రాష్ట్రంలోనే తొలి మియావాకి ఫారెస్ట్ ఏర్పాటు

- పర్యాటకులను ఆకట్టుకునేలా ఆక్సిజన్ పార్కు
- ‘కుడా’ ఆధ్వర్యంలో రూ. 4 కోట్లతో నిర్మాణం
- రేపు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన
మడికొండ : పర్యాటకులను ఆకట్టుకునేలా ఆక్సిజన్ పార్కు రూపుదిద్దుకుంటున్నది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో రాంపూర్‌లో 99 ఎకరాల సువిశాలమైన స్థలంలో నిర్మిస్తున్న ఈ పార్కు వరంగల్ నగరానికే తలమానికం కానుంది. సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో దీనిని ఏర్పాటు చేస్తుండగా, రాష్ట్రంలోనే తొలిసారి మియావాకి ఫారెస్టు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 17న ఐటీ, పరిశ్రమల శాఖామాత్యులు కల్వకుంట్ల తారకరామారావు చేతుల మీదుగా ఈ పార్కుకు శంకుస్థాపన చేసేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రత్యేకతలెన్నో..
ఆక్సిజన్ పార్కులో అనేక ప్రత్యేకతలున్నాయి. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారికి ఆనుకుని పార్కు నిర్మిస్తున్నందున అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 99 ఎకరాల స్థలంలో ఇప్పటికే ఉన్న ఊర చెరువును అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం పూడిక తీసిన మట్టిలో మియావాకి, బ్లాక్ ప్లాంటేషన్ ఏర్పాటుచేశారు. పార్కులో భాగంగా గ్రాండ్ ఎంట్రెన్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, గేట్ వే నిర్మాణం, ఉమ్మడి వరంగల్ జిల్లా టూరిజం గ్యాలరీ, ఫుడ్ కోర్ట్ (రెస్టారెంట్, కాఫిటేరియా), పాత్ వే నిర్మాణాలు, బోటింగ్, పార్కింగ్, లైవ్ ఫిషింగ్ యాక్టివిటీ, వివిధ రకాల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి నగరానికి వచ్చే పర్యాటల సౌకర్యార్థం జాతీయ రహదారిపై ఉండే గ్రాండ్ ఎంట్రెన్స్ నుంచి నేరుగా పార్కులోకి వచ్చేందుకు మార్గం కూడా ఏర్పాటు చేస్తున్నారు.
మియావాకి ఫారెస్ట్ ప్రత్యేకత
తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచడమే మియావకి విధానం. దీన్ని రాష్ట్రంలో తొలిసారి ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నారు. ప్రజలు అధిక సంఖ్యలో ఉన్న చోట ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. సాధారణంగా మూడు మీటర్లకు ఒక మొక్క చొప్పున నాటుతారు. కానీ, ఈ విధానంలో అర మీటరులోపే రకరకాల చెట్లను నాటడం దీని ప్రత్యేకత. ఈ చెట్లు పెరిగిన కొద్ద్దీ దట్టమైన అడవిలా మారుతుంది. అదేవిధంగా మధ్యలోంచి పాత్ వే కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ చెట్ల మధ్యన వెళ్తుంటే ఫారెస్టులో వెళ్తున్నామనే అనుభూతి కలిగేలా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే ఈ విధానంలో 20 వేల ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. ఈ చెట్లు ఏడాదిలోనే సుమారు 20 ఫీట్ల ఎత్తు పెరుగుతాయి. ఇటీవల సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని వంద రకాలతో 6 వేల మొక్కలతో బ్లాక్ ప్లాంటేషన్ కింద మొక్కలు నాటారు.
త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం
కుడా ఆధ్వర్యంలో సుమారు రూ. 4 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఆక్సిజన్ పార్కును త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. నగరానికి వచ్చి వెళ్లే పర్యాటకులు సేద తీరేందుకు అనువుగా నిర్మిస్తున్నాం. సుగంధ, ఔషధ, పూల మొక్కలతో గార్డెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. 90 ఎకరాల స్థలంలో 30 ఎకరాల్లో ఉన్న చెరువును సుందరంగా తీర్చిదిద్ది, మిగతా 60 ఎకరాల్లో దట్టమైన అడవిని సృష్టించబోతున్నాం. జపాన్ తరహాలో మియావాకి విధానాన్ని తొలిసారి రాష్ట్రంలో వినియోగించబోతున్నాం. యువకుల కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నాం.
- మర్రి యాదవరెడ్డి, కుడా చైర్మన్
తాజావార్తలు
- ఆదాతో ఆర్థిక కష్టాలకు చెక్: బీ అలర్ట్.. కరోనా ఎఫెక్ట్
- మాస్క్.. మట్టిలో కలిసేందుకు 50 ఏండ్లు
- ఎస్వీబీసీకి రూ.1.11 కోట్ల విరాళం
- రేపు అంగన్వాడీ సిబ్బందికి చీరెలు పంపిణీ
- జూబ్లీహిల్స్‌లో గ్యాంగ్‌వార్ కలకలం
- రామ్ చరణ్ ఖాతాలో మరో ఇద్దరు దర్శకులు.. నెక్ట్స్ ఏంటి..?
- బెంగాల్ బరిలో శివసేన.. 100 స్థానాల్లో పోటీ?!
- మమతా బెనర్జీ ఇస్లామిక్ ఉగ్రవాది: యూపీ మంత్రి
- బస్సును ఢీకొన్న లారీ.. 8 మందికి గాయాలు
- లారీని ఢీకొట్టిన బైక్ : యువకుడు దుర్మరణం.. యువతికి తీవ్రగాయాలు