మంగళవారం 26 జనవరి 2021
Warangal-rural - Jul 10, 2020 , 01:13:08

జాప్యాన్ని సహించం

జాప్యాన్ని సహించం

  • కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టండి
  • నాణ్యతతోపాటు వేగం కూడా అవసరం
  • అభివృద్ధి పనుల ప్రగతిపై మంత్రి ఎర్రబెల్లి
  • రాయపర్తి, పర్వతగిరి   ‘డబుల్‌ ఇండ్ల’పై సమీక్ష
  • నిర్మాణంలో నిర్లక్ష్యంపై మండిపాటు

వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ: అభివృద్ధి పనులు ఆలస్యమైతే క్షమించేది లేదని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. నాణ్యతా ప్రమాణాలతోపాటు వేగం కూడా అవసరమేనన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురువారం పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, కల్లాలు, ప్రగతిలో ఉన్న పలు అభివృద్ధి పనులపై ఎర్రబెల్లి సమీక్షించారు.  డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, కొత్తగా ఉపాధి హామీ పథకం కింద వచ్చిన కల్లాలను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాంట్రాక్టర్లు అడిగినంత సమయం ఇచ్చాం. ఇసుక వంటి సమస్యల పరిష్కారానికి అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. అయినా ఇండ్ల నిర్మాణం పూర్తి కావడం లేదు. అలాంటి కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టండి’ అని ఎర్రబెల్లి కలెక్టర్‌ హరిత, ఇతర అధికారులను ఆదేశించారు. పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు ఈ నెల 20 నుంచి 25వ తేదీ మధ్య ప్రారంభోత్సవాలు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

రూర్బన్‌ పనుల ఖరారు

రూర్బన్‌ ప్రాజెక్టు కింద పర్వతగిరి మండలానికి మంజూరైన రూ. 32 కోట్లతో చేపట్టాల్సిన పనులు, ఆయా పనికి ఎంత ఖర్చు చేయాలనే అంశంపై మంత్రి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి ఖరారు చేశారు. పర్వతగిరి మండలంలో మాత్రమే ఖర్చు చేయాల్సిన రూర్బన్‌ నిధులతో 50కి పైగా పనులు చేపట్టాలని నిర్ణయించారు. పర్వతగిరిలో మల్టీ జిమ్‌, మినీ స్టేడియం, ట్యాంకు బండ్‌ ఆధునీకరణ, ఈ బండ్‌ను పర్యాటక ప్రాంతంగా మార్చడం, పర్వతగిరి, కల్లెడలో క్లస్టర్‌ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఏనుగల్‌, చౌటపల్లి స్కూళ్లలో సైన్స్‌ ల్యాబ్‌లు, పర్వతగిరి చౌరస్తాలో షాపింగ్‌ కాంప్లెక్స్‌తోపాటు లైబ్రరీ ఏర్పాటు, పర్వతగిరి, కల్లెడ, అన్నారం, రోళ్లకల్‌, కొంకపాక, చౌటపల్లి, తురుపుతండా, దౌలత్‌నగర్‌లో ఆరోగ్య ఉప కేంద్రాలకు భవనాల నిర్మాణం చేపట్టాలని అధికారులకు చెప్పారు. అన్నారం షరీఫ్‌దర్గా చెరువును ఆధునీకరించాలని నిర్ణయించారు. కొంకపాక, ఏనుగల్‌ వద్ద పశు వైద్య ఉప కేంద్రా లు, పర్వతగిరిలో సంత, గోపనపల్లి, రావూరు, నారాయణపురం వద్ద పప్పు మిల్లులు, చిరు ధాన్యాలు, డీహస్కింగ్‌ యంత్రాలు, మక్కజొన్నల షెల్లర్లు, ఏనుగల్‌లో వ్యవసాయ గోదాముల నిర్మాణాలు చేపట్టాలన్నారు.

అన్నారం దర్గా, పర్వతగిరిలో కబేళాల నిర్మాణం అవసరమన్నారు. చింతనెక్కొండ బస్‌షెల్టర్‌, పలు గ్రామాల్లో స్థానికంగా చిన్నతరహా కుటీర పరిశ్రమలు నెలకొల్పాలని నిర్ణయించారు. ఆయా పథకాల పూర్తి ప్రాజెక్టు రిపోర్టులను సిద్ధం చేయాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు. డీఆర్‌డీవో ఎం సంపత్‌రావు, ఆర్డీవో మహేందర్‌జీ, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌ ఈఈలు సంపత్‌, శ్రవణ్‌కుమార్‌, డీపీవో నారాయణరావు, జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్‌, పర్వతగిరి, రాయపర్తి ఎంపీపీలు కమల, అనిమిరెడ్డి, జెడ్పీటీసీలు సింగ్‌లాల్‌, కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మనోజ్‌కుమార్‌, ఎంపీడీవో సంతోష్‌, తాసిల్దార్‌ మహ్మద్‌పాషా, రైతుబంధు సమితి రాయపర్తి మండల కన్వీనరు సురేందర్‌రావు, బిల్లా సుధీర్‌రెడ్డి, నర్సింహనాయక్‌, అధికారులు పాల్గొన్నారు.


logo