శనివారం 04 జూలై 2020
Warangal-rural - Jun 07, 2020 , 02:27:46

రేపటి నుంచి తెరుచుకోనున్న ఆలయాలు

రేపటి నుంచి తెరుచుకోనున్న ఆలయాలు

  • వృద్ధులు, పిల్లలకు ప్రవేశం లేదు

వరంగల్‌ కల్చరల్‌/మట్టెవాడ: కొవిడ్‌-19వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రెండు నెలలుగా మూసి ఉన్న ఆలయాల తలుపులు సోమవారం తెరుచుకోనున్నాయి. ఇన్ని రోజులుగా ఆలయాల్లో అర్చకులు మాత్రమే నిత్యపూజలు నిర్వహించేవారు. లాక్‌ డౌన్‌ సడలింపులో భాగంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఈనెల 8వ తేదీ నుంచి ఆలయాల్లో భక్తులకు దైవ దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 60ఏళ్ల పైబడిన వారు, 10 ఏళ్లలోపు పిల్లలకు ఆలయంలోనికి అనుమతిలేదని దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌, భద్రకాళీ ఆలయ ఈవో సునీత తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూ చించారు. ఉమ్మడి జిల్లాల్లోని అన్ని దేవాలయాలకు ఈ సూచనలు వర్తిస్తాయని ఆమె వెల్లడించారు. మట్టెవాడలోని శ్రీ భోగేశ్వరాలయంలో భక్తుల దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 

బుగులు వెంకన్న ఆలయంలో..

స్టేషన్‌ఘన్‌ఫూర్‌: రెండో తిరుపతిగా పేరొందిన చిలుపూరు బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం ఆలయ ముఖద్వారాన్ని శుభ్రం చేశారు. భౌతిక దూరం పాటించేలా సర్కిళ్లు గీశారు. ఆలయంలో ఉదయం అభిషేక కార్యక్రమాల తర్వాత 6గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు ఎక్కువ సమయం క్యూలో వేచి ఉండకుండా హారతి, తీర్థం, శఠగోపం వంటివి ఉండవని, తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని ఆలయ చైర్మన్‌ ఇనుగాల నర్సింహారెడ్డి, ప్రధాన అర్చకుడు రవీందర్‌ శర్మ తెలిపారు. 

శ్వేతార్కలో..

కాజీపేట: కాజీపేట పట్టణంలోని శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో సోమవారం నుంచి భక్తులకు ఆలయ ప్రవేశాలను కల్పిస్తున్నట్లు దేవాలయ వ్యవస్థాపకుడు ఐనవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి తెలిపారు. దేవాలయంలో శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేవాలయాన్ని రోజూ ఉదయం 7 గంటలకు తెరిచి, 11 గంటలకు మూసివేసి, మళ్లీ సాయంత్రం ఆరు గంటలకు తెరిచి రాత్రి 8 గంటలకు మూసివేయనున్నట్లు చెప్పారు. logo