మంగళవారం 26 జనవరి 2021
Warangal-rural - Jun 13, 2020 , 01:32:16

నీటి వృథాకు చెక్‌

నీటి వృథాకు చెక్‌

n అర్బన్‌లో 13నిర్మాణాలకు అనుమతులు

n నాలుగింటికి ఇప్పటికే టెండర్లు

n త్వరలోనే మిగతా వాటికి

n జనగామ జిల్లాలో మరో 18 

n ఏడాదిలోగా పూర్తికి అధికారుల చర్యలు

n పెరగనున్న భూగర్భ జలాలు

n మారనున్న ప్రాంతాల రూపురేఖలు

చారిత్రక ఓరుగల్లు నగరం చుట్టూ జలహారం పొదగనున్నది. కాంక్రీట్‌ జంగల్‌గా మారి ఆటవిడుపు కోసం ఆహ్లాదకర వాతావరణమే కునమరుగైన తరుణంలో వరంగల్‌ నగరం చూట్టూ త్వరలోనే చక్కటి ప్రకృతి హొయలు దర్శనమీయనున్నాయి. మండుటెండల్లోనూ పండు వెన్నెలను మరిపించేలా ఎడాది పొడవునా నీరు నిలువ ఉండేలా వాగులపై చెక్‌ డ్యాంల నిర్మాణానికి చకచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నగరం చుట్టూ ఉన్న నాలుగు మండలాల పరిధిలోని వాగులపై గతంలో 28చెక్‌ డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు కొన్ని చోట్ల సమృద్ధిగా నీరు చేరే అవకాశాలు లేవని గుర్తించి 17 చెక్‌డ్యాంలు కట్టవచ్చని నిర్ణయించారు. వీటికి మొత్తం రూ.60 కోట్ల 54 లక్షల 30వేలు కేటాయించారు. ప్రస్తుతం 13చెక్‌డ్యాంలను మంజూరు చేశారు. ఎల్కతుర్తి, ఐనవోలు, కమలాపూర్‌ మండలాల పరిధిలో ఈ చెక్‌డ్యాంల నిర్మాణాలకు ప్రత్యేక ప్రామాణికాలు తీసుకున్నారు. అన్ని డ్యాముల్లోకి వర్షపు నీటితో పాటు, కాకతీయ కాలువ, దేవాదుల పథకం ద్వారా నీరు వచ్చేలా ప్రణాళికలు వేశారు. ప్రతి ఆనకట్టను రెండు నుంచి రెండున్నర మీటర్ల ఎత్తుతో నిర్మించనున్నారు. 13చెక్‌డ్యాంలలో కలిపి రెండు వేల మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్ల (ఎంసీఎఫ్‌టీ) నీరు నిల్వ ఉంటుంది. ఇప్పటికే ఎల్కతుర్తి, కమలాపూర్‌ మండలాల పరిధిలో నాలుగు చెక్‌డ్యాంలకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఎల్కతుర్తితో ఒకటి, కమలాపూర్‌ మండల పరిధిలో వెంకటేశ్వర్ల పల్లె, శనిగరంలో రెండు, గూడూరు, నేరెళ్లలో రూ. 5 కోట్ల 4 లక్షల 97 వేలతో ఆరు చెక్‌ డ్యాంలు కడుతారు. ఐనవోలు మండల పరిధిలోని ఆకేరు వాగుపై నందనం గ్రామ పరిధిలోనే రూ.7కోట్ల83లక్షల 29వేలతో మూడు చెక్‌డ్యాంలు నిర్మించనున్నారు. 

గతంలోనే  ఏడు నిర్మాణం

కరీంనగర్‌ జిల్లా పరిధిలో ఉన్నప్పుడే మంత్రి ఈటల రాజేందర్‌ కమలాపూర్‌ మండల పరిధిలో రూ.14.45 కోట్లతో ఏడు చెక్‌డ్యాంలను మంజూరు చేశారు. వీటిలో నేరెళ్ల, అంబాల, గోపాల్‌పూర్‌, మర్రిపెల్లిగూడెం, శంభునిపల్లి, ఉప్పల్‌, వంగపల్లిలో మొత్తం ఏడు డ్యాంలు పూర్తయ్యాయి. శనిగరం, నాగారం చెరువు నీళ్లు వచ్చే.. రెండు వాగులు కలిసే మర్రిపల్లిగూడెం వద్ద రూ.2.93 కోట్లతో కట్టిన పెద్ద చెక్‌డ్యాంలో కిలోమీటర్ల మేర నీరు నిల్వ ఉండి కనువిందు చేస్తున్నది. తాజాగా మంజూరైన 13చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయితే జిల్లా మొత్తం జలశోభను సంతరించుకోనున్నది. ప్రాజెక్టుల పరిధిలో రైతాంగానికి సాగునీరు పుష్కలంగా అందనున్నది. 

మత్య్స కారులకు వరం

ఇప్పటికే కట్టిన చెక్‌డ్యాంలతో ఆయా గ్రామాల పరిధిలోని మత్య్సకారులకు ఉపాధి పరంగా బాగా కలిసివస్తున్నది. వీటికి తోడు ఇప్పుడు నిర్మించే చెక్‌డ్యాంలతో మరింత ఆదాయం సమకూరనున్నది. ఏడాది పొడవునా పశు, పక్ష్యాదులకు తాగునీరు సమృద్ధిగా లభించనుంది. వాగుల్లో ఇసుక దందాకు సైతం చెక్‌ పడనుంది. భూగర్భ జలాలు గణనీయంగా పెరగనున్నాయి. దీంతో పాటు ఆయా ప్రాంతాలు ప్రజలకు ఆహ్లాదం పంచనున్నాయి. 

జనగామ జిల్లాకు మరో 18.. 

జనగామ జిల్లాకు ప్రభుత్వం మరో 18 చెక్‌డ్యాంలు మంజూరు చేసింది. వీటి నిర్మాణానికి రూ.62.90 కోట్లు కేటాయించింది. ఇప్పటికే జిల్లాలోని వాగులపై పలుచోట్ల చెక్‌డ్యాంలు కట్టగా, తాజా నిర్మాణాలతో జిల్లా అంతా సస్యశ్యామలం కానున్నది. పాతవి 72చెక్‌డ్యాంలు కలుపుకొని జిల్లాలో 946 చెరువులున్నాయి. గతేడాది ఐదు చెక్‌డ్యాంలను (పెద్దమడూరు, చిన్నమడూరు, కడివెండి, దేవరుప్పుల, కొడకండ్ల) రూ.19.95 కోట్లతో నిర్మించగా 1672.26 ఎకరాలకు సాగు నీరు అందుతున్నది. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన పాలకుర్తి నియోజకవర్గంలో, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ నియోజకవర్గంలో, డాక్టర్‌ తాటికొండ రాజయ్య స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో చెక్‌డ్యాంల నిర్మాణాలకు కృషి చేస్తున్న క్రమం లో తాజాగా జిల్లాలో 18 చెక్‌డ్యాంల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. జనగామ నియోజకవర్గంలో ఏడు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఐదు, పాలకుర్తిలో ఆరు చెక్‌డ్యాంలకు  ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూ.62.90కోట్లతో 18 చెక్‌డ్యాంలు నిర్మించనున్నారు. వీటితో 5711.22 ఎకరాలకు సాగునీరు అందనుంది. చిల్పూరులో పనులు ప్రారంభం కాగా, మిగతా చోట్ల టెండర్లు, ఒప్పందం దశలో ఉన్నాయి. జనగామ మండలం యశ్వంతపూర్‌ వాగుపై నాలుగు, బచ్చన్నపేట మండలం కాశీపేటలోని పెద్దవాగుపై రెండు చెక్‌ డ్యాం లు నిర్మిస్తున్నారు. ఇదే పెద్ద వాగుపై పోచన్నపేటలో మరోటి కట్టనున్నారు. 

ఈ ఏడాదిలో పూర్తి చేస్తాం..

కొత్తగా జనగామ జిల్లాలో 18 చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టబోతున్నం. వీటన్నింటి ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నం. వర్షాకాలంలో పనులకు ఇబ్బందైతే కాస్త ఆలస్యమవుతుంది. గతంతో పోలిస్తే జిల్లాలో భూగర్భ జలాల నీటి మట్టం పెరిగింది. మిషన్‌కాకతీయ ద్వారా చెరువులను బాగుచేసినం. నీటి వృథాను చాలా వరకు అరికట్టాం. ఇప్పుడు కట్టే చెక్‌డ్యాంలతో మరిన్ని ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయి. 

- శంకర్‌రావు, ఈఈ, నీటిపారుదల శాఖ (జనగామ)logo