంటే ఈ ఏడాది మరో మూడు విడుతలు జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వస్తాయి. ప్రధానంగా ఐదేళ్ల తర్వాత మళ్లీ జిల్లా, మండల ప్రజాపరిషత్‌లకు ప్రభుత్వం ఆర్థిక సంఘం నుంచి తొలి విడుత నిధులు విడుదల చేయడం జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఊరటనిచ్చింది. తమ ప్రాదేశిక నియోజకవర్గం పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించుకునే అవకాశం లభించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా, మండల ప్రజాపరిషత్‌లకు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను అడ్మినిస్ట్రేషన్‌ ఖర్చులు, వేతనాలు, ఇతర ఖర్చుల కోసం కాకుండా పూర్తిగా అభివృద్ధి పనులకు వెచ్చించాలని ప్రభుత్వం తెలిపింది. మార్గదర్శకాల ప్రకారం మండల ప్రజాపరిషత్‌ల కోసం జిల్లాకు వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను జనాభా ప్రాతిపదికన జిల్లాలోని మండల ప్రజాపరిషత్‌లకు కేటాయించేందుకు జడ్పీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.