శుక్రవారం 22 జనవరి 2021
Warangal-rural - Jun 11, 2020 , 03:56:36

ప్రతి గ్రామంలో విలేజ్‌ పార్కు ఏర్పాటు

ప్రతి గ్రామంలో విలేజ్‌ పార్కు ఏర్పాటు

  • తాజాగా  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  • స్థలాలు గుర్తించాలని కలెక్టర్‌ ఆదేశాలు
  •  గ్రామకంఠం, ప్రభుత్వ భూముల పరిశీలన
  •  దాతల నుంచి కూడా స్థల సేకరణకు యత్నం
  • ఇప్పటికే ఊరూరా నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్‌యార్డు

(వరంగల్‌రూరల్‌-నమస్తేతెలంగాణ)

పల్లెల ప్రగతికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక విలేజ్‌ పార్కు ఏర్పా టు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామంలో, ఊరికి సమీపంలో గాని కనీసం ఎకరం ఉండేలా స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. దీంతో బుధవారం వరంగల్‌రూరల్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో విలేజ్‌ పార్కు కోసం అందుబాటులో ఉన్న గ్రామకంఠం, ప్రభుత్వ భూములను పరిశీలించారు. కొన్ని గ్రామాల్లో పార్కు నిర్వహణకు అవసరమైన స్థలం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న దాతలను కలిశారు. పట్టణాలకు తీసిపోని రీతిలో పల్లెలను అభివృద్ది చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యం లో గత ఏడాది పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చిం ది. సమస్యల పరిష్కారానికి ఊరూరా ఈ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తుంది.

పల్లెలను ప్రగతి బాట పట్టించేందుకు ప్రతి గ్రామంలో పచ్చదనం కోసం ఇప్పటికే ఒక నర్సరీ ఏర్పాటు చేసింది. దీనికితోడు ఊరూరా వైకుంఠదామం, డంపింగ్‌ యార్డు నిర్మాణం చేపట్టింది. వీటి నిర్మాణ పనులు కొన్ని గ్రామాల్లో పూర్తికాగా మరికొన్ని గ్రామాల్లో వివిధ దశ ల్లో కొనసాగుతున్నాయి. ఇవి పూర్తయితే ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీ, వైకుంఠదామం, డంపింగ్‌యార్డు ఇలా మూడు పనిచేయనున్నాయి. ఇక పరిశుభ్రత కోసం ప్రతి గ్రామ పంచాయతీకి కొద్ది నెలల క్రితం ప్రభుత్వం ట్రాక్ట ర్‌ లేదా మినీ ట్రాక్టర్‌, ఆటో ట్రాలీ గాని సమకూర్చింది. మొక్కలకు నీరు పోసేందుకు ట్రాక్టర్‌తో పాటు ట్యాంకర్‌ కొనుగోలుకూ గ్రామ పంచాయతీలకు అనుమతి ఇచ్చింది. దీంతో మెజారిటీ గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్‌, ట్యాంకర్‌ కొనుగోలు జరిగింది. తడి, పొడి చెత్త సేకరణకు ఇంటింటికి డస్ట్‌బిన్లను అందజేసింది. ఈ డస్ట్‌బిన్ల ద్వారా ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్తను గ్రామ పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్లలో డంపింగ్‌యార్డుకు తరలిస్తుంది. ట్రాక్టర్‌, ట్యాంకర్‌ ద్వారా నర్సరీలోని మొక్కలకు, గ్రామంలో నాటిన మొక్కలకు నీరు పోస్తుంది. 

తాజాగా విలేజ్‌ పార్కు

ప్రధానంగా నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్‌యార్డుతో ఆయా గ్రామం రూపురేఖలు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రతి గ్రామంలో ఒక విలేజ్‌ పార్కు ఏర్పా టు చేయాలని ప్రభుత్వం నిర్ణయించటం విశేషం. ప్రభుత్వ ఆదేశాలతో మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఎం.హరిత జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమావేశం నిర్వహించా రు. జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, డీఆర్‌డీవో ఎం.సంపత్‌రావు, జెడ్పీ సీఈవో రాజారావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. విలేజ్‌ పార్కు ఏర్పాటు కోసం ప్రతి గ్రామంలో స్థలాలను రెండు రోజుల్లో గుర్తించాలని, కనీ సం ఎకరం స్థలం ఉండాలని జిల్లా కలెక్టర్‌ చెప్పారు. ఆయా గ్రామంలో గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు ఉంటే పరిశీలించాలని, పార్కు ఏర్పాటు చేసే స్థలం ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామంలో లేదా గ్రామానికి సమీపంలో గాని ఉండేలా చూడాలని ఆమె పేర్కొన్నారు.

ఎకరం లేని గ్రామం లో అంతకంటే తక్కువ భూమి ఉన్నా కూడా పరిశీలించాలని, గ్రామ కంఠం, ప్రభుత్వ భూమి గాని లేని గ్రామంలో దాతల నుంచి స్థల సేకరణ జరపాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. దాతలు ఇచ్చే స్థలాల్లో ఏర్పాటు చేసే పార్కు వద్ద వారు సూచించిన పేర్లు పెడుదామని స్పష్టం చేశారు. దీంతో బుధవారం జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఇతర అధికారులు రంగంలోకి దిగారు. తొలిరోజు జిల్లావ్యాప్తంగా పలు గ్రామాలు సందర్శించి విలేజ్‌ పార్కు ఏర్పాటు కోసం అందుబాటులో ఉన్న గ్రామ కంఠం, ప్రభుత్వ భూములను గుర్తించారు. ఈ స్థలాలకు సంబంధించి సర్వే నంబర్లు, ఆయా సర్వే నంబరులో ఎంత స్థలం ఉంది, ఇతర వివరాలు సేకరించారు. కొన్ని గ్రామాల్లో దాతల నుంచి స్థలాలను స్వీకరించేందుకు ప్రయత్నించారు. జిల్లాలోని 401 గ్రామ పంచాయతీల పరిధిలో విలేజ్‌ పార్కు ఏర్పాటు కోసం గుర్తించిన స్థలాలపై గురువారం జిల్లా కలెక్టర్‌ హరితకు నివేదిక అందజేస్తారు. ఈ నివేదికపై అదేరోజు సాయంత్రం జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలతో కలెక్టర్‌ సమావేశమై చర్చిస్తారు. అనంతరం ప్రతి గ్రామంలో ఒక విలేజ్‌ పార్కు నిర్మాణంపై ప్రభు త్వం మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉందని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు వెల్లడించారు.


logo