మంగళవారం 04 ఆగస్టు 2020
Warangal-rural - Jul 13, 2020 , 01:02:16

చ‌తుర్విధ హారం

చ‌తుర్విధ  హారం

  • హరితహారంలో నాలుగు అంశాలకు ప్రాధాన్యం
  • ఊరూరా ప్రకృతి వనాలు
  • రూరల్‌ జిల్లాలోని 134 గ్రామాల్లో మంకీ ఫుడ్‌కోర్టులు
  • కొత్తగా 150 ఊర్లలో మియావాకి   విధానం  
  •  పల్లెపల్లెనా రెండు కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్‌

తెలంగాణను ఆహ్లాదకరంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘హరితహారం’లో నాలుగు అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. కోతులకు ఆహారం అందించేందుకు మంకీ ఫుడ్‌కోర్టులు.. గ్రామ జనుల ఉల్లాసం కోసం ‘పల్లె ప్రకృతి వనాలు’, యాదాద్రి తరహా చిట్టడవుల పెంపు, ప్రతి ఊరిలో రెండు కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్‌ ఏర్పాటుకు అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 57 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించి చతుర్విధ కార్యాచరణతో ముందుకు పోతున్నారు.  


వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘హరితహారం’లో నాలుగు అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన అధికారులు ఆమేరకు ముందుకు పోతున్నారు. మంకీ ఫుడ్‌ కోర్టులు.. ‘పల్లె ప్రకృతి వనాలు’, మియావాకీ (చిట్టడవులు), అవెన్యూ ప్లాంటేషన్‌ ఏర్పాటుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతున్నారు. లక్ష్యం మేరకు మొక్కలు నాటే దిశగా సాగుతున్నారు. ప్రతి ఇంటికీ పదహారు మొక్కల చొప్పున అందిస్తున్నారు. ఇన్‌స్టిట్యూషనల్‌, కమ్యూనిటీ ప్లాంటేషన్‌ను కొనసాగిస్తున్నారు. కొద్ది రోజులుగా నాలుగు అంశాలను టాప్‌ ప్రియారిటీగా తీసుకొని కార్యాచరణను అమలు చేస్తున్నారు. హరితహారంలో భాగంగా వరంగల్‌రూరల్‌ జిల్లాలో 57లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. జిల్లాలో సుమారు 1.51 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి పద హారు మొక్కల చొప్పున అందించాలని ప్రణాళికలు వేశారు. గ్రామ పంచాయతీల ద్వారా ప్రతి ఇంటికీ కొద్ది రోజుల నుంచి మొక్కలు పంపిణీ చేస్తున్నారు. వీటిలో పది కృష్ణ తులసి, ఆరు ఇతర మొక్కలుంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఈసారి దోమల నివారణకు కృష్ణ తులసి మొక్కలను అందిస్తున్నారు. పంచాయతీలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇన్‌స్టిట్యూషన్లు, కమ్యూనిటీ ప్రదేశాల్లో వివిధ రకాల మొక్కలు నాటుతున్నారు. నిర్దేశిత లక్ష్యంలో ఇప్పటివరకు 25శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. 

ప్రభుత్వ స్థలాల గుర్తింపు

ప్రతి ఊరిలో ప్రభుత్వం కొత్తగా ‘పల్లె ప్రకృతి వనం (విలేజ్‌ పార్కు) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం గ్రామంలో, ఊరికి దగ్గరలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. ఊరూరికీ కనీసం ఎకరం ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాలోని 98 గ్రామాల్లో వనాల ఏర్పాటు కోసం అధికారులు స్థలాలను గుర్తించారు. తాజాగా ప్రభుత్వం 20 నుంచి 30 గుంటలు ఉన్నా సరిపోతుందని పేర్కొనడంతో ఆ మేరకు కసరత్తు చేస్తున్నారు. ఎకరం చొప్పున స్థలాలను గుర్తించిన గ్రామాల్లో వనాల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు కోతుల ఆహారం కోసం ఊరూరా మంకీ ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఊరికి దూరంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి కోతుల ఆహార శాలలుగా తీర్చిదిద్దాలని ఆదేశించింది. దీంతో జిల్లాలోని 134 గ్రామాల్లో మంకీ ఫుడ్‌కోర్టుల ఏర్పాటు కోసం అధికారులు ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిలో పండ్ల మొక్కలు నాటిస్తున్నారు. ఆయా గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ (మియావాకి) చేపట్టాలని ప్రభుత్వం ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేయగా, అధికారులు జిల్లాలో ఇప్పటి వరకు 150 గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించి పనులు చేపట్టారు. గతంలో హరితహారం నుంచి ఎకరంలో  400 మొక్కలు మాత్ర మే నాటిన అధికారులు, ఇపుడు యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ విధానంలో నాలుగు వేల మొక్కలు నాటుతుండడం విశేషం.

అవెన్యూ ప్లాంటేషన్‌పై దృష్టి

పల్లె ప్రకృతి వనం, మంకీ ఫుడ్‌ కోర్టు, మియావాకీతో పాటు అధికారులు అవెన్యూ ప్లాంటేషన్‌పైనా ప్రత్యేక నజర్‌ పెట్టారు. డబుల్‌, సింగిల్‌ రోడ్లకు ఇరు వైపులా అవెన్యూ ప్లాంటేషన్‌ కింద వివిధ రకాల పెద్ద మొక్కలు నాటాలని నిర్ణయించారు. జిల్లాలో సుమారు 850 కిలోమీటర్ల  మేర అవెన్యూ ప్లాంటేషన్‌కు ప్లాన్‌ చేసినట్లు కలెక్టర్‌ ఎం.హరిత వెల్లడించారు. ప్రతి గ్రామంలో రెండు కిలో మీటర్లకు పైగా అవెన్యూ ప్లాంటేషన్‌ ఉండేలా చూస్తున్నట్లు ఆమె ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా ఆరు లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక తయారు చేసి ఐదు మీటర్లకు ఒక పెద్ద మొక్క, రెండు పెద్ద మొక్కల మధ్య ఒక పూల మొక్క నాటుతున్నట్లు డీఆర్డీవో ఎం.సంపత్‌రావు తెలిపారు. ఈ లెక్కన రెండున్నర మీటర్లకు ఒక మొక్క ఉంటున్నట్లు చెప్పారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు పదిశాతం గ్రీన్‌ ఫండ్‌తో తమకు కావాల్సిన మొక్కలను సమకూర్చుకుంటున్నాయి. పలు గ్రామ పంచాయతీలు ఆంధ్రప్రదేశ్‌లోని కడియం నుంచి మొక్కలను తెప్పించుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 

 


logo