సొసైటీ ‘భూ’ మంతర్

- స్థలం పేరిట కుంభకోణం
- ఇష్టారాజ్యంగా 38ఎకరాలు కొనుగోలు
- మధ్యవర్తులకు రూ.1.5కోట్ల కమీషన్
- జనగామలోని ‘రుద్రమదేవి సొసైటీ’లో
- అక్రమాలు బట్టబయలు రూ.7కోట్ల రికవరీకి నివేదిక
- జనగామ, నమస్తే తెలంగాణ, జూన్ 20 : రెండు దశాబ్దాల నుంచీ నిర్వహిస్తున్న ఓ సొసైటీలో భూ కుంభకోణం బట్టబయలైంది. కొందరు ఉద్యోగులు, దళారులు ఏకమై స్థలం కొనుగోలు పేరిట అక్రమాలకు పాల్పడిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. సుమారు రూ.70కోట్ల టర్నోవర్తో 1,271 గ్రూపులతో 25వేల మంది సభ్యులున్న ఈ సంఘంలో అవినీతి కలకలం రేపింది. సభ్యులు దశాబ్దాలుగా జమచేసిన డబ్బుతో పలువురు అక్రమార్కులు ఏకం గా 38 ఎకరాల భూమిని కొని అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. అధిక ధరకు భూమిని కొనుగోలు చేయడమే కాకుండా మధ్యవర్తులకు రూ.కోటిన్నర ఇచ్చినట్లు రికార్డు ల్లో రాయడంతో విచారణ జరిపిన సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్రావు నివ్వెరపోయారు. భారీ కుంభకోణం జరిగిందని గ్రహించి శాఖా పరమైన, క్రిమినల్ చర్య లు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా కేంద్రంలోని రుద్రమదేవి మహిళా పరస్పర సహాయక సహకార పొదుపు పరపతి సంఘాన్ని 1994లో స్థాపించి 1998లో రిజిస్టర్ చేశా రు. అప్పటి నుంచి ఎన్నో అవార్డులు, ప్రశంసలందుకున్న ఈ సంఘం, అనంతర కాలంలో రఘునాథపల్లి, సింగరాజుపల్లి, తరిగొప్పుల, ఆలేరు, జనగామలో బ్రాంచిలను సైతం ఏర్పాటు చేసుకున్నది. సభ్యులు జమ చేసిన మొత్తానికి మూడింతలు రుణమిచ్చే స్థాయికి ఎదిగింది. దాదాపు 25వేల మంది సభ్యులున్న ఈ సొసైటీ 250 గ్రామాలకు విస్తరించింది. ఇందులో 1,271 గ్రూపులున్నాయి. 40 మంది మహిళా సిబ్బంది, 15 మంది బోర్డు సభ్యులతో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వ్యక్తిగత, గ్రూపు రుణాలను ఇస్తూ ప్రస్తుతం రూ.70 కోట్ల టర్నోవర్తో సొసైటీ నడుస్తున్నది.
ఎకరాకు రూ.4లక్షల కమీషన్
సొసైటీ సొమ్మును కాజేయాలనుకున్న కొందరు ఉద్యోగులు కూటమి కట్టారు. జనగామ మండలం వడ్లకొండ శివారులో 38.01 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇందులో కొంత స్థలంలో గుట్టలే ఉన్నాయి. అయినా సభ్యుల సొమ్మే కదా అని ఇష్టారీతిన ఒప్పందాలు చేసుకున్నారు. ఎకరాకు రేటు రూ.15లక్షలు, మధ్యవర్తులకు ఎకరాకు రూ.4,01,000 చొప్పున కమీషన్ ఇచ్చేలా సొసైటీ అధికారులతో ఒప్పందం చేసుకున్నారు. 19 కుటుంబాలకు చెందిన వేర్వేరు సర్వే నంబర్లలో స్థలాన్ని కొన్నారు. సర్వే నంబర్లు 297, 298/ఏ/ఏ/3, 286/బీ, 294/బీ, 295/ఏ, 293/డీ, 298, 295/ఏ/1, 298/1, 286/బీ/1, 303/సీ/1, 293/సీ, 298/బీ/1, 297/బీ, 315/హెచ్/2, 300/బీ, 302/డీ/1, 315 లలో మొత్తం 38.21 భూమి కొనుగోలు చేశారు. లెక్కల్లో మాత్రం రూ.19,01,000 చొప్పున ఎకరం కొనుగోలు చేసినట్లు చూపారు. రూ.7.26 కోట్ల సభ్యుల సొమ్మును ఖర్చు చేసి కమీషన్ ఆశించాలని చూసిన సొసైటీ ఉద్యోగుల అక్రమాల వ్యవహారం ఉన్నతాధికారులకు ఆలస్యంగా తెలిసింది. కొనేది ఒక ధర, లెక్కల్లో చూపించింది మరో ధర ఉండడం, కమీషన్లు ఇచ్చినట్లు చూపించడం సహకార సంస్థల చట్టానికి వ్యతిరేకమని సీనియర్ ఉద్యోగులు చెప్తున్నారు. సహకార సంస్థ చట్టాలకు తూట్లు పొడిచినా కొంత మంది అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోకుం డా నోటీసుల పేరుతో కాలయాపన చేస్తూ రావడం అనుమానాలకు తావిస్తున్నది. మధ్యర్తులుగా వ్యవహరించిన వారికి రూ.1,42,50,000 చెల్లించినట్లు రసీదులున్నాయి. కానీ భూములను అగ్రిమెంట్ చేసుకున్న జోషి దామోదరాచారి మాత్రం రూ.1,30,00,000 మాత్రమే కమీషన్ ముట్టినట్లు విచారణాధికారి ఎదుట చెప్పినట్లు సమాచారం.
రూ.7కోట్లు రికవరీ చేయాలని నివేదిక
భూ వ్యవహరంలో విచారణ చేసిన సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్రావు సంఘంలో అనేక లోపాలున్నట్లు గుర్తించారు. సొసైటీ సీఈవో కవిత, అధ్యక్షురాలు బీ విజయలక్ష్మి, కార్యదర్శి జీ విజయలక్ష్మి, మాజీ కార్యదర్శి పద్మ, సొసైటీ ఉద్యోగులు జీ శ్రీనివాస్, దేవేందర్, లక్ష్మణ్, సుగుణమ్మ నుంచి మొ త్తం రూ.7.09 కోట్లు రికవరీ చేయాల్సిందేనని తన ని వేదికలో పేర్కొన్నారు. విచారణలో వాహనం కొనుగో లు వ్యవహారం, భవన మరమ్మతుల అక్రమాలు సై తం వెలుగుచూశాయి. వీటికి సంబంధించి కూడా రికవరీ చేయాలని నివేదికలో పేర్కొన్నారు. కాగా ఎలాం టి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు జి ల్లా సహకార అధికారి మద్దిలేటిని ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించ లేదు.