రూపుదిద్దుకుంటున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు

- 1370 ఎకరాల్లో శరవేగంగా అభివృద్ధి పనులు
- పెట్టుబడులకు ప్రభుత్వంతో పలు కంపెనీల అగ్రిమెంట్
- త్వరలో వస్త్ర పరిశ్రమల స్థాపనకు రానున్న సంస్థలు
వస్త్ర నగరి వడివడిగా ముస్తాబవుతున్నది. దేశానికే తలమానికంగా నిలువనున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్నది. పరిశ్రమల స్థాపన కోసం తెలంగాణ ప్రభుత్వం 1370 ఎకరాల్లో టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ చేపట్టిన పలు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. పార్కు చుట్ట్టూ ప్రహరీ, అంతర్గత రహదారుల నిర్మాణం, స్ట్రీట్ లైట్ల ఏర్పాటు వంటి పనులు పూర్తవుతున్నాయి. విద్యుత్ సరఫరా కోసం పార్కులో ఎన్పీడీసీఎల్ 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మించింది. మౌలిక వసతులు సమకూరడంతో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమలు కొన్ని త్వరలోనే టెక్స్టైల్ పార్కుకు వచ్చే అవకాశం ఉంది.
వరంగల్ రూరల్, నమస్తేతెలంగాణ: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం రూ. 40 కోట్లు మంజూరు చేసింది. పార్కు చుట్టూ గ్రౌండ్ లెవల్ నుంచి 1.8 మీటర్ల ఎత్తుతో 13 కి.మీ. ప్రహరీ నిర్మిస్తున్నారు. రోడ్డు క్రాసింగ్‌లు, అప్రోచెస్ వద్ద మరో 500 మీటర్లు ప్రహరీ పూర్తి కావాల్సి ఉంది. అంతర్గత రోడ్లు మొత్తం 18 కి.మీ. నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. తొలి విడత 11 కి.మీ. రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో 8 కి.మీ. పనులు పూర్తి చేశారు. డబ్ల్యూబీఎం లేయింగ్తో బీటీ డబుల్‌రోడ్డు వేశారు. మిగతా 3 కి.మీ. పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. 6 కి.మీ. పొడవుతో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 4 కి.మీ. పొడవునా పనులు పూర్తయ్యాయి. ప్రహరీ, రహదారులు, స్ట్రీట్ లైట్ల మిగులు పనులన్నీ కొద్ది రోజుల్లో పూర్తి కానున్నాయని టీఎస్ఐఐసీ వరంగల్ జోనల్ మేనేజర్ రతన్ రాథోడ్ తెలిపారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు కోసం ప్రత్యేకంగా ఎన్పీడీసీఎల్ 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మించింది. నూతన స్తంభాలు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ పార్కుకు ఇదే సబ్‌స్టేషన్ నుంచి నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతున్నది.
రూ. 11 వేల కోట్ల పెట్టుబడులు
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక కార్యాచరణతో కసరత్తు చేస్తున్నారు. తిర్పూర్, కోయంబత్తూరు ప్రాంతాల్లోని వస్త్ర పరిశ్రమల యాజమాన్యాలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వస్ర్తాలు, లుంగీలు, దుప్పట్ల వంటి తయారీ యూనిట్లతోపాటు స్పిన్నింగ్, జిన్నింగ్ యూనిట్లను క్రమపద్ధతిలో నెలకొల్పే మ్యాప్‌లు రూపొందించారు. మొత్తం రూ. 11 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని టీఎస్ఐఐసీ, పరిశ్రమల శాఖ అంచనాలు వేశాయి. వివిధ దశల్లో స్పిన్నింగ్, టెక్స్టైల్, వీవింగ్, నిట్టింగ్ ప్రాసెసింగ్, ఉలెన్ ఫ్యాబ్రిక్, యార్న్, డైయింగ్, టవల్-షీటింగ్, ప్రింటింగ్ యూనిట్లు, రెడీమేడ్ వస్ర్తాల వంటి తొమ్మిది విభాగాల్లో భిన్నమైన పరిశ్రమలు టెక్స్టైల్ పార్కుకు రానున్నాయి. ఫాంటు ఫ్యాషన్ విధానంతో రూపుదిద్దుకుంటున్న ఈ వస్త్ర నగరిలో జాతీయ శిక్షణ సంస్థలు, టెక్స్టైల్ కళాశాల ఏర్పాటు కానుంది. శంకుస్థాపన జరిగిన తర్వాత వివిధ దేశాలకు చెందిన 14 వస్త్ర పరిశ్రమలు పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇటీవల ఓ కొరియా కంపెనీ ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంది. ఈ కంపెనీకి ప్రభుత్వం పార్కులో 290 ఎకరాల భూమి కేటాయించింది. తాజాగా ‘ఈచల్ అండ్ కరంజి’ గ్రూపు 50 ఎకరాల్లో వస్త్ర పరిశ్రమ నెలకొల్పేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
శిక్షణకు భారీ కసరత్తు
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు ఏర్పాటు కానున్న దరిమిలా.. నైపుణ్యం గల వ్యక్తులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పరిశ్రమల శాఖ భారీ కసరత్తు చేస్తున్నది. కోయంబత్తూరులోని ప్రముఖ విద్యా సంస్థ పీఎస్జీతో టెక్స్టైల్ కళాశాల ఏర్పాటుకు ఇప్పటికే ఒప్పందం చేసుకున్నది. టీఎస్ఐఐసీ, రాంకీ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పార్కు ద్వారా సుమారు రెండు లక్షల మందికి ఉపాధి లభించనుందని పేర్కొన్నాయి. సాధారణ సేవల్లోనూ కొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపాయి. ఈ పార్కులో పరిశ్రమలకు అవసరమయ్యే నీటిని దేవాదుల ప్రాజెక్టు, ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా పంపింగ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కు స్థలంలో ఉన్న రెండు చెరువులను రిజర్వు పాయింట్లుగా మార్చే పనిలో నిమగ్నమయ్యారు. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను అక్కడికక్కడే ట్రీట్మెంట్ ప్లాం టులో పునర్వినియోగానికి అధికారులు చర్యలు తీసుకోనున్నారు. వస్త్ర పరిశ్రమలతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు రాష్ర్టానికే తలమానికం కానుంది.
1,370 ఎకరాల్లో మెగా పార్కు..
మన నేత కార్మికుల వలసలకు చరమగీతం పాడటానికి సీఎం కే చంద్రశేఖర్‌రావు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును వరంగల్‌లో స్థాపించేందుకు సంకల్పించారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట హవేలి, సంగెం మండలం చింతలపల్లి గ్రామాల మధ్య సుమారు 1,200 ఎకరాలను రైతుల నుంచి సేకరించారు. ఇందుకోసం రూ. 87.78 కోట్లు వెచ్చించారు. వస్త్ర పరిశ్రమ కోసం 731 మంది పట్టాదారులు స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చారు. మరో 170 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు టీఎస్ఐఐసీకి బదలాయించారు. దీంతో పార్కు స్థలం 1,370 ఎకరాలకు చేరింది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుగా నామకరణం చేసిన సీఎం కేసీఆర్ దీనికి 2017 అక్టోబర్ 22న శంకుస్థాపన చేశారు.
టెక్స్టైల్ పార్కు అప్డేట్స్
1.8 మీటర్ల ఎత్తులో 13 కి. మీ ప్రహరీ నిర్మాణంలో కేవలం 500 మీటర్లు పూర్తి కావాల్సి ఉంది. 18 కి. మీ అంతర్గత రోడ్లు నిర్మించాల్సి ఉండగా 11 కి. మీ పనులు చేపట్టారు. 8 కి. మీ పూర్తయింది. నాలుగు కిలోమీటర్ల పొడవునా స్ట్రీట్‌లైట్లు బిగించారు. సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి సేవలకు సిద్ధమైంది.
ప్రత్యేకతలివే..
- వస్ర్తాలు, లుంగీలు, దుప్పట్ల తయారీ
- స్పిన్నింగ్, టెక్స్టైల్, వీవింగ్, నిట్టింగ్ ప్రాసెసింగ్, ఉలెన్ ఫ్యాబ్రిక్, యార్న్, డైయింగ్, టవల్-షీటింగ్, ప్రింటింగ్ యూనిట్లు
- జాతీయ శిక్షణ సంస్థలు, టెక్స్టైల్ కళాశాల ఏర్పాటు
- 14 వస్త్ర పరిశ్రమలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు
- కొరియా కంపెనీతో అగ్రిమెంట్
- 50 ఎకరాల్లో ఈచల్ అండ్ కరంజీ గ్రూపు ఇండస్ట్రీ
- ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి
- ఐదు దశాబ్దాలపాటు పది వేల మందికిపైగా కార్మికులకు ఉపాధి కల్పించి సమైక్య పాలకుల కుటిలనీతికి చరిత్రగా మిగిలిపోయిన ఆజంజాహి మిల్లును మరిపించేలా ఏర్పాటవుతున్న మెగా టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతుల పనులు పూర్తికావొచ్చాయి. దేశ, విదేశీ సంస్థల భాగస్వామ్యంతో రూ. 11 వేల కోట్ల పెట్టుబడుల అంచనాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు రెండు లక్షల మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా నిర్మితమవుతున్న ఈ పార్కులో ప్రహరీ, విద్యుత్, అంతర్గత రోడ్ల వంటి పనులు తుది దశకు చేరుకున్నాయి.
తాజావార్తలు
- చరిత్రలో ఈరోజు.. అమెరికా పౌరుల బందీ.. 1 ఏడాది 2 నెలల 2 వారాల 2 రోజులు..
- కిసాన్ ర్యాలీ భగ్నానికి ఉగ్ర కుట్ర
- 'సర్కారు వారి పాట' ఖాతాలో సరికొత్త రికార్డ్
- రాజ్యాంగం అసలు కాపీని ఆ బాక్స్‌లో ఎందుకు ఉంచారో తెలుసా?
- ఎగిరే బల్లి..పొలంలో అలజడి
- ట్రంప్ కొత్త పార్టీ పెట్టడం లేదు..
- ఈ 'కుక్క' మాకూ కావాలి
- చైనాలో ఇంటర్నెట్ స్టార్ గా మారిన 4ఏళ్ల చిన్నారి, స్పేస్ సూట్ లో పీపీఈ కిట్
- కరోనా టీకా తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్
- మురికివాడలో మెరిసిన ముత్యం..సెలబ్రిటీలను ఫిదా చేసిన మలీషా