ఆదివారం 17 జనవరి 2021
Warangal-rural - Jun 24, 2020 , 01:11:45

కష్టకాలంలో కర్షకులకు సర్కారు అండ

కష్టకాలంలో కర్షకులకు సర్కారు అండ

  •  రైతు బంధుతో కొండంత ఆర్థిక భరోసా
  •  అన్నదాతల ఖాతాల్లో శరవేగంగా నగదు జమ
  •  జూన్‌ 16దాకా పట్టా, పాస్‌పుస్తకాలు పొందినవారికీ లబ్ధి
  • ఆనందంలో హలధారులు
  •  ఉత్సాహంగా వ్యవసాయ పనులకు
  • ఉమ్మడి జిల్లాలో జోరందుకున్న సాగు

ప్రపంచం మొత్తాన్ని కరోనా కుదిపేసింది. లాక్‌డౌన్‌తో చిరువ్యాపారాల నుంచి మొదలు బడా సంస్థల దాకా కుదేలయ్యాయి. ఆర్థిక వ్యవస్థ ఆతలాకుతలమైంది. రాష్ట్ర ఖజానా గోరంతకు చేరింది. ఈ తరుణంలో ఈ సారి అన్నదాతలకు రైతుబంధు సాయం సాధ్యం కాదనే వాదనలు వినిపించాయి. ఇక సీఎం కేసీఆర్‌ చెప్పిన పంటలు వేస్తేనే పెట్టుబడి అందుతుందని, లేదంటే రాదనే ప్రచారాలు కూడా ఊపందుకున్నాయి. ప్రతిపక్షాలైతే ‘ఏకంగా ఈ సారి రైతుబంధు ఇవ్వండి చూస్తాం’ అని సవాల్‌ విసిరినంత పని చేశాయి. దీంతో రైతుల్లోనూ ఒకింత నిరాశ నెలకొంది. వ్యవసాయ రంగ ప్రాముఖ్యతను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇంతటి విపత్కర సమయంలోనూ అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ కొత్త లబ్ధిదారులను కలిపిమరీ రైతుబంధు డబ్బులు విడుదల చేయడం అన్నదాతల్లో ఆనందం నింపింది. వానకాలం సాగు పనులకు సరికొత్త ఉత్సాహంతో కదిలేలా చేసింది.   

- నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్‌

 జిల్లాలు             రైతులు     రైతుబంధు డబ్బు  

వరంగల్‌ అర్బన్‌     93,667     రూ.97.74కోట్లు  

వరంగల్‌ రూరల్‌     1,63,539     రూ.162.33కోట్లు

జనగామ     1,53,316     రూ.201.58 కోట్లు

మహబూబాబాద్‌      1,47,478     రూ.166.65కోట్లు

భూపాలపల్లి     90,088     రూ.96.77 కోట్లు

ములుగు     66,050     రూ.70.60 కోట్లు


భయపట్టిచ్చిన్రు

సీఎం కేసీఆర్‌ చెప్పిన పంట వేస్తేనే పెట్టుబడి పైసలస్తయని అందరు భయపట్టిచ్చిన్రు. ఇష్టమున్నట్లు ప్రచారం చేసిన్రు. లాక్‌డౌన్‌ల ఎవ్వలకు పనుల్లేవాయె. సర్కారుకు సుతం రాబడి లేదాయె. మాకు రైతుబంధు వస్తదో రాదోనని కొంత అగులుబుగులైంది. నాకు మూడున్నరెకరాల భూమున్నది. పెట్టుబడి కోసం ఇద్దరు ముగ్గుర్నడిగిన. పైసలు దొర్కక ఎకరం ఖాళీ ఉంచి, రెండున్నరెకరాల్ల పత్తి గింజలు పెట్టిన. రైతుల కష్టం, ఎవుసం విలువ తెలిసిన ముఖ్యమంత్రి సారు అందరి అంచనాలు తలకిందులు చేసి రైతు బంధు పైసలు ఖాతాల వేసిండు. నాకు మూడున్నరెకరాలకు రూ.17,500 వచ్చినయ్‌. ఇప్పుడు మనసు నిమ్మలమైంది. ఇగ మిగిలిన భూమిల సుతం పంటపండిస్త.     

- కంజర్ల యాకయ్య, కక్కిరాలపల్లి, ఐనవోలు

 వరంగల్‌ సబర్బన్‌:  జిల్లాలో 93, 667 మంది రైతుల ఖాతాల్లో రూ.97కోట్ల 74 లక్షల 23వేల 335 జమకానున్నాయి. ఇప్పటికే ఎకరం మొదలుకొని ఐదెకరాల వ్యవసాయ భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. 119 గ్రామాలకు సంబంధించి 86,278 మంది రైతుల బ్యాంకు ఖాతాలను వ్యవసాయాధికారులు రైతుబంధు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు. 84, 494 మంది రైతుల కు సంబంధించి రూ. 86 లక్షల 96 వేల 25 వేల 656 ట్రెజరీలో జమ చేశారు. మిగిలినవాటిని వెరిఫై చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నా తమకోసం రైతుబంధు డబ్బులను సర్కారు ఇవ్వడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  దేశానికి వెన్నెముకగా రైతులను కొనియాడే దేశంలో సేద్యం కోసం ప్రభుత్వం ఇలా ప్రోత్సాహమిస్తే కర్షకులు ఉత్సాహంగా వ్యవసాయం చేస్తారని చెబుతున్నారు. కాగా ఈసారి అర్హత ఉన్న ప్రతి రైతుకూ రైతుబంధు డబ్బు వచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకోసం మండల, డివిజన్‌, జిల్లా స్థాయిల్లో నోడల్‌ అధికారులుగా ఏవో, ఏడీఏ, జేడీఏలు పనిచేస్తారు. 

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో

వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ : జిల్లా వ్యాప్తంగా 16మండలాల్లో 1,72,490మంది రైతులున్నారు. వీరిలో 1,63,539 మందిఖాతాల్లో రూ.162.33 కోట్ల డబ్బులు జమకానున్నాయి. బుధవారం సా యంత్రం నుంచి విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి.