శుక్రవారం 15 జనవరి 2021
Warangal-rural - Jul 06, 2020 , 06:55:42

శాకంబరీగా అమ్మవారు

శాకంబరీగా అమ్మవారు

  • శాకంబరీ దేవిగా దర్శనమిచ్చిన భద్రకాళీ మాత
  • తెల్లవారుజామునుంచే అలంకరణ, ప్రత్యేక పూజలు
  • అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు
  • ముగిసిన శాకంబరీ  ఉత్సవాలు

అమ్మవారికి ఓరుగల్లు జనం ప్రణమిల్లింది. భద్రకాళీ మాత ఆదివారం భక్తులకు శాకంబరీ దేవిగా దర్శనమిచ్చారు. 270 కిలోల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం దర్శనానికి అనుమతించారు. భక్తులు మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. చారిత్రక భద్రకాళీ ఆలయంలో పదిహేను రోజులుగా జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. 

వరంగల్‌కల్చరల్‌/కురవి/నెహ్రూపార్కు/హన్మకొండ/పాలకుర్తి, జూలై 05: శాకంబరీ మహోత్సవాలను పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా అమ్మవార్లను ఆదివారం ప్రత్యేకంగా కూరగాయలతో అలంకరించగా, భక్తులకు శాకంబరీ మాతగా దర్శనమిచ్చారు. ఇందులో  చారిత్రక భద్రకాళీ దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు ముగిశాయి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఆదివారం ఉదయం వ్యాసపూజ, చతుస్థానార్చన, చండీహవనం, బలిప్రదానం, మహాపూర్ణాహుతి, పూజాధికాలు అమ్మవారికి జరిపారు. ఏటా సుమారు 4 టన్నుల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని అలంకరించేవారు. కరోనా కారణంగా నేరుగా వ్యవసాయ క్షేత్రాల నుంచి  270 కిలోల కూరగాయలు, పండ్లు సేకరించి అమ్మవారిని శాకంబరీగా అలంకరించారు.

ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు మాట్లాడుతూ మూర్తి రహస్యంలోని 12 నుంచి 17వ శ్లోకంలో శాకంబరీ ఆరాధన విశేషం వివరించినట్లు తెలిపారు. చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. వారి వెంట అజరా హాస్పిటల్‌ చైర్మన్‌ డాక్టర్‌ బీ శివసుబ్రహ్మణ్యం, టీఎన్జీవోస్‌ నాయకుడు ఎస్‌ శ్యామ్‌సుందర్‌ ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన హరికృష్ణ, స్మిత దంపతుల సౌజన్యంతో ఆదివారం శాకంబరీ ఉత్సవాలు జరిపామని ఈవో సునీత తెలిపారు. అలాగే, హన్మకొండ సిద్ధేశ్వరస్వామి ఆలయంలో భవానీమాతను శాకంబరీగా అలంకరించారు. ఆలయ అర్చకులు సిద్ధేశుని రవికుమార్‌, సురేశ్‌కుమార్‌ పూజలు జరిపారు. శ్రీహనుమద్గిరి పద్మాక్షి అమ్మవారిని సంపూర్ణ శాకంబరీగా అలంకరించినట్లు దేవస్థాన వంశపారంపర్య అర్చకులు, ధర్మకర్త బ్రహ్మశ్రీ నాగిళ్ల శంకర్‌శర్మ తెలిపారు.

కురవిలోని భద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామి ఆలయంలో భద్రకాళీ అమ్మవారు శాకంబరీ అవతారంలో దర్శనమిచారు. జనగామ జిల్లాకేంద్రంలోని సంతోషిమాత ఆలయంలో శాకంబరీ ఉత్సవాలను ఆలయ కమిటీ, అర్చకుడు శ్రీనివాస్‌శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పార్వతి అమ్మవారు శాకంబరీగా భక్తులకు దర్శనమిచ్చారు. వంద కేజీల కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. ఆలయ ఈవో మేకల వీరస్వామి, సూపరింటెండెంట్‌ కొత్తపల్లి వెంకటయ్య, ముంజ రాములు, బీ శ్రీనివాస్‌, అర్చకులు దేవగిరి రామన్న, దేవగిరి లక్ష్మన్న, దేవగిరి రమేశ్‌శర్మ, దేవగిరి అనిల్‌కుమార్‌, నాగరాజు పాల్గొన్నారు.