శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Jun 24, 2020 , 01:40:39

మంకీఫుడ్‌ కోర్టులకు వడివడిగా అడుగులు

మంకీఫుడ్‌ కోర్టులకు వడివడిగా అడుగులు

  • వరంగల్‌ మహానగరంలోనూ ఏర్పాట్లు 
  • రాష్ట్రంలోనే తొలిసారిగా ఇక్కడి కార్పొరేషన్‌ పరిధిలో..
  • 22వ డివిజన్‌లో ‘హరితహారం’తో ప్రారంభం
  • వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 475ఎకరాల గుర్తింపు
  • కోతుల పునరావాసానికి రూ.273.14కోట్లు
  • యాదాద్రి మోడల్‌కు రూ.120.07కోట్లు
  • విలేజ్‌ పార్కుల కోసం మరో రూ.81.38కోట్లు

ఉమ్మడి జిల్లాలో మంకీఫుడ్‌ కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం వడివడిగా కదులుతున్నది. ముఖ్యంగా రాష్ట్రంలోనే తొలిసారిగా వరంగల్‌ మహానగరంలో కోతుల పునరావాస కేంద్రం ఏర్పాటు కోసం చర్యలు చేపట్టింది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోనూ 475ఎకరాల స్థలాన్ని గుర్తించి ఆయా చోట్ల ఫుడ్‌కోర్టుల కోసం రూ.273.14కోట్లు కేటాయించింది. అన్ని ప్రాంతాల్లోనూ ఆరోవిడత హరితహారంలో భాగంగానే మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించింది. 

-వరంగల్‌ ప్రతినిధి/వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ 

వరంగల్‌ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ‘వానలు వాపస్‌ రావా లె.. కోతులు వాపస్‌ పోవాలె ’ సీఎం కేసీఆర్‌ హరితదీక్షతో మొదలైన హరితహారం ఆరో విడుత రేప టి నుంచి ప్రారంభం అవుతున్నది. హరితహారం కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టాలని, నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల్లోనూ మియావాకీ వనాల మాదిరిగా మంకీ ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఇటీవల సూచించారు. ఈ నేపథ్యంలో  వరంగల్‌ నగర పాలక సంస్థ సైతం నగరంలో కోతులబెడతను నివారిస్తూనే మరోవైపు మంకీఫుడ్‌కోర్టును ఏర్పాటు చేయాలని సంకల్పించింది.  ఇందుకోసం నగరంలోని 22వ డివిజన్‌లో ఫుడ్‌కోర్టు ఏర్పాటుకు కార్పొరేషన్‌కు సం బంధించిన ఎకరం స్థలంలో ముమ్మర ఏర్పా ట్లు సాగుతున్నాయి. నగరంలోని ఖమ్మం బైపాస్‌ రోడ్డు (ఉర్సుగుట్ట నుంచి నాయుడు పెట్రోల్‌పంప్‌ వైపు వెళ్లేదారిలో)లోని ఉప్పరోనికుంట (ఉర్సు గొల్లవా డ) సమీపంలో ఉన్న ఎకరం స్థలాన్ని ఎంపిక చేసి పండ్ల మొక్కలు పెంచేందుకు నేలను చదును చేస్తున్నారు.

చు ట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఫుడ్‌కోర్టు నిర్వహణ బాధ్యతను స్థానిక మహిళా స్వయం సహాయక సంఘానికి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. నిర్దేశిత స్థలంలో ఇప్పటికే బోరు వేశారు. వానరాలు నీళ్లు తాగేందుకు వీలుగా ఒక సంప్‌ను నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. ఈనెల 25న ఆరో విడుత హరితహారం ప్రారంభ కార్యక్రమాన్ని ఫుడ్‌కోర్టు స్థలం నుంచే అధికారికంగా ప్రారంభించేందుకు నగర పాలక సంస్థ ఏర్పా ట్లు చేస్తున్నట్టు నగర ఉద్యావనశాఖ అధికారి గుండా సునీత పేర్కొన్నారు. ఇందులో భాగం గా మంగళవారం నగర పాలక సంస్థ కార్యదర్శి విజయలక్ష్మి ఏర్పాట్లను పరిశీలించారు. ఉర్సు, రంగశాయిపేట, దామెరగుట్ట, అమ్మవారిపేట మొదలైన ప్రాంతాల నుంచి కోతులు ఎక్కువగా ఈ ప్రాంతంలోని ఇండ్లమీదికి వస్తున్నాయి. దీన్ని నివారించేందుకు ఉప్పరోనికుంట పరిసరాల్లో ఫుడ్‌కోర్టు వల్ల ఆ బెడద తగ్గనుంది. 

నాలాలకు ఇరువైపులా యూకలిఫ్టస్‌..

నగరంలో నాలాలకు ఇరువైవులా యూకలిప్టస్‌ మొక్కలు నాటాలని నగర పాలక సంస్థ కార్యా చరణ రూపొందించింది. నాలాల పరిరక్షణ, ఆక్రమణలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు కూడా వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు నాలాలు, వాటి పొడవు, వాటికి ఇరువైపులా ఉన్న బఫర్‌జోన్ల పరిస్థితిపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నది. 

వరంగల్‌ రూరల్‌, నమస్తేతెలంగాణ: హరితహారం కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం కొత్తగా చేపట్టే మంకీ ఫుడ్‌కోర్టులు, యాదాద్రి మోడల్‌ నేచురల్‌ ఫారెస్టు (మియావాకి), విలేజ్‌ పార్కు (పల్లె ప్రగతి వనం) ల కోసం స్థలాలను గుర్తించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పదహారు మండలాల్లో మంకీ ఫుడ్‌ కోర్టుల కోసం 273.14, మియావాకిల కోసం 120.07, విలేజ్‌ పార్కుల కోసం 81.38 ఎకరాలను అధికారులు గుర్తించారు.

158 లొకేషన్లలో మంకీ ఫుడ్‌కోర్టులు, 136 లొకేషన్లలో మియావాకిలు, 189 లొకేషన్లలో విలేజ్‌ పార్కులను ఏర్పాటు చేసేందుకు ఈ స్థలాల ను గుర్తించినట్లు వెల్లడించారు. గురువారం నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో కలెక్టర్‌ హరితకు మొత్తం 475.19 ఎకరాలతో నివేదిక అందజేశారు. మంకీ ఫుడ్‌కోర్టుల కోసం అత్యధికంగా పర్వతగిరి మండలంలో 98.33 ఎకరాలు, నెక్కొండలో 35.30, శాయంపేటలో 30, గీసుగొండలో 18.20, చెన్నారావుపేటలో 18, నడికూడలో 15, రాయపర్తిలో 11.20, సంగెంలో 8.20, వర్ధన్నపేటలో 8, దామెరలో 8, నల్లబెల్లిలో 6, ఖానాపురంలో 4.14, ఆత్మకూరులో 4.07, నర్సంపేటలో 3.35, దుగ్గొండిలో 2.25, పరకాలలో 0.10 ఎకరాల స్థలం గుర్తించారు.

136 లొకేషన్లలో మియావాకి

జిల్లాలో మియావాకి కోసం అధికారులు 136 లొకేషన్లలో 120.17 ఎకరాలు గుర్తించారు. పర్వతగిరి మండలంలోనే అత్యధికంగా 34.20 ఎకరాలు, రాయపర్తిలో 18.10, దుగ్గొండిలో 10.10, వర్ధన్నపే టలో 8.20, నల్లబెల్లిలో 8, చెన్నారావుపేటలో 6.30, నడికూడలో 6, శాయంపేటలో 5.36, సంగెంలో 4.20, గీసుగొండలో 4.06, నర్సంపేటలో 3.15, నెక్కొండలో 2.30, ఆత్మకూరులో 2.30, ఖానా పురంలో 1.30, పరకాలలో 1.30, దామెరలో 1.10 ఎకరాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మియావాకిల కోసం గుర్తించిన స్థలాల్లో మారేడు, నేరేడు, రేల, ఇప్ప, మోదుగు, రోజ్‌ఉడ్‌, నారేపి, మద్ది, జువ్వి, నీము, శ్రీగంధం, తన్ని, జమ్మి, టేకు, ఉసిరి, సితాఫల్‌, హెన్నా, బాంబు తదితర మొక్కలు నాటే ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారు. 

విలేజ్‌ పార్కుల కోసం...

విలేజ్‌ పార్కుల ఏర్పాటుకు అత్యధికంగా శాయంపేట మండలంలో 12.36 ఎకరాలు, నెక్కొండలో 9.36, రాయపర్తిలో 8.22, వర్ధన్నపేటలో 3.13, ఖానాపురంలో 1.14, గీసుగొండలో 1.14, సంగెంలో 2.24, చెన్నారావుపేటలో 4.34, పరకాలలో 0.10, ఆత్మకూరులో 5.33, దామెరలో 2.33, నర్సం పేటలో 2.22, నల్లబెల్లిలో 8, నడికూడలో 7.13, పర్వతగిరిలో 5.01, దుగ్గొండిలో 5.13 ఎక రాలు ఉంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా మంకీ ఫుడ్‌కోర్టులు, మియావాకిలు, విలేజ్‌ పార్కుల్లో నాటాల్సిన మొక్కలకు సంబంధించి అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

రాష్ట్రంలోనే మనదే తొలిఅడుగు 

సీఎం కేసీఆర్‌ ఆలోచనా విధానానికి అనుగుణంగా నగరంలో కోతుల బెడతను నివారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ఆరోవిడత హరితహారం ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. రాష్ట్రంలోనే మంకీ ఫుడ్‌కోర్టు ఏర్పాటు చేస్తున్న కార్పొరేషన్లలో వరంగల్‌ మొదటిది. 

 -గుండా ప్రకాశ్‌రావు, మేయర్‌