సోమవారం 25 జనవరి 2021
Warangal-rural - Jul 12, 2020 , 06:51:49

పురిటిలోనే చంపేశారు!

పురిటిలోనే చంపేశారు!

  • లింగనిర్ధారణ పరీక్షలో ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్‌
  • ఆరుగురు నిందితులుగా గుర్తింపు
  • ముగ్గురు అరెస్ట్‌, పరారీలో మరో ముగ్గురు

తొర్రూరు: ఇప్పటికే ఒక పాప, బాబు ఉన్నారు.. మరోసారి గర్భం దాల్చిన ఆ తల్లి పుట్టబోయేది ఆడపిల్ల అయితే సాకేదెట్ల అని కలతచెందింది. ఆడా, మగా అని తెలుసుకోవాలనే ఉబలాటంతో దొడ్డిదారిన లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. ఆడపిల్ల అని తేలడంతో వైద్యుల ద్వారా బిడ్డను కడుపులోనే చంపేసి.. చివరకు కటకటాలపాలైంది. భ్రూణహత్యకు(అబార్షన్‌) ఒడిగట్టిన వైద్యుడు, శిశువు తల్లిదండ్రులు, లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వైద్యురాలు, సహకరించిన ఏఎన్‌ఎం, ప్రైవేట్‌ దవాఖాన కాంపౌండర్‌తో సహా ఆరుగురిపై కేసు నమోదు చేసి, ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం దుబ్బతండాకు చెందిన బానోత్‌ అనిత-కాలు దంపతులకు ఇప్పటికే ఒక పాప, బాబు ఉన్నారు. ఈ క్రమంలో మూడో సారి గర్భం దాల్చింది. అయితే, కడుపులో పెరుగుతున్నది మగ లేక ఆడ శిశువా అని తెలుసుకునేందుకు ఆ దంపతులు దంతాలపల్లి పీహెచ్‌సీలో ఏఎన్‌ఎంగా పని చేస్తున్న అదే తండాకు చెందిన జాటోత్‌ కల్పనను కలిశారు. ఆమె తొర్రూరులోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో పని చేస్తున్న కాంపౌండర్‌ జామ్‌లాల్‌కు ఫోన్‌ చేసి విషయం తెలిపి అతడి వద్దకు పంపింది. జామ్‌లాల్‌ ఆ దంపతులిద్దరిని వరంగల్‌ ఎంజీఎం ఎదురుగా ఉన్న సూర్య హాస్పిటల్‌లోని డాక్టర్‌ సబిత వద్దకు తీసుకెళ్లి అనితకు స్కానింగ్‌ చేయించాడు. లింగనిర్ధారణ పరీక్షల్లో మళ్లీ ఆడపిల్లే అని తేలింది.

దీంతో అబార్షన్‌ చేయించుకునేందుకు అనిత మొగ్గుచూపింది. గత నెల 30న తొర్రూరులోని పద్మావతి నర్సింగ్‌హోం డాక్టర్‌ కే యాదగిరిరెడ్డిని ఈ దంపతులు సంప్రదించారు. ఆయన అదేరోజు రాత్రి 9.30 గంటలకు అబార్షన్‌ చేశాడు. విషయం తెలుసుకున్న అధికారులు ఈ నెల 4న పద్మావతి నర్సింగ్‌హోంను సీజ్‌ చేసి వైద్యుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురిపై కేసు నమోదైంది. శనివారం టీచర్స్‌కాలనీలో జామ్‌లాల్‌ అద్దెకు ఉంటున్న ఇంట్లో అబార్షన్‌ కేసులో నిందితులు ఉన్నారనే సమాచారంతో స్థానిక ఎస్సై సీహెచ్‌ నగేశ్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. దీంతో జామ్‌లాల్‌తోపాటు ఏఎన్‌ఎం కల్పన, బానోత్‌ కాలును అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పర్చినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. డాక్టర్‌ యాదగిరిరెడ్డి, బానోత్‌ అనిత, డాక్టర్‌ సబిత పరారీలో ఉన్నారని, వీరి కోసం గాలిస్తున్నామన్నారు. సమావేశంలో సీఐ చేరాలు, ఎస్సైలు నగేశ్‌, మున్నీరుల్లా తదితరులు పాల్గొన్నారు.


logo