శనివారం 04 జూలై 2020
Warangal-rural - May 31, 2020 , 03:55:02

వానకాలం సాగు విస్తీర్ణం 3,83,839 ఎకరాలు

వానకాలం సాగు విస్తీర్ణం 3,83,839 ఎకరాలు

  • గ్రామాల వారీగా ప్రణాళిక ఖరారు
  • 3,39,282 ఎకరాల్లో పంటలు
  • 44,557 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు
  • పత్తి పంట విస్తీర్ణం లక్ష్యం 2.11 లక్షల ఎకరాలు
  • వరి పంటలో 68,640 ఎకరాలు సన్నరకాలకు
  • ఆమోదముద్ర వేసిన కలెక్టర్‌ హరిత

వరంగల్‌రూరల్‌-నమస్తేతెలంగాణ : జిల్లాలో ఈ వానకాలం పంటల సాగుపై స్పష్టత వచ్చింది. గ్రామం వారీగా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు తయారు చేసిన యాక్షన్‌ ప్లాన్‌కు కలెక్టర్‌ హరిత ఆమోదముద్ర వేశారు. జిల్లాలో 3,83,839 ఎకరాల విస్తీర్ణంతో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు ప్రణాళిక ఖరారైనట్లు శనివారం జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్‌ వెల్లడించారు. ఇందులో వ్యవసాయ పంటల విస్తీర్ణం 3,39,282 ఎకరాలు, ఉద్యాన పంటల విస్తీర్ణం 44,557 ఎకరాలుగా ఉంది. ఈ వానకాలం నుంచి ప్రభుత్వం నియంత్రిత పంటల సాగు విధానం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు రైతుబంధు గ్రామ, మండల, జిల్లా కోఆర్డినేటర్లతో చర్చించి విలేజ్‌ యాక్షన్‌ ప్లాన్‌కు తుదిరూపం ఇచ్చారు. దీనిపై శుక్రవారం కలెక్టర్‌ హరిత వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. మొక్కజొన్న సాగు లేకుండా, వరి పంటలో అరవై శాతం సన్నరకాలు ఉండేలా రూపొందించిన ప్రణాళికను ఆమె పరిశీలించి కొన్ని మార్పులతో ఆమోదం తెలిపారు. 

రికార్డు స్థాయికి పత్తి పంట..

కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించిన జిల్లా పంటల సాగు ప్రణాళికలో తాజాగా స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ప్రభుత్వం ఖరారు చేసిన సాగు ప్రణాళికలో పత్తి సాగు విస్తీర్ణం 2.20 లక్షల ఎకరాలు ఉంటే ప్రస్తుతం అధికారులు ఫైనల్‌ చేసిన యాక్షన్‌ ప్లాన్‌లో 2,11,196 ఎకరాలకు తగ్గింది. గత వానకాలం జిల్లాలో రైతులు 1,74,190 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ వానకాలం పత్తి సాగు విస్తీర్ణం మరో 37,006 ఎకరాలు పెరగనుంది. విస్తీర్ణంలో జిల్లాలో పత్తి పంట ప్రథమ స్థానంలో ఉంటే వరి రెండో స్థానంలో నిలువనుంది. 1,10,573 ఎకరాల్లో వరి పంట విస్తీర్ణం ఖరారైంది. ఇందులో అరవై శాతం అంటే 68,640 ఎకరాల్లో సన్నరకాలు, 41,937 ఎకరాల్లో దొడ్డురకం సాగు చేసేలా ప్లాన్‌ చేశారు. గత వానకాలం జిల్లాలో 1,09,446 ఎకరాల్లో వరి సాగు చేశారు. గత వానకాలం 46,070 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న పంట వేశారు. ఈ వానకాలంలో పూర్తిగా మొక్కజొన్న సాగుకు బదులు పత్తి లేదా కంది, మిరప, పసుపు, వేరుశనగ, పెసర, కూరగాయ, పండ్లు, ఇతర పంటల సాగుకు అధికారులు ప్రణాళిక చేశారు. 8,221 ఎకరాల్లో వేరుశనగ, 6,161 ఎకరాల్లో కంది, 14,835 ఎకరాల్లో మిరప, 17,686 ఎకరాల్లో పసుపు, 5,538 ఎకరాల్లో కూరగాయ పంటలు, 2,584 ఎకరాల్లో మామిడి తోట సాగుకు రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించారు.logo