శుక్రవారం 22 జనవరి 2021
Warangal-rural - Jun 28, 2020 , 01:06:10

తెలంగాణ తేజం.. మన పీవీ

తెలంగాణ తేజం.. మన పీవీ

 • ప్రధాని పదవి చేపట్టిన తొలి తెలంగాణ బిడ్డ
 • బహుభాషా కోవిదుడిగా గుర్తింపు
 • లక్నెపల్లి, వంగరతో తీరని అనుబంధం
 • పీవీకి అరుదైన గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్‌
 • స్వగ్రామం వంగరలో మ్యూజియం ఏర్పాటు
 • నేటి నుంచి ఏడాదంతా శతజయంతి ఉత్సవాలు 

భారతదేశ ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శి, బహుముఖ ప్రజ్ఞాశాలి. అసమాన ప్రతిభకు నిలువుటద్దం.. ఆయనే మన తెలంగాణ తేజం పాములపర్తి వెంకట నర్సింహారావు. లోక్‌సభలో పూర్తి మెజారిటీ లేకున్నా.. తుమ్మితే పడిపోయే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఐదేండ్లపాటు నడిపిన అపర చాణక్యుడు. ఆర్థిక వ్యవహారాలతోపాటు అంతర్జాతీయ అంశాల్లోనూ సందర్భోచితంగా వ్యవహరించిన రాజనీతిజ్ఞుడు. మౌనమునిగా భారతదేశ రాజకీయ చరిత్రలో పీవీది చెరగని ముద్ర. పీవీ శత జయంతి ఉత్సవాలు ఏడాదిపాటు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. సొంత పార్టీయే పీవీని దూరం చేసుకున్న తరుణంలో, పీవీ తెలంగాణ ముద్దు బిడ్డకావడం మన అదృష్టమని సీఎం ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ పునర్నిర్మాణానికి ఆయన చేస్తున్న కృషికి ఈ ఉదంతం నిలువెత్తు నిదర్శనం. పీవీ శతజయంతి ఉత్సవాలకు ఓరుగల్లు ముస్తాబైంది. పుట్టిన లక్నెపల్లి, పెరిగిన వంగరతోపాటు ఊరూరా వేడుకలు నిర్వహించనున్నారు. 

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలో అమ్మమ్మ ఇంట్లో 1921జూన్‌ 28న జన్మించారు. ప్రముఖ భూస్వామి వద్దిరాజు మాణిక్యరావు-శ్యామాబాయి దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరిలో చిన్న కుమార్తె రుక్మిణీదేవి-సీతారామారావు దంపతుల కుమారుడే పీవీ. వరంగల్‌ అర్బన్‌ జిల్లా  వేలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నర్సింహారావు విద్యాభ్యాసం మొదలు పెట్టారు. హన్మకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్‌ పూర్తి చేసి కళాశాల చదువుకోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ వందేమాతరం ఆలపించడంతో సహచరులతోపాటు పీవీని యూనివర్సిటీ నుంచి అప్పటి నిజాం ప్రభుత్వం బహిష్కరించింది. దీంతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించారు. బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. విద్యార్థి దశ నుంచే నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కొంతకాలం అజ్ఞాతవాసం ఉండి చాందా క్యాంపులో క్రియాశీలకపాత్ర పోషించారు. హైదరాబాద్‌ రాష్ట్ర తొలి సీఎం బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్‌ న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరి అంచలంచెలుగా ఎదిగి అఖిలభారత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడయ్యారు. నర్సింహారావుకు సత్తెమ్మతో వివాహం జరుగగా, ముగ్గురు కొడుకులు, ఐదుగురు కూతుళ్లు జన్మించారు.

రాజకీయ ప్రస్థానం...

పీవీ నర్సింహారావు 1938లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి, 1951లో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సభ్యుడిగా, 1952లో కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1957-72 మధ్య కాలంలో నాలుగు సార్లు మంథని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1967లో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్య, విద్య, దేవాదాయ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. 1971 సెప్టెంబర్‌లో ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో భూసంస్కరణలు అమలు చేసి పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 1973-75 మధ్య కాలంలో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. 1977లో హన్మకొండ లోక్‌సభకు ఎన్నికై ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో హోం, విదేశాంగ శాఖల మంత్రిగా కొనసాగారు. ఆ తరువాత రాజీవ్‌గాంధీ మంత్రి వర్గంలో హోంశాఖ, మానవ వనరుల శాఖ మంత్రిగా పని చేశారు. రాజీవ్‌గాంధీ హత్యానంతరం చోటుచేసుకున్న పరిణామాల్లో భాగంగా 1991లో దేశ అత్యున్నత ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు. చివరకు 2004 డిసెంబర్‌ 23న పీవీ నర్సింహారావు కన్నుమూశారు. 

క్లిష్టసమయాల్లోనూ బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా క్లిష్టసమయాల్లో బాధ్యతలు స్వీకరించారు. ముల్కీ నిబంధనలు చట్ట విరుద్ధమని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పును బహిరంగంగా స్వాగతించినందుకు అప్పటి సీమాంధ్రనేతలు కక్ష గట్టారు. భూసంస్కరణల చట్టం అమలుకు ఏకంగా ఆర్డినెన్స్‌ తీసుకురావడం తెలంగాణ-ఆంధ్రానేతలకు కంఠగింపుగా మారింది. ఫలితంగా పీవీ ముఖ్యమంత్రిగా పదవీచ్యుతడయ్యారు. భారత ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన భారతదేశాన్ని తన శక్తియుక్తులతో గట్టెక్కించారు. మెజారిటీ లేని తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఎన్నో నిందలు, అవమానాలు భరించారు. 1996లో ప్రధానమంత్రి పదవికాలం ముగిశాక పీవీ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  రాజకీయాల్లో అపరచాణక్యుడిగా పీవీకి పేరుంది. ఎమర్జెన్సీ తరువాత దేశమంతా కాంగ్రెస్‌ ఓడిపోయిన ఆంధ్రప్రదేశ్‌లోమాత్రం కాంగ్రెస్‌ జెండాను రెపరెపలాడించారు. 1981లో అలీన దేశాల విదేశాంగ మంత్రుల మహాసభకు పీవీ అధ్యక్షత వహించారు. తనకు వారసత్వంగా సంక్రమించిన భూమిని పేదలకు పంచిన త్యాగశీలి మన పీవీ.

పీవీ సాధించిన విజయాల్లో కొన్ని..

 • పీవీ తన శక్తియుక్తులు, రాజకీయ చతురత తో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టి ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించారు. దీంతో పీవీకి ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరు వచ్చింది. 
 •  పంజాబ్‌ తీవ్రవాదాన్ని అణచివేసిన ఘనత పీవీదే. 
 • దేశంలో అణుపరీక్షలు మొదలుపెట్టింది పీవీ సర్కారే
 • పీవీపై గౌరవంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఏకంగా కేంద్ర మానవ వనరుల శాఖను ఆయన కోసమే ఏర్పాటు చేశారు. తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను పీవీ ప్రజల కోసం వినియోగించారు. 
 • వంగరలో పీవీ మ్యూజియం ప్రారంభం...

స్వగ్రామం వంగరలో పీవీ మ్యూజియం ప్రారంభించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఆయన నివసించిన పురాతన భవనం పక్కనే మరో నూతన భవనాన్ని నిర్మించారు. పీవీ ఉపయోగించిన వస్తువులు, రచించిన పుస్తకాలను ఈ మ్యూజియంలో ఉంచేందుకు పీవీ తనయుడు పీవీ ప్రభాకర్‌రావు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. పీవీ జయంతి రోజున ఈ మ్యూజియాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

నేటి నుంచి పీవీ శత జయంతి ఉత్సవాలు...

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు సేవలు చిరస్మరణీయంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఏడాది పొడవునా శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. పీవీ జయంతి జూన్‌ 28న హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమిలో శతజయంతి ఉత్సవాల ప్రధాన కార్యక్రమాలు జరుగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పీవీ శతజయంతి వేడుకలు నిర్వహించనున్నారు. జయంతి ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించింది. హైదరాబాద్‌లో నేటి ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.  

ప్రభుత్వ నిర్ణయంతో వంగరలో హర్షాతిరేకాలు 

ఏడాదిపాటు శత జయంత్యుత్సవాలు జరుపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడంతో పీవీ స్వగ్రామం వంగరలో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సొంతపార్టీ నేతలు నిర్లక్ష్యం చేసినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పీవీని గుర్తించిందని పేర్కొంటున్నారు. పీవీకి సముచిత స్థానం కల్పించిన సీఎం కేసీఆర్‌కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

లక్నెపల్లితో అనుబంధం

1976లో పీవీ నర్సింహారావు లక్నెపల్లి గ్రామంలోని మేనమామ కొడుకు వద్దిరాజు శ్యాంరావు ఉపనయనానికి వచ్చారు. ఆయనను  కలిసిన పలువురు గ్రామస్తులు అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. పీవీ నర్సింహారావుకు ఇద్దరు తమ్ముళ్లు పీవీ మాధవరావు, పీవీ మనోహర్‌రావు. సోదరి సరోజినీదేవి ఉన్నారు. పీవీ నర్సింహారావు మృతిచెందిన పది రోజులకే సోదరి సరోజినీ దేవి కూడా మృతి చెందారు. 

సాహితీ సంపన్నుడు..

పీవీ బహుభాషా కోవిదుడు. ఆయనకు 17భాషల్లో ప్రావీణ్యం ఉంది. పీవీ తన సన్నిహితుడు పాములపర్తి సదాశివ రావుతో కలిసి 1944లో కాకతీయ పత్రికను వరంగల్‌ జిల్లాలో స్థాపించారు. 1946-1955 వరకు వారపత్రికను కొనసాగించారు. ఇందులో గొల్లరామవ్వకథ, నీలిరంగు పట్టుచీర, మంగయ్యజీవితం లాంటి రచనలు అప్పటి సామాజిక జీవనానికి అద్దంపట్టాయి. పీవీ రాసిన తన ఆత్మకథ ‘లోపలిమనిషి’లో భారతదేశ చరిత్ర, హైదరాబాద్‌ సంస్థానంలోని విశిష్టమైన అంశాలను, జరిగిన పరిణామాల గూర్చి వివరించారు. కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్య నారాయణ రచించిన వేయిపడగలును సహస్రఫణ్‌ పేరుతో హిందీలోకి అనువాదం చేశారు. ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఆయన ఆత్మకథ ‘ఇన్‌సైడ్‌' వివిధ భాషల్లోకి అనువదించారు. హరినారాయణ్‌ ఆప్టే మరాఠీ ప్రసిద్ధ నవల ‘పాన్‌లక్షత్‌ కోన్‌ఘెటా’ను పీవీ అబలజీవితం పేరుతో తెలుగులో అనువదించారు. సమైక్య రాష్ర్టానికి పీవీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భారత స్వాతంత్య్ర రజతోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా 1972 ఆగస్టు 15 అర్ధరాత్రి వరకు జరిగిన శాసనసభలో ‘ ఈ నిద్రాణ నిశీధి మహిత జాగృతి పుం జముగ వెలుగుటే నా  తపస్సు, వెలిగించుట  నా ప్రతిజ్ఞ’ అనడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల చప్పట్లతో సభ మార్మోగింది.

పీవీ స్మారక భవనం

దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జ్ఞాపకార్థం నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలో 2018 జూన్‌లో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్‌ పీవీ మెమోరియల్‌ ట్రస్ట్‌ భవనాన్ని ప్రారంభించారు. పీవీ జ్ఞాపకార్థం స్మారక చిహ్నంతోపాటు రూ.50 లక్షల వ్యయంతో ఆ ట్రస్ట్‌ను రూపొందించారు. పీవీ కూతురు సురభివాణీదేవి ప్రత్యేక చొరవతో ఈ ట్రస్ట్‌ నిర్మాణం జరిగింది. లక్నెపల్లిలో పీవీ కాంస్య విగ్రహాన్ని కూడా 2018లో కు టుంబసభ్యుల ఆర్థిక చేయూతతో ఏర్పాటు చేశారు.  

లక్నెపల్లిలో శత జయంతి వేడుకలు

పీవీ నర్సింహారావు జయంతిని పురస్కరించుకొని ఆదివారం లక్నెపల్లి గ్రామంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పీవీ శతజయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యు డు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్‌ హాజరుకానున్నట్లు పీవీ కుటుంబసభ్యులు సురభి వాణీదేవి, పీవీ మనోహర్‌రావు తెలిపారు. 

నేడు జేఎన్‌ స్టేడియంలో శత జయంతి 

రెడ్డికాలనీ: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి సందర్భంగా జేఎన్‌ఎస్‌ స్టేడియంలో ఆదివారం ఉదయం 10.35 గంటలకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ చీఫ్‌విఫ్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పీవీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. హన్మకొండ బస్టాండ్‌ జంక్షన్‌లోని పీవీ విగ్రహం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఎంపీ దయాకర్‌తో కలిసి దాస్యం పరిశీలించారు. 

నేడు ‘స్థితప్రజ్ఞుడు పీవీ’ పుస్తకావిష్కరణ

మహబూబాబాద్‌ టౌన్‌: కలెక్టరేట్‌లో నేడు నిర్వహిస్తున్న పీవీ శత జయంతి వేడుకలలో ‘స్థిత ప్రజ్ఞుడు పీవీ’ పుస్తకావిష్కరణ జరుగుతుందని మహబూబాబాద్‌ రచయితల సంఘం (మరసం) జిల్లా అధ్యక్షుడు గుర్రం సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కవులు, రచయితలు, కళాభిమానులు ఆశీర్వదించాలని కోరారు.

పీవీతో సన్నిహితంగా మెదిలా

సీఎం కేసీఆర్‌ పీవీకి అరుదైన గౌరవం ఇచ్చారు. ఆయన స్వగ్రామం వంగర నా నియోజకవర్గంలో ఉండడం చాలా ఆనందంగా ఉంది. యేటా వంగరలో జరిగే జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు నేను తప్పక హాజరవుతా. పీవీతో మా కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది. అందుకే నేను పీవీ సార్‌తో సన్నిహితంగా మెదిలాను. అది నాకు చాలా గర్వంగా ఉంది. 

- వొడితల సతీశ్‌కుమార్‌, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే  

పీవీకి భారతరత్న ఇవ్వాలి

పీవీకి భారతరత్న ఇవ్వాలని రెండేళ్ల క్రితం సైకిల్‌ యాత్ర ప్రారంభించా. ఏడాది క్రితం రాష్ట్రపతిని కలిసి పీవీకి భారతరత్న ఇవ్వాలని వినతిపత్రం సమర్పించా. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ కావడం మన అదృష్టం. 

-పిడిశెట్టి రాజు, సామాజిక కార్యకర్త  

మా ఊరుకోసం పాటుపడ్డడు

పీవీ దొర మా ఊరుకోసం పాటుపడ్డడు. ఆయన్ను చాలా దగ్గరినుంచి చూసిన. కులం, మతం అని సూడకపోయేది. ఎంతో మర్యాదిచ్చి మాట్లాడేది. కనిపిత్తే సాలు ఎట్లున్నౌ ఓదెలు అనేది. పీవీ దొర మ్యూజియం ఇక్కడే పెడ్తున్నరు అంటే సంబురమైతాంది.   -రొంట ఓదెలు, వంగర 

ఆనందంగా ఉంది

వంగర గ్రామంలో పీవీ మ్యూజియం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. అంతేకాదు పీవీజయంతి సందర్భంగా రాష్ట్రప్రభుత్వం శతజయంత్యుత్సవాలు ఏడాదిపాటు చేయాలని నిర్ణయించింది. పీవీకి ప్రభుత్వం కల్పించిన ప్రాధా న్యతను మా గ్రామ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు. 

-ఆలూరి రజిత, వంగర సర్పంచ్‌ 


logo