సోమవారం 18 జనవరి 2021
Warangal-rural - Jun 18, 2020 , 03:05:04

ఎస్సారెస్పీ మైనర్‌ కాలువలకు తూములు

ఎస్సారెస్పీ మైనర్‌ కాలువలకు తూములు

  • 341 ఓటీల నిర్మాణానికి రూ.13.06కోట్లు
  • యుద్ధప్రాతిపదికన పనులు
  • గొలుసుకట్టు పద్ధతిలో చెరువులకు నీరు
  • ఉమ్మడి జిల్లాలో 786 చెరువుల్లోకి సుమారు 11టీఎంసీల తరలింపు
  • 83వేల ఎకరాల ఆయకట్టుకు మేలు 

చెరువుల్లోకి ఎస్సారెస్పీ కాలువల ద్వారా ‘కాళేశ్వర’ జలాలను తరలించేందుకు ప్రభుత్వం శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నది. గొలుసుకట్టు విధానంలో నీటి సరఫరా కోసం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు మైనర్‌ కెనాళ్లకు తూముల ఏర్పాటు పనులను వేగవంతం చేసింది. హన్మకొండ సర్కిల్‌ పరిధిలో 341తూములు నిర్మించి, షట్టర్లు అమర్చేందుకు రూ.13.06కోట్లు కేటాయించింది. వీటిలో 204ఓటీల నిర్మాణం పూర్తికాగా, మరో 27 వివిధ దశల్లో ఉన్నాయి. 110 తూముల పనులు మొదలుకావాల్సి ఉండగా మొత్తం అందుబాటులోకి వస్తే ఉమ్మడి జిల్లాలోని 786చెరువులకు సుమారు 11టీఎంసీల నీటిని తరలించే అవకాశం కలుగుతుంది. దీంతో 83వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు నోచుకోనుండగా రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. 


వరంగల్‌ రూరల్‌, నమస్తేతెలంగాణ : ‘కాళేశ్వరం’ నీటిని చెరువుల్లోకి తరలించేందుకు గాను ప్రభుత్వం ఎస్సారెస్పీ కాలువలకు తూము(ఓటీ)లు నిర్మిస్తున్నది. ఇప్పటికే మెజార్టీ పనులు పూర్తికాగా మరికొన్నింటి నిర్మాణం వివిధ దశల్లో ఉన్నది. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర జలాశయం)లోకి అక్కడి నుంచి కరీంనగర్‌ జిల్లాలోని దిగువమానేరు జలాశయానికి చేరుతున్న కాళేశ్వర జలాలు, కాకతీయ ప్రధాన కాలువ ద్వారా జిల్లాలోని ఆయకట్టుకు చేరుతున్నాయి. ముందెన్నడూ లేని విధంగా గత డిసెంబర్‌ నుంచి ఏప్రిల్‌ దాకా ప్రభుత్వం కాళేశ్వరం నీటిని కాకతీయ ప్రధాన కాలువ దార్వా సరఫరా చేసింది. వరుసగా నాలుగు నెలలకుపైగా ఎస్సారెస్పీ కాలువలో సామర్థ్యం మేరకు నీటి ప్రవాహం రావడం ఉమ్మడి జిల్లా చరిత్రలో ఇదే తొలిసారి. ఏప్రిల్‌ పదిహేను వరకు చివరి ఆయకట్టు దాకా ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీరందడం కూడా ఇదే ప్రథమం. నింపేందుకు అవకాశం ఉన్న ప్రతి చెరువులోకీ ప్రభుత్వం కాళేశ్వరం జలాలను తరలించింది. దీంతో ఎస్సారెస్పీ తొలి, రెండో దశ పరిధిలోని చెరువులకు జలకళ వచ్చింది. గతంలో వర్షాకాలంలోనూ నిండని పలు చెరువులు వేసవిలోనూ మత్తడి దుంకాయి. చెరువులు నిండడంతో భూగర్భ జలమట్టం కూడా పెరిగింది.

మైనర్‌ కాలువల నుంచి..

చెరువుల్లోకి కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని తరలించేందుకు శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. గొలుసుకట్టు పద్ధతిలో గ్రామాల్లోని చెరువులకు నీటిని సరఫరా చేసేందుకు ఎస్సారెస్పీ మైనర్‌ కాలువలకు తూములు నిర్మించాలని ఇంజినీర్లను ఆదేశించింది. ఈ మేరకు తూముల నిర్మాణం, షట్టర్ల ఏర్పాటు అంచనాలను ఇంజినీర్లు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. మూడు నెలల్లో పూర్తి చేయాలని ఇటీవల ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా పనులను ఇంజినీర్లు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఎస్సారెస్పీ హన్మకొండ సర్కిల్‌ పరిధిలో మైనర్‌ కాలువలకు 341 తూములు నిర్మించి, షట్టర్లు అమర్చేందుకు ప్రభుత్వం రూ.13.06 కోట్లు ఇచ్చింది. వీటిలో ఇప్పటివరకు 204 తూముల నిర్మాణం పూర్తయింది. మరో 27 పనులు ప్రగతిలో ఉన్నాయి. 110 తూముల పనులు మొదలు కావాల్సి ఉన్నది. పూర్తయిన వాటిలో 116 తూములకు షట్టర్లు బిగించారు. మళ్లీ ఎస్సారెస్పీ ప్రధాన కాలువ నుంచి నీటిని విడదల చేసేలోగా అన్ని తూముల నిర్మాణం, షట్టర్ల బిగింపు పనులు పూర్తిచేసే దిశగా ఇంజినీర్లు ముందుకు వెళ్తున్నారు. తూముల నుంచి నేరుగా చెరువులోకి అటునుంచి మత్తడి ద్వారా ఇతర చెరువుల్లోకి ఇలా గొలుసుకట్టు విధానంలో నీటి సరఫరా ఉంటుందని ఎస్సారెస్పీ హన్మకొండ సర్కిల్‌ పర్యవేక్షక ఇంజినీరు వెంకటేశ్వర్లు తెలిపారు. 

786 చెరువుల్లోకి నీరు

ఎస్సారెస్పీ హన్మకొండ సర్కిల్‌ పరిధిలో మైనర్‌ కాలువలకు నిర్మించే 341 తూముల ద్వారా 786 చెరువుల్లోకి కాళేశ్వరం నీరు చేరనుంది. కరీంనగర్‌, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాల్లోని ఈ చెరువుల కింద 83,060 ఎకరాల ఆయకట్టు ఉన్నది. 786 చెరువుల్లో అత్యధికంగా నర్సంపేట నియోజకవర్గంలోనే 214 ఉన్నట్లు ఎస్సారెస్పీ ఇంజినీర్లు తెలిపారు. ఆ తర్వాత పరకాలలో 108, డోర్నకల్‌లో 106, మహబూబాబాద్‌లో 103, హుజూరాబాద్‌లో 94 చెరువులు ఉన్నట్లు వెల్లడించారు. తూముల నిర్మాణంతో ఎస్సారెస్పీ కాలువల ద్వారా 786 చెరువుల్లోకి 11,438 ఎంసీఎఫ్‌టీలు అంటే 11టీఎంసీలకు పైగా నీరు చేరుతుందని ఇంజినీర్లు అంచనా వేశారు. ఏటా ఎస్సారెస్పీ కాలువల ద్వారా తూముల నుంచి గొలుసుకట్టు విధానంపై కాళేశ్వరం నీటిని చెరువుల్లో నింపడం ప్రభుత్వ లక్ష్యమని ఎస్‌ఈ వివరించారు.