పాడి పశువుల కాపాడు తల్లీ

- పంటలు మంచిగ పండాలె సీత్లభవానీ..
- ‘గిరి’జనుల తొలి వేడుక ప్రారంభం
- సంస్కృతిని ప్రతిబింబించేలా వేడుకలు
- నియమనిష్టలతో పూజలు
- తండాల్లో దాటుడు పండుగ మొదలు
అడవిలో ప్రతి చెట్టును, పుట్టను, గుట్టను, రాయిని, రప్పను దైవాలుగా భావిస్తూ పశు సంపదను కంటికి రెప్పలా కాపాడుకునే గిరిజనులు, వాటి బాగు కోసం తమ ఆరాధ్యదైవం సీత్లభవానీకి మొక్కులు చెల్లిస్తారు. ఏటా వానాకాలం ప్రారంభంలో (పెద్ద పుష్యాల కార్తె మంగళవారం రోజున) సీత్లభవానీ (దాటుడు) పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు. కార్తె మొదటి, చివరి వారాల్లో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. ఈ మేరకు తండాల్లో సంబురాలు మొదలవగా బంజారాలు ‘గొడ్డూ గోదా.. పిల్లాజెల్లా సల్లంగుండాలె తల్లీ.. వర్షాలు కురిసి పంటలు మంచిగ పండాలె తల్లీ’అంటూ వేడుకుంటున్నారు.
- గీసుగొండ/నర్సంపేట రూరల్
గీసుగొండ/నర్సంపేట రూరల్ : లంబాడా గిరిజనులు జరుపుకొనే పండుగల్లో సీత్లభవానీ (దాటుడు పండుగ) ప్రత్యేకమైంది. ఈ వేడుక పంటలు సాగు చేసే ముందు మొదలవుతుంది. దీన్ని ఆషాఢ మాసంలో సంప్రదాయబద్ధంగా జరుపుకొంటారు. పశువులే ఆధారంగా బతికే వీరు తమ పాడిపశువులు దినదినాభివృద్ధి చెందాలని ఏటా వానకాలం ప్రారంభంలో (పెద్ద పుష్యాల కార్తె మంగళవారం రోజున ) సీత్లభవానీ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టు కింద ఏడు ప్రతిమలను ప్రతిష్ఠించి ఇంటికో ఉల్లిగడ్డ, రూపాయి, నవధాన్యాలు, కొబ్బరికాయలు సమర్పిస్తారు. పూజలు చేసి మేకలు, కోళ్లు బలిచ్చి, మేక పేగులపై నుంచి పశువులను దాటిస్తారు. రక్తంతో తడిపిన నవధాన్యాలను పశువులపై చల్లుతారు. తండావాసులు సాదుకుంటున్న వేలాది పశువులు, ఆవులను అక్కడికి తోలుకొచ్చి పూజలు చేస్తారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలనీ గొడ్డూగోదా, పిల్లాజెల్లా సల్లంగుండాలని సీత్లభవానికి మొక్కులు సమర్పిస్తారు.
పండుగ చరిత్ర
పూర్వం లంబాడాలు సంచార జీవనాన్ని గడిపేవారు. ఆ సమయంలో వానకాలం ఆరంభంలో పశువులకు డెక్కలు, నోటి వ్యాధులు సోకి మృత్యువాత పడేవి. పశు సంపదను కోల్పోతుండడంతో గిరిజనులు అనేక ఇబ్బందులు పడేవారు. చివరకు ఓ గిరిజన కులపెద్ద కలలోకి ఏడుగురు గిరిజన దేవతలు వచ్చి అందరిలో చిన్నామె సీత్లదేవికి మొక్కులు చెల్లిస్తే పశు సంపదను రక్షిస్తానని మాటిచ్చినట్లు గిరిజన పెద్దలు చెబుతుంటారు. అప్పటి నుంచి ఏటా ఈ పండుగ జరుపుకోవడం గిరిజనులకు ఆచారంలా మారింది.
నిర్వహణ ఇలా..
తండా పెద్ద నిర్ణయం ప్రకారం పండుగకు ఒక రోజు ముందుగా రాత్రి ‘వాసిడో..వాసిడో’ (పాత గుగ్గిళ్లు) అంటూ కేకవేస్తూ ఓ వ్యక్తి వీధివీధీ తిరుగుతాడు. మంగళవారం లంబాడాలంతా కలిసి డప్పు చప్పుళ్లు, నృత్యాలతో వంటలకు వెళ్తారు. చెరువు గట్టు, తండా పొలిమేరలో రావి, వేప, మోదుగు చెట్టుకింద ఏడు రాతి బండలను పాతి (సప్త భవానీలు హీంగ్లాయాడీ, అంబాయాడీ, మసురయాడీ, దుర్గాయాడీ, జాల్పాయాడీ, ద్వాలెంగర్యాడీ, సీత్లభవానీగా భావిస్తూ) ఎర్రటి మట్టితో అలికి ముగ్గులతో అలంకరిస్తారు. చిన్నామె సీత్లభవానీని మధ్యలో పెట్టి ఎదురుగా కొంత దూరంలో దేవతల బంటు లుంకిడియా విగ్రహాన్ని నెలకొల్పుతారు. అనంతరం గిరిజన మహిళలు తమ ఇళ్ల నుంచి తెచ్చిన వాంసిడో ప్రసాదాన్ని సీత్లభవానీకి సమర్పిస్తారు. తర్వాత మేకలు, గొర్రె పోతులను బలిస్తారు. అనంతరం బలిచ్చిన మేకను సీత్లభవానీ విగ్రహం వద్ద పడుకోబెట్టి మేక పేగులను లుంకిడియా విగ్రహం దాకా పరుస్తారు. రక్తాన్ని నవధాన్యాలు (గోధుమలు, జొన్నలు, మక్కలు, కందులు, ఉలవలు, శనిగలు, బబ్బెర్లు, చిక్కుడు, పెసర్లు)తో కూడిన గుడాలు (గూగ్రీ)లో కలుపుతారు. వీటిని ఆవులు, లేగలు, కోల్లాగెలు, దూడలు, ఎద్దులపై పోసుకుంటూ మేక పేగుల మీదగా దాటిస్తారు. తర్వాత బావి నుంచి తెచ్చిన నీటిని మూగజీవాలపై చల్లుతూ ‘మా పశు సంపదను రక్షించు తల్లీ’ అంటూ దేవతలను వేడుకుంటారు. ఈ కారణంగానే సీత్ల పండుగకు దాటుడు పండుగ అని పేరొచ్చింది.
గిరిజనుల మొదటి పండుగ
వానకాలం ప్రారంభమైన తర్వాత గిరిజనులు మొదటి పండుగ శీత్లాను వైభవంగా జరుపుకొంటారు. అమ్మవారికి పూలు, పండ్లతో పూజలు చేసిన తర్వాత మేకను బలిస్తారు. గిరిజనులు ఒకే సారి ఈ పండుగ నిర్వహించుకుంటే బాగుంటుంది. -లావుడ్య వాగ్యా నాయక్, సూర్యతండా
ఐక్యతను చాటాలి
శీత్లాభవానీ పండుగను యావత్ గోర్ బంజారాలు మొత్తం ఒకే రోజు నిర్వహించుకొని ఐక్యతను చాటాలి. గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలను చాటేలా పండుగ ఉండాలి. శీత్లా పండుగకు ప్రభుత్వం సెలవు ప్రకటించాలి. -వాంకుడోతు అమృ, విశ్వనాథపురం
భక్తి శ్రద్ధలతో నిర్వహణ
గిరిజన సంస్కృతీసంప్రదాయాలకు శీత్లాభవానీ పండుగ ప్రతీకగా నిలుస్తుంది. ఏటా పెద్ద పుష్యాల కార్తె లో ఒక మంగళవారం ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకొంటాం. పండుగకు తండాల్లో అందరం కలుస్తాం. సంతోషంగా పండుగ చేసుకుంటాం.
- భూక్య వీరునాయక్
పంటలు బాగా పండాలని
పంటలు బాగా పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శీత్లాభవానీ పండుగను జరుపుకొంటాం. మా గిరిజన కుటుంబాలకు ఆత్మగౌరవ ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుంది.
- అజ్మీర మాధవి, రాములు నాయక్‌తండా
సంప్రదాయ పండుగ
వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, పశువులు బాగుండాలని, ప్రజలంతా క్షేమంగా ఉండాలని గిరిజనులు ఏటా నిర్వహించుకునే సంప్రదాయ పండుగ శీత్లా భవానీ, రాష్ట్ర గిరిజనులంతా ఈ పండుగను వైభవంగా నిర్వహించుకోవాలి.
-దారావత్ వీరన్ననాయక్, పీఆర్టీయూ వరంగల్ రూరల్ జిల్లా కార్యదర్శి
తాజావార్తలు
- యూజీ ఆయుష్ వైద్య విద్య నీట్ అర్హత కటాఫ్ మార్కుల తగ్గింపు
- టీఆర్పీ స్కాం: ఐసీయూలో బార్క్ మాజీ సీఈవో
- 'వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి'
- ఆ షాట్ ఏంటి?.. రోహిత్‌పై గావస్కర్ ఫైర్
- బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సెలింగ్
- కష్టపడకుండా బరువు తగ్గండి ఇలా?
- అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- నిర్మలమ్మకు విషమపరీక్ష: ఐటీ మినహాయింపులు పెరిగేనా?!
- రన్‌వేపైకి దూసుకెళ్లిన కారు.. ఒక వ్యక్తి అరెస్ట్
- భారత అభిమానిపై జాత్యహంకార వ్యాఖ్యలు