మంగళవారం 07 జూలై 2020
Warangal-rural - Jun 01, 2020 , 04:04:34

లాక్‌డౌన్‌తో ఫొటోగ్రాఫర్ల కష్టాలు

లాక్‌డౌన్‌తో ఫొటోగ్రాఫర్ల కష్టాలు

  • సీజన్‌ కోల్పోయి సతమతం..
  • ఉపాధి లేక అవస్థలు
  • ఇంటి అద్దెలు, ఈఎంఐలు కట్టేందుకు తిప్పలు

గతాన్ని, వర్తమానాన్ని భవిష్యత్‌ తరాలకు చూపే కళ ఫొటోగ్రఫీ సొంతం. దైనందిత జీవితంలో ఎన్నో అనుభూతులు, తీపిగుర్తులు, ఉద్వేగ క్షణాలు, చెదరని జ్ఞాపకాలను కలకాలం నిలిపేది ఒక్క ఫొటో మాత్రమే. ఒక ‘చిత్రం’ వేయి పదాలకు సమానం అంటారు. కానీ, ఇప్పుడా ‘చిత్రం’ చిన్నబోయింది. ‘కరోనా’ మహమ్మారి వారి జీవితాలను ఛిద్రం చేసింది. దీన్నే వృత్తిగా స్వీకరించి, లక్షల పెట్టుబడి పెట్టిన ఫొటోగ్రాఫర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముహూర్తాలు ఎక్కువగా ఉండే ఈ మూడు నెలల సీజన్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో పూర్తిగా తుడిచిపెట్టుకపోగా, వారికి ఉపాధి కరువైంది. ఇంటి అద్దెలు, కెమెరాలకు ఈఎంఐలు చెల్లించలేక అవస్థలు పడాల్సి వస్తున్నది. 

-వెంకటాపూర్‌

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా సుమారు 30 వేల మంది ఫొటో, వీడియోగ్రాఫర్లు ఉన్నా రు. వీరు ప్రధానంగా వివాహాలు, పుట్టిన రోజు కార్యక్రమాలు, గృహప్రవేశాలు, ఔట్‌డోర్‌లో హట్స్‌, ఆహ్వాన సాంగ్స్‌ కంపోజింగ్‌, వివిధ శుభకార్యాలు, కార్యక్రమాలకు ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడున్న హైటెక్‌యుగంలో హై రెజల్యూషన్‌ కెమెరాలు తప్పనిసరి. ఒక్కో కెమెరాను రూ. లక్ష నుంచి మొదలు రూ. 10 లక్షలు, అంతకు పైగా డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన వారూ ఉన్నా రు. మరికొందరు డ్రోన్‌ కెమెరాలతోనూ ప్రోగ్రా మ్స్‌ చేసే వారున్నారు. గ్రామీణ ప్రాంతాల నుం చి నగరాలు, పట్టణ ప్రాంతాల్లో వేలల్లో షాపులు కిరాయికి తీసుకొని ఫొటోస్టూడియోలు, ల్యాబ్‌ లు ఏర్పాటు చేశారు. 

ముహూర్తాలు ఉంటేనే ఉపాధి

శుభ ముహూర్తాలు ఉన్న సమయంలో ఫొటోగ్రాఫర్లకు చేతినిండా పని ఉంటుంది. ఏటా పెండ్లిళ్ల సీజన్‌ వీరికి ప్రధాన ఆదాయ వనరు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలలో పెళ్లిళ్ల ముహూర్తాలు ఉన్నాయి. ఫొటోగ్రాఫర్లు ఈ మూడు నెలలు రాత్రింబవళ్లు పనిచేస్తారు. మిగతా సమయాల్లో వీరు అడపాదడపా పని చేస్తూ ఉపాధి వెదుక్కుంటారు. శుభకార్యాలకు ఫొటోలు, వీడియోలు తీసేందుకు 5డీ మార్క్‌4 కెమెరా, జెడ్‌150 వీడియో కెమెరాతో ఒక ప్రోగ్రాం చేసి ఇచ్చే ఫొటోగ్రాఫర్‌కు రూ. 25 వేల వరకు ఆదాయం ఉండేది. మూడు నెలల్లో 15 నుంచి 30 పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ఫొటోలు, వీడియోలు తీసే వారు. వాటిని ల్యాబ్‌లకు తీసుకెళ్లి ఆల్బమ్స్‌ తయారు చేస్తే షీట్‌ల లెక్కన డబ్బులు వచ్చేవి. ఇటు ఫొటోగ్రాఫర్లతో పాటు అటు కలర్‌ ల్యాబ్‌లు నిర్వహించే వారికి ఉపాధి ఉండేది. 

లాక్‌డౌన్‌తో మొదలైన కష్టాలు..

కరోనా మహమ్మారితో దేశం మొత్తం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. శుభకార్యాలు నిలిచి ఫొటోగ్రాఫర్లకు ఉపాధి లేకుండా పోయింది. మూడు నెలలుగా వారు ఇళ్లలో ఖాళీగా ఉంటున్నారు. గతంలో శుభకార్యాలకు బంధుమిత్రులు ఎక్కువగా వచ్చేవారు. ఒక్క వివాహ శుభకార్యానికి సంబంధించి 100 షీట్స్‌తో ఆల్బమ్‌ తయారు చేసుకునే కష్టమర్లు ఉండేవారు. ఇటీవల లాక్‌డౌన్‌ను సడలించిన విషయం తెలిసిందే. పరిమిత సంఖ్యలో బంధుమిత్రులకు అనుమతి ఉంటుండడంతో కేవలం 15 నుంచి 20 షీట్స్‌కి మించి రావడం లేదని పలువురు ఫొటోగ్రాఫర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 60 కోట్ల మేర నష్టపోయినట్లు వారు పేర్కొన్నారు.

మూడు నెలల రెంట్‌ చెల్లించాలె..

లాక్‌డౌన్‌ కారణంగా మూడు నెలలుగా శుభకార్యాలు వాయిదా వేసుకున్నారు. చిన్నచిన్న కార్యక్రమాలకు బయటకు వెళ్లలేని పరిస్థితి. మూడు నెలలుగా ఇంటి కిరాయి చెల్లించలే. నెలకు రూ.10వేల చొప్పున రూ. 30 వేలను యజమానికి ఇవ్వాలె. కుటుంబ పోషణ భారంగా మారింది. పనిలేక ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. -కందుల రవి, ఫొటో గ్రాఫర్‌

సీజన్‌ మొత్తం ఖాళీగానే ఉన్నాం..

మూడు నెలలు శుభకార్యాలు ఉండేవి. ఈ సీజన్‌లో కష్టపడి పనిచేస్తే ఏడాది మొత్తం చేతినిండా పని ఉండేది. లాక్‌డౌన్‌తో ఎవరూ ఫంక్షన్లు నిర్వహించడం లేదు. లక్షలు పోసి కొన్న కెమెరాలు ఇంట్లో పెట్టినం. షాపు కిరాయి, కుటుం బ పోషణ, ఇతర ఖర్చులతో ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం ఫొటోగ్రాఫర్లను ఆదుకోవాలని విజ్ఞప్తి        .-మహవీర్‌ శ్రీనివాస్‌, ఫొటోగ్రాఫర్‌


logo