శుక్రవారం 22 జనవరి 2021
Warangal-rural - Jul 11, 2020 , 00:41:23

రూర్బన్‌ ప్రాజెక్టుతో పర్వతగిరి అభివృద్ధి

రూర్బన్‌ ప్రాజెక్టుతో పర్వతగిరి అభివృద్ధి

  • పర్యాటక ప్రాంతంగా అన్నారం షరీఫ్‌
  • రూ.30కోట్లతో మొదటి విడుత పనులు
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

పర్వతగిరి: ‘రూర్బన్‌ ప్రాజెక్టు పర్వతగిరి అభివృద్ధికి ఫర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది. ఈ మేరకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాం. ఇక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగానే మొదటి విడుతగా వచ్చిన రూ. 30 కోట్లతో త్వరలోనే పనులు చేపడుతాం. ఈ ప్రాంతానికి చెందిన వాడిగా ప్రజల రుణం తీర్చుకుంటా’ అని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రూర్బన్‌ ప్రాజెక్టు  కింద ఖరారైన పనుల కోసం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, వివిధ శాఖల అధికారులతో కలిసి శుక్రవారం మంత్రి క్షేత్ర పరిశీలన చేశారు. పర్వతగిరి చెరువు కట్ట, అన్నారం షరీఫ్‌ చౌరస్తాలో మొక్కలు నాటారు.

చెరువు కట్టను అభివృద్ధి చేసి వచ్చే దసరా ఉత్సవాలు ఇక్కడే జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అన్నారం షరీఫ్‌ దర్గా చెరువును పరిశీలించారు. దారిలో ఉపాధి హామీ కూలీలకు మంత్రి మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడుతూ రూర్బన్‌ ప్రాజెక్టు మొదటి విడుతగా రూ. 30 కోట్ల నిధులతో అన్నారం షరీఫ్‌, పర్వతగిరిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. అన్నారం రోడ్డు పొడవునా షట్టర్లు వేసివ్వాలని, మాంసం కేంద్రం నిర్మించాలని, కబేళాను కట్టించాలని, స్కూల్‌ భవనాన్ని కొంత దూరంలో నిర్మించాలని, ప్రస్తుత స్కూల్‌ స్థలంలో బస్టాండ్‌ నిర్మించాలని భావిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎర్రబెల్లి వెంట పీఏసీఎస్‌ చైర్మన్‌ మోటపోతుల మనోజ్‌కుమార్‌గౌడ్‌, ఎంపీపీ కమల పంతులు, జెడ్పీటీసీ సింగ్‌లాల్‌, వైస్‌ ఎంపీపీ రాజేశ్వర్‌రావు, మార్కెట్‌ డైరెక్టర్‌ ఏకాంతంగౌడ్‌, సర్పంచులు మాలతీ సోమేశ్వర్‌రావు, యశోద, ఎంపీటీసీలు మాడ్గుల రాజు, జడల కృష్ణ, బాబు, యాకయ్య పాల్గొన్నారు.


logo