ఓరుగల్లు ముద్దుబిడ్డకు నూరేండ్ల పండుగ

- పీవీ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం
- అధికారికంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం
- ఆయన సేవలను కొనియాడిన నేతలు
- నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
- లక్నెపల్లి, వంగరలో వేడుకలు
ఓరుగల్లు బిడ్డకు నూరేండ్ల పండుగ ప్రారంభమైంది. బహుముఖ ప్రజ్ఞాశాలి, దివంగత భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు విశ్వవ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ వేడుకలు ఏడాది పొడవునా జరుపాలని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్బన్ జిల్లాలోని హన్మకొండ జేఎన్ఎస్ ఆవరణలో ఆదివారం పీవీ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొని పీవీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. నర్సింహారావు జన్మ స్థలమైన నర్సంపేట మండలం లక్నెపల్లి, స్వగ్రామం వంగరలో జయంత్యుత్సవాలు జరిపారు. ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితల సతీశ్‌కుమార్ ఆయా కార్యక్రమాల్లో పాల్గొని పీవీ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. నేటి తరం నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
హన్మకొండ, జూన్ 28: దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన దార్శనికుడు పీవీ నర్సింహా రావు అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు బీజం వేశారని కొనియాడారు. పీవీ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం హన్మకొండ బస్టాండ్ సమీపంలోని జేఎన్ఎస్ ఆవరణలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ హానెస్ట్ ప్రధాన మంత్రిగా పేరు సంపాదించిన మహోన్నత వ్యక్తి పీవీ అని అన్నారు. కుటుంబం కంటే దేశ ప్రజలే ముఖ్యమని, వారి అభివృద్ధికి కృషి చేశారన్నారు. దేశాన్ని ప్రపంచ పటంలో ముం దుంచిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ చిన్నచూపు చూసిందన్నా రు. ప్రధానమంత్రి మరణిస్తే దేశ రాజధాని ఢిల్లీలో అంత్యక్రియలు చేయడానికి బదులుగా హైదరాబాద్‌లో జరిపించారని, ఇది ఆయన కీర్తిని కించపరిచినట్లేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు పీవీకి తగిన గుర్తింపు ఇవ్వలేదని అన్నారు. అనంతరం అక్కడే హరి తహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకా శ్, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే లు చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, అరూరి రమే శ్, డాక్టర్ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్మన్లు డాక్టర్ సుధీర్‌కుమార్, గండ్ర జ్యోతి, మేయర్ గుండా ప్రకాశ్‌రావు, కుడా చైర్మన్ యాదవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కలెక్టర్లు ఆర్జీ హన్మంతు, హరిత, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, ఆర్డీవో వాసుచంద్ర, హన్మకొండ తహసీల్దార్ కిరణ్‌ప్రకాశ్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సీఎం నిర్ణయం అభినందనీయం
బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజనీతి కోవిదుడు మాజీ ప్ర ధాని పీవీ నర్సింహారావు జయంతి ఉత్సవాలను సీఎం కేసీఆర్ ఏడాదిపాటు నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. ప్రపంచంలోని 51 దేశాల్లో పీవీ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. క్లిష్ట ఆర్థిక పరిస్థితులను అధిగమించి గొప్ప సంస్కరణకర్తగా దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుంచిన నేపథ్యంలో పీవీ ముందు పీవీ తర్వాత అంటున్నారు. కాంగ్రె స్ పార్టీ నుంచి అంచలంచెలుగా ఎదిగి ప్రధాన మంత్రి అయిన మన తెలంగాణ ముద్దుబిడ్డగా మనం ఎంతో గర్వపడాలి. ప్రపంచవ్యాప్తంగా పీవీ గొప్పతనాన్ని తెలిపే ప్రయత్నం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
- దాస్యం వినయ్‌భాస్కర్, ప్రభుత్వ చీఫ్ విప్
దేశానికి పీవీ దిక్సూచి లాంటి వారు
పీవీ నర్సింహారావు దేశానికి దిక్సూచిలాంటి వారు. ఆయన శత జయంతి ఉత్సవా లను సీఎం కేసీఆర్ సంవత్సరంపాటు జరుపడం చాలా గొప్ప విషయం. క్లిష్ట సమ యంలో ప్రధాని అయిన పీవీ ఎన్నో సంస్కరణలు చేపట్టి దేశాన్ని అభివృద్ధిలో నడి పించిన అపర చాణక్యుడు. భూ సంస్కరణలు ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి పదవిపోయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో ముందుకు పోయేవారు. మెజారిటీ లే కున్నా మైనార్టీ ప్రభుత్వంలో కూడా ఐదేళ్లు ప్రధానిగా పనిచేసిన ఘనత ఆయనకే ద క్కింది. 51దేశాల్లో పీవీ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉంది.
- కెప్టెన్ లక్ష్మీకాంతారావు, రాజ్యసభ సభ్యుడు
పీవీ సేవలు చిరస్మరణీయం
హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్
భీమదేవరపల్లి, జూన్ 28 : భారత ప్రధానిగా పీవీ నర్సింహారావు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ అన్నారు. పీవీ జయంతి సందర్భంగా పీవీ స్వగ్రామం వంగర గ్రామంలో పీవీ విగ్రహానికి పూలమావేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పీవీ ఇంట్లో వేడుకలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ మాట్లాడుతూ భారతదేశం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో పీవీ ప్రధాని అయ్యారని గుర్తు చేశా రు. పీవీతో తన కుటుంబానికి ఉన్న అనుబంధా న్ని వివరించారు. పీవీలాంటి మహోన్నత వ్యక్తి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అన్నారు. పీవీ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. జెడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్ మాట్లాడుతూ పీవీ నర్సింహారావు దేశానికి చేసిన సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలని అన్నారు. అనంతరం వంగరలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పీవీ రంగారావు బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో టెన్త్, ఇంటర్మీడియెట్‌లో అత్యధిక మార్కు లు సాధించిన విద్యార్థులను సన్మానించారు. పీవీ ఇంటిని మ్యూజియంగా మారుస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ జక్కుల అనిత, జెడ్పీటీసీ వంగ రవి, సర్పంచ్ ఆలూరి రజి త, ఎంపీటీసీ నల్ల కౌసల్య, తాసీల్దార్ ఉమారాణి, ఎంపీడీవో భాస్కర్, పీవీ సోదరుడి కుమారుడు పీవీ మదన్మోహన్రావు, ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్‌జీ, ఎస్సై గంజి స్వప్న, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
దేశానికి మార్గదర్శి
పీవీ సేవలు మరువలేనివి n టూరిజం స్పాట్‌గా లక్నెపల్లి
జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట రూరల్, జూన్ 28: దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధాని పదవి చేపట్టి దేశానికి మార్గనిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి పీవీ నర్సింహారావు అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పీవీ జన్మస్థలమైన నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలో ఆదివారం శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ.. వరంగల్‌తో పీవీ నర్సింహారావుకు అవినాభావ సంబంధం ఉందన్నారు. భూ సంస్కరణలకు ఆద్యుడు పీవీ అని కొనియాడారు. జయంతి ఉత్సవాలకు సీఎం కేసీఆర్ చేసిన కృషి అభినందనీయమన్నారు. సంఖ్యా బలం లేని మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు నడిపించిన బహుముఖ ప్రజ్ఞాశాలి నర్సింహారావు అన్నారు. నేటి తరం నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. లక్నెపల్లిని టూరిజం స్పాట్‌గా మార్చనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, ఎంపీపీ కళావతి, జెడ్పీటీసీ జయ, సర్పంచ్‌లు రాంబాబు, రవన్న, ఎంపీటీసీ రజిత, ఉప సర్పంచ్ సంతోష్, పంచాయతీ కార్యద ర్శి అనిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, కొమ్మాలు, దేశింగరావు, రవీంద్రశర్మ, రాజయ్య, పీవీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎన్నికల వేళ మమతా దీదీకి మరో ఎదురుదెబ్బ?
- యాదాద్రిలో వైభవంగా నిత్యకల్యాణం
- 'ధరణితో భూ రికార్డులు వ్యక్తుల చేతుల్లోంచి వ్యవస్థలోకి'
- శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
- నన్ను ఫాలో కావొద్దు..రియాచక్రవర్తి వీడియో వైరల్
- రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
- చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్‌పై విప్ బాల్క సుమన్ సమీక్ష
- "ఉపశమనం కోసం లంచం" కేసులో డీఎస్పీ, ఇన్స్పెక్టర్ అరెస్ట్
- క్రాక్ 2 ఆయనతో కాదట..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
- స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు