సోమవారం 13 జూలై 2020
Warangal-rural - Jun 01, 2020 , 04:06:07

ఐదు నెలల్లో గౌరవెల్లికి నీళ్లు

ఐదు నెలల్లో గౌరవెల్లికి నీళ్లు

  • సీఎం హామీని నిలబెట్టుకుంటాం.. 
  • రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచాం 
  • రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌

రెడ్డికాలనీ, మే 31: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు ఐదు నెలల్లో గౌరవెల్లికి నీళ్లు ఇచ్చి హామీని నిలబెట్టుకుంటామని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ అధికారిక నివాసంలో వినోద్‌కుమార్‌, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వీ సతీశ్‌కుమార్‌తో రిజర్వాయర్‌ పనుల పురోగతిపై ఆదివారం సమీక్షించారు. రానున్న ఐదు నెలల్లో రిజర్వాయర్‌లో నీళ్లు నింపుతామని వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో గౌరవెల్లి రిజర్వాయర్‌ సామర్థ్యం కేవలం 1.41 టీఎంసీలతో రూపొందించారని, సీఎం కేసీఆర్‌ రీ డిజైన్‌ చేసి దాన్ని 8.23 టీఎంసీల సామర్థ్యానికి పెంచారని తెలిపారు. ఈ ఘనత కేవలం సీఎం కేసీఆర్‌దే అన్నారు. శ్రీరాంసాగర్‌ వరద కాల్వ పరిధిలోని గౌరవెల్లి రిజర్వాయర్‌ పనులు దాదాపు పూర్తయ్యాయని, మిగిలిన పనులు సత్వరమే పూర్తి చేయాలని వినోద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. త్వరలోనే మోటర్ల బిగింపు పనులు పూర్తవుతాయని చెప్పారు. కాల్వల నిర్మాణానికి భూసేకరణ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని వినోద్‌కుమార్‌ ఆయా జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు సూచించారు. హుస్నాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని హుస్నాబాద్‌, కోహెడ మండలాలు సిద్దిపేట జిల్లాలోకి, చిగురుమామిడి, సైదాబాద్‌ మండలాలు కరీంనగర్‌ జిల్లాలోకి, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోకి వస్తాయని, ఆయా మండలాలకు గౌరవెల్లి నుంచి నీళ్లు 

అందిస్తామని వివరించారు. logo