బుధవారం 12 ఆగస్టు 2020
Warangal-rural - Jun 21, 2020 , 01:53:35

కాళేశ్వర వసంతం

కాళేశ్వర వసంతం

  • ప్రాజెక్టు ఎత్తిపోతలు మొదలై నేటికి తొలి ఏడాది
  • మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ దాకా సాగిన ప్రస్థానం 
  • మండువేసవిలోనూ గోదావరి నిండుకుండ 
  • ఊరూరా కొనసాగుతున్న జల జాతర
  • తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన ప్రాజెక్టు 

ఒక నది మరో నదిని సృష్టించిన అపూర్వఘట్టం.. బీడు భూములను సస్యశ్యామలం చేసే జలకావ్యం ఆవిష్కృతమై నేటికి ఏడాది. ‘గలగలా గోదారి తరలిపోతుంటేను’ అని పాడుకున్న సందర్భం నుంచి ‘గలగలా గోదారి ఎదురేగి వస్తుంటె’ అని పండుగ చేసుకునే రోజులు తెచ్చిన ‘కాళేశ్వరం’ ఎత్తిపోతలు మొదలై తొలి వసంతం పూర్తయింది. అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొక్కవోని దీక్షతో అనతికాలంలోనే కళ్లెదుట సాక్షాత్కరించిన ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి వెనక్కి మళ్లి, పల్లెపల్లెనా ప్రతి మడినీ తడుపుతూ.. జల జాతర చేస్తూ మేడిగడ్డ నుంచి కొండ పోచమ్మను చేరి తెలంగాణ ‘ప్రాణహితం’గా నిలిచింది. ‘గిన్ని నీళ్లను కండ్ల జూస్తమని కలల సుతం అనుకోలే.. కంటికందనంత దూరంల నిలిచిన నీళ్లను సూత్తాంటె దసరా పండుగ చేసుకున్నంత సంబురమైతాంది’ అనేంతగా రైతులకు మనోధైర్యాన్నిచ్చింది.     

కాళేశ్వరం/మహదేవపూర్‌ : మేడిగడ్డ బరాజ్‌, కన్నెపల్లి పంప్‌హౌస్‌.. అక్కడి నుంచి గోదావరి ఎత్తిపోతలు.. అటు నుంచి పదమూడున్నర కిలోమీటర్ల దూరం అడవిని, కొండలను, గుట్టలను చీల్చుకుంటూ మరో నది పారినట్టు గ్రావిటీ కాలువలో నీళ్లు.. అక్కడి నుంచి అన్నారం బరాజ్‌లోకి పరవళ్లు.. తర్వాత సుందిల్ల, ఎల్లంపల్లి నుంచి.. మధ్యమానేరు.. కొండపోచమ్మ దాకా సాగిన ప్రస్థానం.. అపూర్వ దృశ్యకావ్యం. మూడేండ్ల శ్రమ, కాలానికే యాష్టకొచ్చే రీతిలో జరిగిన పని.. యుద్ధ ప్రాతిపదికకు ప్రపంచంలో అసలైన నిదర్శనం. కాకతీయులు గొలుసు కట్టు చెరువులను కట్టిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ చరిత్రను తిరగరాసిండు.. తెలంగాణకు తెలివెక్కడిది.. వాళ్లకు పాలించుడేడ వస్తది అని నీల్గిన నాలుకలే కరుచుకునేలా తెలంగాణ జలకావ్యాన్ని చరితార్థం చేసిండు.  

మానవ అద్భుత నిర్మితం.. 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచంలోనే మానవ నిర్మాణాల్లో ఒక అద్భుతంగా ప్రఖ్యాతి గాం చింది. కరువుదీరా నీరందించేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశలు, ఆశయాలకు అనుగుణంగా ప్రాజెక్ట్‌ను డిజైన్‌ చేసి దీనిని నిర్మించారు. రాష్ట్ర సాధన సమయంలో తెలంగాణ అంతా కలియ దిరిగిన సందర్భంలోనే రాష్ట్రంలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను సముద్రం పాలు కాకుండా సాగునీటికి మళ్లించాలనే భగీరథ ప్రయత్నంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు రూపుదిద్దుకున్నది.

2016లో భూమి పూజ..

2016 సంవత్సరం మే 2న కాళేశ్వరం ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక పూజలు చేసి కన్నెపల్లి, మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో పలుమార్లు కాళేశ్వరాన్ని సందర్శించడంతో పాటు, ప్రాజెక్టు పనులను వాయువేగంతో పూర్తిచేయించారు. ఆ ఫలితంగానే అనుకున్న సమయానికే అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ రాష్ర్టానికి అన్నపూర్ణగా ‘కాళేశ్వరం ప్రాజెక్టు’ ఆవిష్కృతమై తెలంగాణ ప్రజల కల సాకారమైంది.

మేడిగడ్డలో ప్రధాన బరాజ్‌

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత ప్రధానమైంది మేడిగడ్డ బరాజ్‌, కాళేశ్వరం వద్ద గోదావరిలో ప్రాణహిత కలిసే ప్రాంతానికి ఎగువన మేడిగడ్డ బరాజ్‌ను నిర్మించారు. రివర్స్‌ పంపింగ్‌ ద్వారా నీటిని లిఫ్ట్‌ చేసే విధంగా డిజైన్‌ చేసి 1.67 కిలోమీటర్ల పొడవుతో బరాజ్‌ పూర్తిచేశారు. దీనికి 85 గేట్లను అమర్చి కుడి, ఎడమ వైపున కర కట్టలు కట్టారు. కుడి(తెలంగాణ)వైపున 6.30 కిలోమీటర్లు, ఎడమ (మహారాష్ట్ర) వైపున 11.7 కిలో మీటర్లు కరకట్టలను నిర్మించారు.

దేవతామూర్తుల పేర్లు..

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బరాజ్‌లు, పంప్‌హౌస్‌లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేవతామూర్తుల పేర్లు పెట్టారు. ప్రస్తుతం ఆ పేర్లతోనే బరాజ్‌లను, పంప్‌హౌస్‌లను పిలుస్తున్నారు. మహదేవపూర్‌ మండల సరిహద్దు దండకారణ్యమైన మేడిగడ్డ బరాజ్‌ (లక్ష్మీ) వద్ద నుంచే కాళేశ్వరం ఎత్తిపోతలు మొదలవుతాయి. ఇక్కడి నుంచి ఎత్తిపోతలను 2019, జూన్‌ 21న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. బరాజ్‌ వద్ద నిల్వయిన నీటిని సమీపంలోని కన్నెపల్లి (లక్ష్మీ) పంప్‌హౌస్‌ నుంచి ఎత్తిపోస్తారు. గ్రావిటీ కెనాల్‌ ద్వారా అన్నారం (సరస్వతీ) బరాజ్‌కు, అక్కడి నుంచి సుందిళ్ల (పార్వతి) బరాజ్‌కు.. తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు.. అటు నుంచి మిగతా పంప్‌హౌస్‌లు, ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోస్తారు. ఇలా ఎత్తిపోతలు మొదలై గలగలా గోదారి ఎదురేగి వచ్చి పల్లెల్లో ప్రతి మడీని తడుపుతుంటూ ఊర్లన్నీ జల జాతర చేసుకుంటున్నాయి. 


logo