ఆదివారం 24 జనవరి 2021
Warangal-rural - Jul 08, 2020 , 00:24:01

ఉప్పొంగెనే..గోదావరీ..

ఉప్పొంగెనే..గోదావరీ..

  • ఎగువ నుంచి వరద
  • ఉధృతంగా ప్రవాహం  

మంగపేట/కాళేశ్వరం/మహదేవపూర్‌ : ఎగువన కురిసిన వర్షాలు, మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి వేయడంతో దిగువన గోదావరి ప్రవాహం పెరిగింది. కాళేశ్వరం వద్ద పుష్కరఘాట్లను ఆనుకొని ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు అప్రమత్తమై స్థానికులకు పలు సూచనలు, జాగ్రత్తలు అందిస్తున్నారు. మంగపేట మండలం కమలాపురం బిల్ట్‌ పరిశ్రమకు చెందిన ఇన్‌టేక్‌వెల్‌ను ఆనుకొని గోదావరి ప్రవహిస్తున్నది. ఇక్కడ సముద్ర మట్టానికి 78.3 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నట్లు బిల్ట్‌ వర్గాలు తెలిపాయి. దీంతో ఇన్‌టేక్‌వెల్‌ లోని మోటర్లను కార్మికులు ఎగువకు అమర్చారు. నదీ ప్రవాహం పెరగడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నందున ఇన్‌టేక్‌వెల్‌ వద్దకు వచ్చే వారు, ప్రధానంగా చేపల వేటకు వెళ్లేవారు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

లక్ష్మీ బరాజ్‌ 24 గేట్ల ఎత్తివేత 

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన లక్ష్మీ బరాజ్‌ 24 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదిలినట్లు సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారు లు తెలిపారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాణహిత నది ఉధృతంగా పారుతూ గోదావరిలో కలుస్తున్నది. గోదావరి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్నది. ఈ క్రమంలో లక్ష్మీ బరాజ్‌ నీటిమట్టం మంగళవారం 8.06 టీఎంసీలకు చేరినట్లు అధికారులు తెలిపారు. బరాజ్‌కు 44,100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 43,600 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 


logo