సోమవారం 18 జనవరి 2021
Warangal-rural - Jul 01, 2020 , 01:22:53

కందికి లేదు రంది

కందికి లేదు రంది

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న సాగు

నియంత్రిత పద్ధతిలో పంటలను సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తుండడంతో రైతులు కంది పంటవైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ నీటితోపాటు స్వల్పకాలిక రకాల విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు ఎకరాకు10 క్వింటాళ్ల మేర దిగుబడి వస్తున్నది.  క్వింటాలుకు రూ. 5800 మద్దతు ధర నేపథ్యంలో రైతులు కంది పంట            వేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

వరంగల్‌ సబర్బన్‌/కేసముద్రం టౌన్‌, జూన్‌ 30: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపునకు జిల్లా రైతులు సానుకూలంగా స్పందిస్తున్నారు. మార్కెట్‌ ధరల దృష్ట్యా మొక్కజొన్న సాగు వర్షాకాలం పంటగా వేయొద్దని, పత్తి, కందులు మాత్రమే వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు వ్యవసాయశాఖ అధికారులు చేసిన సూచ నకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా రైతులు నియంత్రిత సాగు బాట పట్టారు. ముఖ్యంగా పప్పుదినుసుల్లో రారాజుగా పిలువబడే కంది పంటను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇది దీర్ఘకాలిక పంట కావడం, దిగుబడి తక్కువ వస్తుందనే అపోహలతో గతంలో రైతులు కంది పంటను వేయడానికి ఆసక్తి చూపేవారు కాదు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో కందులకు మంచి మద్దతు ధర లభిస్తున్నది. క్వింటా లుకు రూ.7వేల పైబడి ధర పలుకుతున్నది. దీనికి తోడు రైతులు పండించిన కందులను ప్రభుత్వమే మద్ద తు ధరకు కొనుగోలు చేస్తుంది. ఇదే కాకుండా ఎక్కువ దిగుబడిని ఇచ్చే హైబ్రిడ్‌ విత్తనాలు కూడా విడుదల కావడంతో ఇప్పుడు ఎకరాకు10 క్వింటాళ్ల మేరకు దిగుబడి వస్తున్నది. తక్కువలో తక్కువ ఐదు క్వింటాళ్లకు మించి దిగుబడి కనపడుతున్నది. దీంతో రైతుకు ఎకరానికి గరిష్ఠంగా 30 నుంచి రూ. 50వేల వరకు రాబడి వస్తుంది. మొత్తానికైతే ప్రభుత్వం సూచించిన ప్రకారం రైతులు ఈసారి వరి విష యంలో సన్నరకాలను సాగు చేస్తున్నారు. ఇక పత్తి సాగు కూడా గణనీయంగా పెరిగింది. దీనికి తోడు మొక్క జొన్నను సాగు చేయడం ఈసారి రైతులు మానుకున్నారు. కేవలం ప్రైవేట్‌ కంపనీలు బై బ్యాక్‌ పాలసీతో ఇచ్చే విత్తనాలను మాత్రమే వేసుకున్నారు. ఇక మరికొందరు రైతులు మాత్రం కొద్దిపాటి విస్తీర్ణంలో వ్యవసాయ అధికారుల ప్రత్యేక అనుమతితో పచ్చి కంకులను అమ్ముకోవడానికి మాత్రమే మొక్కజొన్నను వేశారు. ఇక మిగిలిన పంటల విషయంలో మెజార్టీ ఎకరాల్లో కంది పంటనే ఎంచుకున్నారు. ఈసారి కందుల దిగుబడి కూడా ఆశాజనకంగా ఉండే అవకాశాలున్నాయని రైతులు అంటున్నారు. రైతులకు అనుగుణంగా వరంగల్‌ వ్యవసాయ పరిశోధన స్థానం వారు తక్కువ సమయంలో పంట కాలం పూర్త య్యేటువంటి డబ్ల్యూజీఎల్‌-1, డబ్ల్యూజీఎల్‌-2 అనే వెరైటీలను అందుబాటులోకి తెచ్చారు. అదే ఆర్‌ఏ ఆర్‌ఎస్‌లో గత ఏడాది రైతులకు అమ్మేందుకు అందుబాటులో ఉంచిన విత్తనాల్లో నుంచి సగం వరకు మిగిలిపోయాయి. అందుకు విరుద్ధంగా ఈసారి మాత్రం పూర్తిస్థాయిలో కంది విత్తనాలు అమ్ముడుపోయి చివరకు డిమాండ్‌ కూడా ఏర్పడింది. 

జిల్లాల వారీగా..

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో గతంలో చూస్తే 1000 నుంచి 1800 ఎకరాల్లో మాత్రమే కంది పంట సాగ య్యేది. ఈ వానకాలం 5000 ఎకరాల వరకు రైతులు కంది పంటను సాగు చేసే అవకాశాలున్నట్లు జిల్లా వ్యవ సాయ శాఖ అంచనా వేస్తున్నది. ఇందుకు తగ్గట్లుగానే ముందుగా వర్షాలు పడిన ప్రాంతాల్లో ఇప్పటికే 3వేల ఎకరాల వరకు కంది పంటను వేసినట్లుగా తెలుస్తున్నది. ఇంకా విత్తే సమ యం నెల రోజుల వరకు ఉండటంతో అధికారులు ఊహించిన మేర కు కంది పంట సాగవుతుందని చెప్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా లో గత వానకాలం 2515 ఎకరాల కంది పంట సాగు చేయగా, ఈ ఏడాది 6000 ఎకరాలు సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ అంచ నా. ఇప్పటి వరకు 2469 ఎకరాల పంటను సాగు చేశారు. 

మహబూబాబాద్‌ జిల్లాలో గత ఏడాది 5670 ఎకరాల్లో కంది సాగు కాగా, ఈ ఏడాది 15000 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా గతేడాది కంటే ఈ ఏడాది 9330 ఎకరాల్లో కంది అధికంగా సాగు కానుంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో గత ఏడాది 179 ఎకరాల్లో కంది సాగు కాగా, ఈ ఏడాది 2500 ఎకరాలకు పెంచారు. జనగామ జిల్లాలో గతేడాది 1472 ఎకరాల్లో సాగు చేయగా, ఈ వానకాలం 15000 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది. 


పెట్టుబడి తక్కువ

కంది పంట వేసుకుంటే పెట్టుబడి ఎక్కువగా పెట్టాల్సిన అవసరం ఉండదు. నీళ్లు కూడా అవసరం లేకుండానే పండుతుంది. నేను ఆర్‌ఏఆర్‌ఎస్‌ నుంచి కొత్త విత్తనం వచ్చిందంటే వేసిన. 

- కంబాల శ్రీనివాస్‌, రైతు


జూలై వరకు విత్తనాలు వేసుకోవచ్చు

జిల్లాలో 15000 ఎకరాల్లో కంది సాగు జరుగనుంది. మద్దతు ధర రూ. 5850 ఇస్తూ ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంది. రైతులకు కంది సాగుపై అవగాహన కల్పించి అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాం. ఇప్పటికే 7000 ఎకరాలకు గాను విత్తనాలు కొనుగోలు జరిగాయి.  కంది పంటను జూలై చివరి వరకు వేసుకోవచ్చు. ఐదు నెలల్లో దిగుబడి వస్తుంది. 

- నర్సింగం, జనగామ జిల్లా వ్యవసాధికారి